పల్లె బృందావనంలో గోమాతలు

12 Dec, 2020 08:33 IST|Sakshi
గోశాలలో గాయత్రి, సంరక్షణలో లేగదూడ

పాతికేళ్ల తర్వాత అమ్మమ్మ ఊరు వెళ్లిన గాయత్రికి అక్కడ కబేళాకు తరలిస్తున్న రెండు ముసలి ఆవులు కనిపించి, మనసు కరిగిపోయింది. రైతులను బతిమిలాడి ఆ ఆవులను తీసుకొచ్చి వాటికి ఒక చోటు, నెలకు సరిపడా గ్రాసం ఏర్పాటు చేసింది. అది మొదలు ‘ఇక పోషించలేం అనుకున్న రైతుల దగ్గర నుంచి రెండేళ్లుగా ఒక్కొక్క ఆవును ఒక దగ్గరకు చేరుస్తూ వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకుంటోంది. ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని తాటిచర్లలో అలా ఇప్పటివరకు 84 ఆవులతో గో క్షేత్రాన్ని ఏర్పాటు చేసింది గాయత్రి గుండపంతుల. బ్యాంకు ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్, బెంగళూరులకు వెళ్లినా నలుగురు మనుషులను గో సంరక్షణ కోసం ఏర్పాటు చేసి, వాటి బాగోగులను చూసుకుంటున్న గాయత్రిని కదిలించినప్పుడు ఎన్నో విశేషాలను ఇలా పంచుకున్నారు ఆమె.

‘‘మా అమ్మమ్మ గారి ప్రకాశం జిల్లా ఊరైన తాటిచర్లకు పాతికేళ్ల్ల తర్వాత వెళ్లాను. నా చిన్నప్పుడు చూసిన పల్లెకు ఈ పల్లెకు ఏ మాత్రం పోలిక లేదనిపించింది. ఎక్కడా జీవకళ అనేదే కనిపించలేదు. దాదాపు ఏడెనిమిదేళ్లుగా అక్కడ వర్షాలు లేకపోవడంతో పచ్చటి పంట పొలాలు లేవు. యువతరం పల్లెను వదిలి పట్టణాలకు వెళ్లిపోయారు. వృద్ధులు మాత్రం మిగిలారు అక్కడ. వారితో పాటు వృద్ధ గోమాతలు. వాటిని పోషించలేక రైతులు అమ్మేసుకుంటున్నారు. అది చూసి మనసు కలత పడింది. చిక్కిశల్యంగా ఉన్న రెండు గోవులను కబేళాకు తరలిస్తుంటే అక్కడివారికి నచ్చజెప్పి, వాటిని కాపాడగలిగాను. తెలిసిన వారి గోశాల ఉంటే అందులో వాటిని ఉంచి, పోషణ బాధ్యతలను అప్పజెప్పి తిరిగి హైదరాబాద్‌ వచ్చేశాను.

నేను బ్యాంకు ఉద్యోగిని. డిగ్రీ చదువుకునే కొడుకు, ఫార్మాసిస్ట్‌ అయిన భర్త.. ఇదీ నా కుటుంబం. ఊళ్లో జరిగిన విషయాలను ఇంట్లో చెప్పాను. గోవులను సంరక్షించే బాధ్యతలో తామూ పాలుపంచుకుంటామని ఇద్దరూ చెప్పారు. దీంతో ప్రతి 15 రోజులకు ఒకసారి తాటిచర్లకు వెళ్లే ప్లాన్‌ చేసుకున్నాను. వెళ్లినప్పుడల్లా దీనంగా కనిపించిన గోవులను గోశాలకు చేర్చడం, వాటి సంరక్షణకు మనుషులను నియమించడం, గ్రాసం ఏర్పాట్లు చూడటం.. ఇదే పనిగా పెట్టుకున్నాను. ఇప్పుడా గోవులు జీవకళతో కనిపించడం నాకు ఎనలేని సంతోషాన్ని, సంతృప్తిని ఇస్తోంది. 

ఇప్పుడు అక్కడ వర్షాలు పడుతున్నాయి..!
రెండేళ్లుగా ఇప్పుడక్కడ వర్షాలు బాగా పడుతున్నాయి. రైతులు వరి పంట వేసుకుంటున్నారు. గోవులున్నాయి కాబట్టి వర్షాలు పడుతున్నాయనే ఆలోచన అక్కడి వారిలో వచ్చింది. పంట చేతికి వచ్చినప్పుడు గడ్డి తీసుకొచ్చి ‘మా వంతుగా ఈ గ్రాసం’ అని గోశాలకు ఓ మోపు గడ్డి ఇచ్చి వెళుతుంటారు. ఇది మంచి పరిణామంగా అనిపిస్తుంటుంది నాకు. కొందరు అవసరం కోసం తప్పక ఆవును అమ్మాలని చూస్తారు. కానీ, ఆవుతో వారికి అనుబంధం ఉంటుంది. చూస్తూ చూస్తూ వాటిని రోడ్డున వదిలేయలేరు. కబేళాకు అమ్మనూ లేరు. దీంతో తమ దగ్గర సాకలేని ఆవులను తీసుకొచ్చి, మా గోశాలలో వదులుతుంటారు. చుట్టుపక్కల హైవేలో ఎవరి పోషణా లేకుండా తిరిగే ఆవులు ఒక్కోసారి ప్రమాదాలకు గురవుతుంటాయి. అలాంటివాటిని మా గోశాలకు తీసుకొచ్చి వదులుతుంటారు అలా ఇప్పటి వరకు గోశాలలో 84 ఆవులు చేరాయి. అందులో నాలుగు ఆవులకు దూడలు పుట్టాయి. ఆ లేగదూడలతో కాసేపు గడిపితే చాలు– మనసుకు ఎంతో సంతృప్తిగా అనిపిస్తుంది.  

సకాలంలో వైద్య సదుపాయాలు
రెండేళ్లలో హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు ట్రాన్స్‌ఫర్‌ అయ్యింది. బెంగళూరు వెళ్లినా నా చూపు పల్లెవైపే ఉంటుంది. మా వారు రవిశంకర్‌ ఫార్మసిస్ట్‌ కావడంతో గోవులకు ఏ చిన్న మెడికల్‌ అవసరం వచ్చినా తగిన వైద్యం అందించే ఏర్పాట్లు చేశారు. అలా వైద్య సిబ్బంది ప్రతి పదిహేను రోజులకు ఒకసారి వచ్చి గోవులకు మెడికల్‌ చెకప్‌ చేసి వెళతారు. మా వారు, మా అబ్బాయి కూడా ప్రతి నెలా గోశాలకు వెళ్లి ఆవులను చూసి, ఏ చిన్న అసౌకర్యం లేకుండా చూసుకొని తిరిగి వస్తారు. అలా మా కుటుంబం గోశాల సంరక్షణ బాధ్యత తీసుకుంది.

ఈ క్రమంలో మా బంధువు, విజయవాడ వాసి అయిన నాగేంద్ర మామయ్య ఆస్ట్రేలియాలో పదిహేనేళ్లు ఉండి సొంతూరుకు వచ్చారు. ఈ క్రమంలో ఆయన గోశాలకు వచ్చి, ఆవు దూడలతో అనుబంధాన్ని పెంచుకున్నారు. తాను ఇక గోశాలలోనే ఉండిపోతానన్నారు. మేం ముగ్గురం కలిసి గోశాలకు ‘శ్రీ దత్త బృందావన గో క్షేత్రం’ అని నామకరణం చేసి ట్రస్ట్‌గా ఏర్పడ్డాం. గణపతి సచ్చిదానంద స్వామి దగ్గరకు వెళ్లిన సమయంలో గోశాల గురించి చెప్పినప్పుడు ఆయన చాలా సంతోషించారు. ‘ఆ ఆవులు ఉన్నన్ని రోజులు వాటిని సాకుతూ ఉండండి’ అన్నారు. ఓ మంచి ప్రయత్నం మొదలుపెడితే అన్ని అనుకూలతలు అవే ఏర్పడతాయని అర్థమైంది. 

ముందు తరాలకూ అందించాలి..
గో సంరక్షణ గురించి ఈ తరానికి తెలియాలి. అది మనమే నేర్పించాలి. గోవులనే కాదు ఏ ధార్మిక కార్యక్రమమైనా పిల్లలు అలవర్చుకునేలా చేస్తే ముందు తరాలకు మన సంస్కృతిని అందించిన వాళ్లం అవుతాం’ అని వివరించారు గాయత్రి. మంచి పని ఎప్పుడూ మరికొందరికి మార్గం చూపుతూనే ఉంటుంది. ఉద్యోగాలు చేసుకుంటూ, పట్టణ జీవనంలో తీరికే లభించదు అనుకునేవారికి గాయంత్రిలాంటి వారు చేస్తున్న ఇలాంటి సేవా కార్యక్రమాలు ఓ కొత్త ఆలోచనా పథం వైపు నడిచేలా చేస్తాయి. కర్తవ్యాన్ని బోధిస్తాయి. 
– నిర్మలారెడ్డి

మరిన్ని వార్తలు