పాండవులతో ద్రుపదుడు ఏమన్నాడో తెలుసా?

31 Mar, 2021 06:36 IST|Sakshi

► పాండవులతో ధ్రుష్టద్యుమ్నుడు ఏమన్నాడు? 
పాండవులను ద్రుపదుడు ఆహ్వానించాడని, వారి ఆహ్వానాన్ని అంగీకరించమని చెప్పి బయలుదేరాడు. వాని వెంట పాండవులు కూడా బయలుదేరడానికి సిద్ధమయ్యారు.

 పాండవులు ఏ రథాన్ని ఎక్కారు?
రాజులకు తగిన రత్నఖచిత రథం ఎక్కి, రాజభవనం చేరారు.

► ద్రుపదుడు ఏమనుకున్నాడు?
ద్రుపదుడు వారిని క్షత్రియులుగా గుర్తించి, సంబరపడ్డాడు. ఆదరంతో ఆసనాలు ఇచ్చాడు.

► పాండవులతో ద్రుపదుడు ఏమన్నాడు?
మీరు దేవతలో, గంధర్వులో తెలియట్లేదు. మీ కులగోత్రాలు తెలిసిన తరవాతే ద్రౌపదినిచ్చి వివాహం చేస్తాను. అంతవరకు వివాహానికి సమ్మతించలేను అన్నాడు ద్రుపదుడు.

► ద్రుపదుడి మాటలకు ధర్మరాజు ఏమని సమాధానమిచ్చాడు?
రాజా! మేము అయిదుగురం క్షత్రియులం. పాండురాజు కుమారులం. నేను పెద్దవాడిని. ధర్మరాజుని. వీరు నలుగురు భీమ అర్జున నకుల సహదేవులు. ఈమె మా తల్లి కుంతీదేవి అన్నాడు.

► ధర్మరాజు మాటలకు ద్రుపదుడు ఎలా ఉన్నాడు?
ద్రుపదుడి కళ్లలో ఆనందబాష్పాలు జలజలరాలాయి. లక్క ఇంటి దహనం దగ్గర నుంచి మొత్తం వృత్తాంతం తెలుసుకుని, వారికి ఇష్టమైన వస్తువులు ఇచ్చాడు. వారిని రాజభవనంలో ఉంచాడు.

 ద్రుపదుడి ప్రతిపాదనకి ధర్మరాజు ఏమి చెప్పాడు?
మహారాజా! మా తల్లి కుంతి, ఆమె మాట జవదాటం. ద్రౌపది మా అయిదుగురికి భార్య కావాలి అని ఆవిడ అంది. అట్లే కానివ్వండి. ద్రౌపదిని మేం అయిదుగురం వివాహమాడతాం... అన్నాడు ధర్మరాజు.

ధర్మరాజు మాటలకు ఆశ్చర్యపడిన ద్రుపదుడు ఏమన్నాడు?
ధర్మరాజా! లోకంలో ఒక పురుషునికి అనేకమంది భార్యలు ఉండటం తెలుసు. కాని ఒక స్త్రీకి అనేకమంది భర్తలు ఉండటం వినలేదు. అది ఏ యుగంలోనూ, ఏ పురాణంలోనూ లేదు. నువ్వు ధర్మజ్ఞుడివి. నీ మాటలు ధర్మవిరుద్ధం కాకపోవచ్చు. అయినా కుంతి, మీరు, ధృష్టద్యుమ్నుడు ఆలోచించండి, రేపు నిర్ణయిద్దాం అన్నాడు.

ద్రుపద సభకు వచ్చిన వేదవ్యాసమహర్షిని ఏ విధంగా ఆదరించారు?
వేదవ్యాసునికి అందరూ పాదాభివందనం చేశారు. ఆసనం చూపి, అందరూ కూర్చున్నారు. అప్పుడు ద్రుపదుడు, ఒక భార్య పలువురు భర్తలు లోకవిరుద్ధం కదా అని తన సందేహాన్ని వెలిబుచ్చాడు. 
– నిర్వహణ: వైజయంతి పురాణపండ

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు