Rajeshwari Thaman: ప్రాక్టీస్‌ న్యాయశాస్త్ర

11 Aug, 2022 10:06 IST|Sakshi

సమాజంలో మనం అన్యాయానికి గురైనప్పుడే న్యాయం గుర్తుకు వస్తే..  మన ఆలోచనల్లోనే అపసవ్యత ఉన్నట్టు. న్యాయం ఏంటో ముందుగానే తెలిస్తే .. అన్యాయాన్ని ధైర్యంగా ప్రశ్నించవచ్చు. మన జీవనంలో పుట్టుక నుంచి మరణం వరకు న్యాయపరమైన హక్కులు,  అవగాహన అవసరం. 

ఈ ఆలోచనతోనే న్యాయం పట్ల సమాజంలో సరైన అవగాహన కల్పించడం కోసం ‘ప్రాక్టీస్‌ న్యాయశాస్త్ర’ పేరుతో కాలేజీలు, కార్పొరేట్‌ ఆఫీసులు, జిల్లాల్లోనూ లీగల్‌ సదస్సులను ఉచితంగా నిర్వహిస్తున్నారు హైదరాబాద్‌ వాసి లాయర్‌ రాజేశ్వరి థమన్‌. బేగంపేట్‌ చికోటి గార్డెన్స్‌లో ఉన్న ఈ లాయర్‌ని కలిసినప్పుడు తాము చేస్తున్న కృషి గురించి వివరించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... 

‘‘న్యాయం గురించి తెలిస్తే మన చేతిలో కనపడని ఆయుధం మనకు రక్షణగా ఉన్నట్టే. న్యాయరంగంలో ఉన్నవారు ఏదో ఒక స్థాయికే పరిమితమై ఉండలేరు. ప్రాక్టీస్‌లోకి వచ్చిన తొమ్మిదేళ్లకు నలుగురికి ఉపయోగపడే పని ఏదైనా చేయాలనుకున్నాను. అలా, ఐదేళ్ల క్రితం న్యాయ రంగంలోకి కొత్తగా వస్తున్నవారికి శిక్షణ ఇస్తే బాగుంటుందని, మా సీనియర్స్‌తో కలిసి చర్చించాం. చదువుకూ–ప్రాక్టీస్‌కు మధ్య ఉన్న గ్యాప్‌ను పోగొట్టాలనుకున్నాం. దీంట్లో భాగంగా వెయ్యి మందికి పైగా జూనియర్‌ లాయర్లకు ఉచిత శిక్షణ ఇచ్చాం. ఇదే క్రమంలో లాయర్లకి మాత్రమే కాదు.. సమాజంలో అన్ని వర్గాల వారూ న్యాయం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనుకున్నాం.

ఐటీ ప్రొఫెషనల్స్‌కైతే కాపీరైట్, సైబర్‌ సమస్యలు, మీడియావారికి ఎంతవరకు స్వేచ్ఛ ఉండాలనే విషయాలు, కాలేజీ స్టూడెంట్స్‌కి న్యాయ పరంగా ఉన్న హక్కులు, అమ్మాయిలకు రక్షణ చట్టాలు, మహిళలకు ఆస్తికి సంబంధించిన సమస్యలు.. ఇలా ప్రతీ ఒక్కరికీ అవసరమైన న్యాయపరిజ్ఞానం అన్ని చోట్లా అందరికీ అవసరం అనుకున్నాం. దీంతో.. ఎ.పి.సురేష్‌ అండ్‌ అసోసియేట్స్‌తో కలిసి.. కార్పొరేట్, రియల్‌ ఎస్టేట్, ట్రస్ట్‌ అండ్‌ సేప్టీ, లిటిగేషన్, ట్రాన్జాక్షన్, ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్, క్రిమినల్, రాజ్యాంగం, పర్యావరణం, మానవహక్కులు, సైబర్‌ లా, మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగాల్లో లీగల్‌ కు సంబంధించిన విషయ పరిజ్ఞానం కలిగించడానికి మా వంతు కృషి చేస్తున్నాం. ఐదేళ్లుగా చేస్తున్న ఈ కృషికి మంచి స్పందన వస్తోంది. 

నోటి మాట ద్వారానే...
ఇప్పటి వరకు తెలిసిన వారి ద్వారానే మమ్మల్ని సంప్రదిస్తున్నవారున్నారు. మేమే కాలేజీలకు, యూనివర్శిటీలకు వెళుతున్నాం. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని జిల్లాలు, మండల స్థాయిలో లీగల్‌ క్యాంపులు ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. మాకున్న న్యాయపరమైన జ్ఞానాన్ని నలుగురికీ  పంచాలన్నదే మా ముఖ్య ఉద్దేశ్యం కాబట్టి, దీనికి ఎలాంటి ఫీజు తీసుకోవడం లేదు. హైదరాబాద్‌లోనే కాకుండా కర్నూలు, విజయవాడ ప్రాంతాల్లోనూ న్యాయశిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. తెలంగాణ గవర్నర్‌ తమిళిసై ఆధ్వర్యంలో జరిగిన మహిళా దర్బార్‌లోనూ లీగల్‌ సెల్‌ నుంచి పాల్గొని, మా వంతుగా ‘ప్రాక్టీస్‌ న్యాయశాస్త్ర’ గురించి మహిళలకు వివరించాం. 

గిరిజనులకు ప్రత్యేకం
గిరిజన ప్రాంతాల నుంచి కూడా కొంతమంది లాయర్లుగా వస్తున్నారని తెలుసుకున్నాం. అలాంటి వారు ఎవరున్నారో సమాచారం సేకరించి, నేరుగా వారిని సంప్రదిస్తున్నాం. మారుమూలప్రాంతాల నుంచి వచ్చే అలాంటి వారికి సరైన ప్రోత్సాహం అందించడానికి ప్రయాణ, వసతి సదుపాయాలు కూడా కల్పిస్తున్నాం. డాక్టర్లకు మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అనేది ఎప్పుడూ ఉంటుంది. కానీ, లీగల్‌ ఎడ్యుకేషన్‌ అనేది కంటిన్యూగా ఉండదు. ఇది గమనించే ఈ రంగంలో న్యాయవిద్య నిరంతరం అందించాలని చేస్తున్న ప్రయత్నం ఇది. 

అవగాహనే ప్రధానం.. 
ఒకరోజు 80 ఏళ్ల వయసున్న పెద్దాయన మా ఆఫీసుకువచ్చారు. ప్రభుత్వ ఉద్యోగం చేసి, రిటైర్‌ అయిన ఆయన తనకు ఈ వయసులో న్యాయశాస్త్రానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలనుందని చెప్పారు. మూడు రోజులు రెండు గంటల పాటు ఆయన మా క్లాసు విన్నారు. చాలా ఆనందమేసింది. నిజానికి టీనేజ్‌ నుంచే న్యాయపరమైన విషయాలు తెలుసుకుంటే వారి భవిష్యత్తు మరింత మెరుగ్గా ఉంటుంది.  

మద్దతు కోసం వెతుకుతున్నారు.. 
ఇన్నేళ్ల భారతావనిలో ఇంకా ఈ రంగంలో మహిళలు వెనుకంజలోనే ఉన్నారు. సపోర్ట్‌ కోసం చూస్తున్నారు. దీనికి కారణం.. ఇల్లు, పిల్లలు, పెద్దలు, ఆచారాలు, సంప్రదాయాలు, ఆంక్షలు.. ఇంకా ఎన్నో బాధ్యతలు. ఎవరైనా ధైర్యంగా మాట్లాడితే.. ‘ముందు మీ కుటుంబాన్ని చక్కదిద్దుకోండి. తర్వాత బయట సమస్యలు చూద్దురు’ అంటారు. ఇలాంటి ఆలోచనా ధోరణి మారితే లాయర్లుగా మహిళల సంఖ్య పెరుగుతుంది. అయితే, ఈ రంగంలో మహిళలు వెనుకంజ వేయడానికి కారణాలు లేకపోలేదు. ముందు ఈ రంగంలో వెంటనే పెద్దగా డబ్బులు రావు.

ఉదయాన్నే తొమ్మిదింటికి బయటకు వెళితే సాయంత్రం 5 వరకు కోర్టులోనే. ఆ తర్వాత ఇంటికి వచ్చాక ఇంటిపనులు, పిల్లల పనులు, ఆ తర్వాత మళ్లీ రేపటి కేసు గురించి స్టడీ చేయాల్సి ఉంటుంది. దీంతో కుటుంబ పరిస్థితే స్త్రీల ఆశయాన్ని వెనకంజవేసేలా చేస్తుంది. ఇప్పటికీ ఈ రంగంలో ఢీ అంటే ఢీ అనే మహిళలను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. అమ్మాయిలు కూడా సౌకర్యంగా ఉండే ఉద్యోగాల వైపే చూస్తారు. ఇప్పటికైనా న్యాయరంగంలోకి వచ్చేవారు సరైన సబ్జెక్ట్‌ ఉండేలా, బలంగా వాదించే సమర్థత గలవారుగా ఎదగాలి. ఆ అవగాహన రావడం కోసం చేస్తున్న ప్రయత్నమే ‘ప్రాక్టీస్‌ న్యాయశాస్త్ర’.

మా వర్క్‌ ద్వారా వచ్చే డబ్బునే ఈ అవగాహన సదస్సుల కోసం ఖర్చుచేస్తున్నాం. ఉన్న జ్ఞానాన్ని కొంత వరకైనా పంచగలిగితే అందరికీ న్యాయం గురించి అవగాహన కలగుతుందన్నదే మా ఉద్దేశ్యం’’ అని వివరించారు ఈ లాయర్‌. 

‘మాకు న్యాయం చేయండి’ అనే వేడుకోలుకు ముందు న్యాయం గురించి తెలుసుకుంటే అన్యాయాన్ని ఎదుర్కొనే సామర్థ్యం సులువుగా వస్తుంది. ఈ విషయాన్ని ఇక్కడి లీగల్‌ క్లాసులకు హాజరైనవారు చెబుతున్నప్పుడు మారబోతున్న సమాజచిత్రం కళ్లముందు ఆవిష్కృతమైంది.
– నిర్మలారెడ్డి 

మరిన్ని వార్తలు