Pranav Sharma: తండ్రి ఇచ్చిన డబ్బు, లోన్‌తో నిర్మాణరంగ ప్రయాణం మొదలుపెట్టి.. ఏకంగా ఇప్పుడు

6 May, 2022 16:50 IST|Sakshi

ఇల్లు కట్టి చూపాడు!

Pranav Sharma Inspirational Journey: ఇల్లు కట్టి చూడు... అంటారు ఇంటినిర్మాణం కష్టాలు చెప్పేలా. ఒక్క ఇల్లు ఏం ఖర్మ...పాతికేళ్ల వయసులోనే వెయ్యి ఇండ్లను నిర్మించి, దిగువ మధ్యతరగతి వారి సొంత ఇంటి కలను నిజం చేశాడు ప్రణవ్‌ శర్మ, ఫెలిసిటీ అడోబ్, ఫౌండర్‌. కడుపులో చల్ల కదలకుండా చల్లగా ఉద్యోగం చేసుకోవడం అంటే కొందరికి ఇష్టం. కొందరికి మాత్రం ఆ చల్లదనం వేడిపుట్టిస్తుంది. ఫైర్‌ను ప్రజ్వరిల్లేలా చేస్తుంది. ప్రణవ్‌శర్మ రెండో కోవకు చెందిన యువకుడు.

రాజస్థాన్‌లోని జైపూర్‌కు ఇరవైకిలోమీటర్ల దూరంలో ఉన్న టైర్‌2 సిటీ సంగనేర్‌కు చెందిన శర్మ మాన్యుఫ్యాక్చరింగ్‌ ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్‌. చదువు పూర్తికాగానే బెంగళూరులోని డెలాయిట్‌లో మెనేజ్‌మెంట్‌ ఇంటర్న్‌గా చేరాడు. ఆరోజుల్లో ఒకరోజు ‘ప్రధాన మంత్రి ఆవాస్‌ యెజన’ గురించి విన్న తరువాత తనలో ఒక ఐడియా మెరిసింది.

ఆరునెలలు ఉద్యోగం చేసిన తరువాత, ఆ ఉద్యోగానికి గుడ్‌బై చెప్పి ‘ఫెలిసిటీ అడోబ్‌’ అనే నిర్మాణసంస్థను మొదలుపెట్టాడు. తండ్రి అశోక్‌శర్మ రిటైర్డ్‌ ఆయుర్వేద వైద్యుడు. ఆయన దగ్గర తీసుకున్న డబ్బు, లోన్‌తో తన నిర్మాణరంగ ప్రయాణం మొదలైంది.

‘హాయిగా ఉద్యోగం చేసుకోకుండా ఈ రిస్క్‌ ఎందుకు!’ ‘నిర్మాణరంగం అంటేనే రిస్క్‌. కాకలు తీరినవారు కూడా ఖంగు తింటుంటారు’....ఇలాంటి మాటలు అతడికి వినిపించాయి. వాటిని ప్రణవ్‌ పెద్దగా పట్టించుకోలేదు.

టైర్‌ సిటీలలో సొంత ఇల్లు అనే డిమాండ్‌ రోజురోజుకూ పెరుగుతుంది. టైర్‌సిటీకి చెందిన తనకు కోర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, శానిటైజేషన్, స్వచ్ఛమైన తాగునీరు, ఎలక్ట్రిసిటీ, పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌....మొదలైన విషయాల గురించి అవగాహన ఉంది.

‘స్థిరమైన అభివృద్ధికి సంబంధించిన అంశాలను కాలేజీలో కంటే బయటే ఎక్కువ నేర్చుకున్నాను’ అంటాడు శర్మ. ‘ఇంటి అద్దె ఖర్చులతోనే సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి’ అనే ప్రకటనతో రంగంలోకి దిగాడు.

నెల తిరగకుండానే 300 అప్లికేషన్‌లు వచ్చాయి. బుకింగ్‌ అడ్వాన్స్‌లు వచ్చాయి. ఈ సంతోషం ఆవిరి అయ్యేలా అప్లికేషన్‌లను బ్యాంకులో సమర్పిస్తున్నప్పుడు సమస్యలు తలెత్తాయి.

ఈ నేపథ్యంలో యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ,ఐసీఐసీఐ...మొదలైన బ్యాంకుల నుంచి అప్రూవల్‌ ప్రాసెస్‌ గురించి సలహాలు, సూచనలు తీసుకున్నాడు. లోన్‌ ప్రాసెస్‌ గురించి క్లయింట్స్‌కు సులభంగా అర్థమయ్యేలా చెప్పడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశాడు. అలా తొలిదశలో స్వర్ణగృహ–1 పదహారు నెలల్లో పూర్తయింది.

‘తక్కువ ధర, తక్కువ కాలం’ అయినంత మాత్రాన నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నాణ్యమైన నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు శర్మ. తుమకూర్, వసంతనరసపుర(కర్నాటక)లో రెండో దశ నిర్మాణం పూర్తయింది. కోలార్‌లో మూడో దశ మొదలైంది. బెల్గామ్‌లోని బెల్గవిలో నాలుగో దశ నిర్మాణం మొదలుకానుంది.

2028 నాటికి 50,000 హౌసింగ్‌ యూనిట్‌లను నిర్మించాలని 26 ఏళ్ల ఈ యంగ్‌బిల్డర్‌ లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇది మాత్రమే కాకుండా కరువుపీడిత ప్రాంతాలలో సోలార్‌ ప్రాజెక్ట్‌ల నిర్మాణం కోసం రంగంలోకి దిగాడు.

‘నా విజయం యువతరానికి స్ఫూర్తి ఇచ్చి, సొంతకాళ్ల మీద నిలబడే ధైర్యాన్ని ఇస్తే అంతకంటే కావాల్సింది ఏముంది!’ అంటున్నాడు ప్రణవ్‌ శర్మ. ‘కొందరికి తమ విజయాల గురించి ప్రత్యేకంగా చెప్పనవరం లేదు. వారు చేసిన పనే మాట్లాడుతుంది. ప్రణవ్‌శర్మ ఈ కోవకు చెందిన వ్యక్తి’ అని ప్రశంసిస్తున్నారు నేషనల్‌ బ్యాంక్, హోమ్‌లోన్స్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ప్రవీణ్‌ ప్రకాష్‌.

చదవండి👉🏾 చిరుద్యోగి నుంచి సీయీవో దాకా!

మరిన్ని వార్తలు