చెవులకు గోడలు

20 Nov, 2020 08:23 IST|Sakshi

గోడకు అందమైన పెయింటింగ్‌ తగిలిస్తే ఆ ఇంటికే అందం వస్తుంది. ఇల్లాలి మనసుకు ఆహ్లాదం కలుగుతుంది. చెవులకు తగిలించుకుంటే ఆ మహిళ చక్కటి అభిరుచికి, ఆధునికతకు ప్రతిరూపంగా కనిపిస్తుంది.  అవునండీ! కర్ణాటకలోని కొడగులో పుట్టి న్యూయార్క్‌లో కెరీర్‌ వెతుక్కున్న పూనమ్‌ పెయింటింగ్‌ ఆభరణాలతో ఒక ప్రయోగం చేసింది. ఆ ప్రయోగం న్యూయార్క్, పారిస్‌ ఫ్యాషన్‌ వీక్‌లలో విజయవంతమైంది. పూనమ్‌  ఆభరణాల డిజైనర్‌గా మారడానికి దారి తీసిన పరిస్థితి మాత్రం అత్యంత బాధాకరం. పూనమ్‌ 2017లో జేపీ మోర్గాన్‌ కంపెనీ న్యూయార్క్‌ ఆఫీస్‌లో పని చేసేది. గర్భిణి అని సంతోషించేలోపే ఆశాభంగం. ఉద్యోగంలో ఒత్తిడి కారణంగా గర్భస్రావం అయింది. ఎంత ప్రయత్నించినా మామూలు మనిషి కాలేకపోయిందామె. గాలి మార్పు కోసం మాతృదేశానికి వచ్చేసింది. ఆ రావడం... ఆమెను తిరిగి బాల్యంలోకి తీసుకెళ్లింది.

ఆకులు, తీగలతో ఆభరణాలు చుట్టిన జ్ఞాపకాలు ఆమెను పసితనంలోకి తీసుకెళ్లాయి. చిన్నపిల్లలాగ కొడగు తోటల్లో విహరిస్తూ పూల మొగ్గలతో చెవులకు లోలాకులు అల్లడంలో ఎక్కడలేని ఆనందం కలిగేదామెకు. ‘మళ్లీ కాలేజ్‌లో చేరి చదువుకుంటానని’ అనడంతో ఇంట్లో అందరూ ఆశ్చర్యపోయారు. కానీ, బాధ నుంచి బయటపడుతుందనే ఆశ వాళ్లందరిదీ. అలా మైసూర్‌లో జ్యువెలరీ కోర్సులో చేరింది. బంగారు, వెండి, వజ్రాలతో చేసేవి మాత్రమే ఆభరణాలు కాదు, మట్టి, లక్క, చెక్క, నూలు దారం, పట్టు దారాలతో కూడా అందమైన ఆభరణాలు తయారు చేయవచ్చు. దివ్యాంగులైన పిల్లలకు అలా ఆభరణాలు చేయడం నేర్పించింది.

కోర్సులో నేర్చుకున్న వాటితోపాటు తనకు వచ్చిన ఒక్కొక్క ఆలోచనను చేరుస్తూ ఆభరణంలో పొదుగుతూ వచ్చింది. అలా తయారైనవే పెయింటింగ్‌ ఇయర్‌ హ్యాంగింగ్స్‌. గోడలకు తగిలించుకునే పెయింటింగ్‌ల మీనియేచర్‌ రూపాలతో చేసిన చెవుల జూకాలు అవి. కొద్ది నెలలకు తిరిగి న్యూయార్క్‌కు వెళ్లింది పూనమ్‌. అయితే మళ్లీ పాత ఉద్యోగం చేయదలుచుకోలేదు. తనకు సాంత్వననిచ్చిన ఆభరణాల తయారీని మాలిక్యులస్‌ అనే పేరుతో న్యూయార్క్‌కి పరిచయం చేసింది. న్యూయార్క్‌తోపాటు పారిస్‌ ఫ్యాషన్‌ వీక్‌లలోనూ ప్రదర్శించింది. జైపూర్‌ మామూలు లోహాలలో రాళ్లు పొదిగిన ఆభరణాల తయారీ కుటీర పరిశ్రమలోని పాతికమంది మహిళలను కూడా ఐడియాల కోసం సంప్రదించింది పూనమ్‌. ఇప్పుడు మొత్తం పద్నాలుగు దేశాల్లోని అరవైకి పైగా డిజైనర్‌లతో కలిసి పని చేస్తోంది. ఆభరణాలకు ఉపయోగించే క్లే, లక్కకు బదులుగా చేసిన పాలిమర్‌ క్లే ప్రయోగం కూడా ఆమెకు కలిసొచ్చింది. 

మరిన్ని వార్తలు