Pravasi Bharatiya Divas: విదేశాల్లో ఉన్నా స్వదేశంలో సేవ

8 Jan, 2023 00:47 IST|Sakshi

రేపు ప్రవాసీ భారతీయ దివస్‌

జీవితంలో అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో విదేశాలకు వెళ్లినవారు తమను తాము నిరూపించుకునే దిశగా సాగుతారు. కలల లక్ష్యాలను చేరుకోవడానికి శ్రమించడంతో పాటు తమ చుట్టూ ఉన్నవారికి చేయూతనివ్వాలనుకుంటారు. తమ మూలాలను గుర్తుపెట్టుకొని సొంత గడ్డ అభ్యున్నతికి పాటుపడాలని తపిస్తుంటారు. వారి ఆలోచనలతో మరికొందరి అడుగులకు స్ఫూర్తిగా నిలుస్తారు. విదేశాల్లో తాము ఎంచుకున్న రంగాల్లో కృషి చేస్తూనే సేవా కార్యక్రమాల ద్వారా స్వదేశంలో ఉన్నవారికి చేయూతనందిస్తున్నారు విజయవాడ వాసి అయేషా, ఖమ్మం జిల్లా వాసి ఝాన్సీ.

పిల్లలకు కష్టం విలువ తెలియాలని..
విజయవాడ నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు ఆయేషా. ఉద్యోగం, కుటుంబం బాధ్యతలతో బిజీగా ఉన్న ఆమె సేవాకార్యక్రమాలవైపు మళ్లిన ఆలోచనావిధానం గురించి తెలిపారు.   ‘మా కుటుంబంతో కాలిపోర్నియాలో స్థిరపడ్డాను.

నేను చేస్తున్న సేవాకార్యక్రమాలకు ఇటీవల నాన్‌ప్రాఫిట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డ్‌ కూడా అందుకున్నాను. ఉద్యోగినిగా ఉన్న నేను మొదట ఒక తల్లిగా మా పిల్లలకు సేవా ప్రపంచాన్ని పరిచయం చేయాలనుకున్నాను. అదే సమయంలో మా చుట్టుప్రక్కల ఉండే పిల్లల పరిస్థితి గమనించాను. పిల్లల్లో మానవతా విలువలు పెంచాలని కమ్యూనిటీ సర్వీస్‌ చేయాలనే సదుద్దేశంతో ఏడేళ్ల క్రితం ఎంపవర్‌ అండ్‌ ఎక్సెల్‌ సంస్థని ప్రారంభించాను. ఇప్పుడు వందలాది మందికి పైగా వలెంటీర్లు మా ఆర్గనైజేషన్‌లో సేవలందిస్తున్నారు.

మా అమ్మనాన్నలు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నారు. వారిని చూడటం కోసం మొదట మా పిల్లలను తీసుకొని ఇండియాకు వచ్చేదాన్ని. మారుమూల గ్రామాల్లోని పాఠశాల పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసు కాబట్టి, ఆ స్కూళ్లలో లైబ్రరీలను ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చింది. స్వచ్ఛందంగా పనిచేసే మిత్రులు కొందరు పరిచయమయ్యారు. వారితో నిరంతరం కాంటాక్ట్‌లో ఉంటూ అమెరికాలో మేమున్న ప్రాంతంలో సేకరించిన పుస్తకాలను ఆంధ్రాలోని గ్రామాల స్కూళ్లకు అందజేసేవాళ్లం. ఈ కార్యక్రమం ప్రతియేటా నిర్వహించేవాళ్లం.

నాతోపాటు ప్రతి యేటా వలెంటీర్లుగా వర్క్‌ చేసే పిల్లలు కనీసం పదిమందినైనా ఇండియాకు తీసుకువచ్చేదాన్ని. వారితో ఇక్కడి స్కూల్‌ పిల్లలకు వర్క్‌షాప్స్‌ కండక్ట్‌ చేసేదాన్ని. ఆ తర్వాత సమస్యలు తెలుస్తున్న కొద్దీ వాటి మీద దృష్టి పెడుతూ వచ్చాను. అందరం ఉపాధి కోసం విదేశాలకు వచ్చినవాళ్లమే. కాని మా మూలాలను ఎప్పటికీ మర్చిపోలేం.

ఈ పరిస్థితులలోనే స్వదేశంలోని పిల్లలకు సర్వీస్‌ చేయాలనుకున్నాను. ట్రైబల్‌ ఏరియాలోని పిల్లలకు మా సేవలు అందేలా కృషి చేస్తుంటాను. స్వచ్ఛంద సంస్థల ద్వారా మా సేవకార్యక్రమాలను నిర్వహిస్తుంటాం. నిరుపేదలకు ఏదైనా సాయం కావాలని మా దృష్టికి వస్తే ఇక్కడ ఫండ్‌ రైజింగ్‌ కి వెబ్‌సైట్‌ లో ప్రకటిస్తాం. ఇప్పటి వరకు మనవాళ్లు ఎవరో ఒకరు స్పందిస్తూనే ఉన్నారు’’ అని తెలిపారు ఆయేషా.

మహిళల శ్రేయస్సు కోసం..
ఖమ్మం జిల్లా వాసి హనుమాండ్ల ఝాన్సీరెడ్డి. అమెరికాలో రియల్‌ ఎస్టేట్‌ రంగంలో తనదైన ముద్ర వేశారు. మహిళలు, బాలికల సంక్షేమం కోసం అక్కడే ‘వెటా’ పేరుతో స్వచ్ఛంద సంస్థను స్థాపించి, వివిధ కార్యక్రమాల ద్వారా సేవలందిస్తున్నారు. అలాగే, పుట్టి పెరిగిన గడ్డకు మేలు చేయాలనే ఆలోచనతో స్వదేశంలోనూ సేవాకార్యక్రమాలు చేస్తున్నారు.


‘‘లక్ష్యం పెద్దదిగా ఉండాలి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా దానిని సాధించే దిశగానే మన అడుగులు ఉండాలి. ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ అమెరికా వెళ్లి, అక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు చేశాను. పిల్లలు పుట్టాక వారిని చూసుకునే క్రమంలో ఉద్యోగాన్ని మానేసి, రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి వచ్చాను. ఒక మహిళ ఏం చేస్తుంది ఈ రంగంలో అనుకునేవారికి నా విజయం ద్వారానే సమాధానం చెప్పాను.

అమెరికాలోని మన భారతీయ మహిళల సమస్యల గురించి అర్థం చేసుకున్నాను. సొంతంగా ఎదగాలనుకునేవారు, ఉద్యోగాలు చేయాలనుకునేవారు, గృహహింస వంటి బాధలు పడేవారు .. అన్ని రకాలుగా జీవితంతో పోరాటం చేసేవారున్నారు. అలాంటివారి శ్రేయస్సు కోసం పనిచేయాలని ‘వెటా’ను స్థాపించాను. మన విజయాలను మన అనుకున్న నలుగురికి కూడా పంచాలి. మా సొంత ఊళ్లకు వచ్చినప్పుడు అక్కడి పరిస్థితులను గమనించి అభివృద్ధి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ వచ్చాం. మా ఊరు బనిగండ్లపాడు గ్రామంలోనే కాదు, మా వారు పుట్టి పెరిగిన వరంగల్‌ జిల్లా తొర్రూరులోనూ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం.

గ్రంథాలయాలను ఏర్పాటు చేశాం. స్కూల్‌ భవనాలను కట్టించి, ప్రభుత్వానికి అప్పజెప్పాం. తొర్రూరులో హాస్పిటల్‌ కట్టించాం. గ్రామపంచాయితీ ఆఫీసు వంటివి ఏర్పాటు చేశాం. మా చుట్టుçపక్కల మరో ఆరుగ్రామాల వరకు మా సేవలు అందిస్తుంటాం. విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నది మా ఆలోచన. అందుకే, పేద విద్యార్థులకు ప్రతియేటా ఆర్థిక సాయం చేస్తుంటాం. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా మాకు చేతనైంత సాయం అందించాలన్నదే మా సిద్ధాంతం. ముందుగా మనకు మనంగా ఎదగాలి. అందుకోసం ఎంతటి కష్టమైనా పడాలి. అలాగే, నలుగురి మేలు కోసం పాటుపడినప్పుడే మన జీవితానికి సంతృప్తి లభిస్తుంది’’ అని వివరించారు ఝాన్సీరెడ్డి.

మరిన్ని వార్తలు