బాలీవుడ్‌ నిర్మాత బీచ్‌ క్లీనింగ్‌.. ఇంటినుంచే మొదలు కావాలని

11 Nov, 2021 08:45 IST|Sakshi

Pragya Kapoor: ముంబైలోని ఒక ఖరీదైన స్కూలుకు గెస్ట్‌గా వెళ్లింది ప్రజ్ఞా కపూర్‌. అక్కడ పిల్లలతో సరదాగా సమావేశం అయింది. ‘ఈ సినిమాలో హీరో ఎవరు?’ ‘ఈ పాట ఏ సినిమాలోనిది?’ ‘ఇంగ్లాండ్‌ క్రికెట్‌ కెప్టెన్‌ ఎవరు?’ ‘ఫలానా మ్యాచ్‌లో ఫలానా ఆటగాడు ఎన్ని పరుగులు చేశాడు?’... వంటి విషయాలు అడిగితే తడుముకోకుండా జవాబులు చెప్పిన పిల్లలు పర్యావరణ స్పృహకు సంబంధించిన చిన్న చిన్న ప్రశ్నలు వేసినప్పుడు మాత్రం జవాబులు చెప్పలేక ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు!

ప్రజ్ఞా కపూర్‌ పేరు  వినబడగానే బాలీవుడ్‌లో ‘కేదార్‌నాథ్‌’లాంటి సినిమా గుర్తుకు వస్తుంది. ఈ సినిమాకు ఆమె నిర్మాత. ఈ సినిమాకు సంబంధించిన నిర్మాణ విలువలకు మంచి ప్రశంసలు లభించాయి. అయితే ఆమె తన శక్తియుక్తులను సినిమా మాధ్యమానికి  మాత్రమే పరిమితం చేసుకోవాలనుకోవడం లేదు. పర్యావరణ స్పృహకు సంబంధించిన ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తుంది.

బీచ్‌ క్లీనింగ్‌లో తాను పాల్గొనడమే కాదు భర్త అభిషేక్‌ కపూర్‌ (దర్శకుడు, నిర్మాత)ను, ఇద్దరు పిల్లలను భాగస్వామ్యం చేస్తుంది. ‘పర్యావరణ స్పృహ ఇంటినుంచే మొదలు కావాలి... అయితే ‘ఇల్లే ప్రపంచం అనే భావనలో ఉండకూడదు’ అనే ఉద్దేశంతో పిల్లలను బయటి ప్రదేశాలకు తీసుకెళ్లి, ప్రకృతి పాఠాలు చెబుతుంటుంది ప్రజ్ఞ. తనకు తీరిక దొరికినప్పుడల్లా స్కూల్స్‌కు వెళ్లి విద్యార్థులతో ముచ్చట్లు పెడుతుంది. సరదాగా మొదలైన ముచ్చట్లు ఆ తరువాత పర్యావరణంపై వెళతాయి. అకాడమిక్‌ పాఠంలా కాకుండా ఒక సైన్స్‌–ఫిక్షన్‌ సినిమాలా వారికి పర్యావరణానికి సంబంధించిన విషయాలు చెబుతుంది. తిరిగి వెళ్లేటప్పుడు ఇలా అంటుంది... ‘ఫ్రెండ్స్, మీకు చాలా విషయాలు చెప్పాను కదా. అంటే మీరు నాకు బాకీ ఉన్నారన్నమాట. కొద్దిరోజుల తరువాత ఇక్కడికి వస్తాను. మీరు కూడా నాకు కొన్ని విషయాలు చెప్పాలి’ ‘అలాగే. తప్పకుండా’ అంటారు పిల్లలు.

మళ్లీ ఎప్పుడైనా తాను ఆ స్కూల్‌కు వెళ్లినప్పుడు...పిల్లలు ఎన్నెన్ని విషయాలు చెబుతారో! అవన్నీ పర్యావరణానికి సంబంధించినవే. ‘పర్యావరణ జ్ఞానం అనేది పెద్దలకు సంబంధించిన విషయం మాత్రమే అనుకుంటారు చాలామంది. ఇది తప్పు. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని పిల్లలకు పర్యావరణ స్పృహ కలిగించాల్సిన అవసరం ఉంది’ అంటున్న ప్రజ్ఞాకు ‘ఫిల్మ్‌ ప్రొడ్యూసర్‌’గా కంటే పర్యావరణ వేత్తగా పిలిపించుకోవడం అంటేనే ఇష్టం. ప్లాస్టిక్‌ కాలుష్యం నుంచి వాతావరణ మార్పు వరకు రకరకాల విషయాల గురించి తన భావాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటుంది ప్రజ్ఞా కపూర్‌. ఇప్పుడు ఆమె స్ఫూర్తితో ఎంతోమంది వాలంటీర్లు తయారయ్యారు.

చదవండి: నడిచి వచ్చిన తులసి చెట్టు

మరిన్ని వార్తలు