పూల తోటల్ని గట్టెక్కించుకోండిలా!

22 Oct, 2020 20:30 IST|Sakshi

అధిక వర్షాల వల్ల చీడపీడల ఉధృతి

 తేమ పెరగడంతో తెగుళ్లు

సస్యరక్షణ చర్యలపై ఉద్యాన శాస్త్రవేత్త నాగరాజు సూచనలు

సాక్షి, అమరావతి: ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలో పూల తోటలు దెబ్బతిన్నట్టు ఉద్యాన శాఖ గుర్తించింది. ఉభయ గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని పూల తోటల్లో ఇప్పటికీ నీళ్లు నిలిచి ఉండటంతో మల్లె, బంతి, గులాబీ తోటలను చీడపీడలు ఆశిస్తున్నాయి. అధిక తేమ కారణంగా తెగుళ్లు ప్రబలుతున్నాయి. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో పూల రైతులు చేపట్టాల్సిన సంరక్షణ చర్యలపై వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయానికి అనుబంధంగా అనంతరాజు పేటలో గల రైతు సలహా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ ఆర్‌.నాగరాజు ఈ దిగువ సూచనలు, సలహాలు ఇచ్చారు. 

నీటిని తొలగించండి.. తేమను తగ్గించండి
పూల తోటల్లో ఎక్కువ నీరు నిలిచి ఉండటం వల్ల చీడపీడల ఉధృతి పెరుగుతుంది. వేర్లు కుళ్లి మొక్కలు చనిపోతాయి. దీని నివారణకు తోటల్లోని నీరు బయటకు పోయేలా బోదెలు తవ్వాలి. చెట్ల మధ్య అంతర సేద్యం చేస్తూ తేమ శాతం తగ్గిపోయేలా చూడాలి. పాలీ హౌస్‌లో పూల సాగు చేస్తుంటే చుట్టుపక్కల తెరలను తొలగించాలి. గాలిలోని తేమ లోపలకు రాకుండా ఎగ్జాస్ట్‌ ఫ్యాన్లను ఉపయోగించవచ్చు. పాలీ హౌస్, షేడ్‌ నెట్‌ హౌస్‌ల దగ్గర గల పెద్ద చెట్ల కొమ్మలను కత్తిరించుకోవాలి. ఆరు బయట తోటల్లో అయితే గాలి బాగా ప్రసరించేందుకు అవసరమైతే కొన్ని మొక్కలను తీసివేయాలి. 

ఇంకా వర్షాలు పడుతుంటే..
ఇంకా వర్షాలు పడుతుంటే తోటల్లో పట్టాలు కప్పగలిగిన అవకాశాన్ని పరిశీలించాలి. లేదంటే మొక్కల మధ్య దిన పత్రికల కాగితాలు ఉంచినా వర్షం నీటిని ఆకుల మీద పడకుండా చేయవచ్చు. తద్వారా తెగుళ్లను నివారించుకోవచ్చు. మొదలు కుళ్లు సోకితే తగిన మందుల్ని పాదుల్లో పోసుకోవాలి. చామంతికి ఎక్కువగా వడలు తెగులు, తుప్పు తెగులు, ఆకుమచ్చ తెగులు, మొదలు కుళ్లు తెగులు ఆశించే అవకాశం ఎక్కువ. వడలు తెగులు, ఆకుమచ్చ తెగులు కనిపిస్తే కార్బండిజమ్‌ ఏదా థైరం మందును, తుప్పు తెగులు ఆశిస్తే సల్ఫర్‌ 0.2 శాతం మందును, మొదలు కుళ్లు తెగులు నివారణకు బావిస్టిన్, బూడిద తెగులు నివారణకు సల్ఫర్‌ను తగిన మోతాదులో నీళ్లతో కలిపి పిచికారీ చేయాలి.

బంతి.. మల్లె తోటల్లో ఇలా చేయండి
బంతి తోటల్లో బూడిద తెగులు నివారణకు సల్ఫర్, పువ్వు, మొగ్గలు కుళ్లు తెగులు సోకితే డైథీనియం ఎం.45, ఆకుమచ్చ తెగులు కనిపిస్తే కార్బండజిమ్‌ మందుల్ని తగిన మోతాదులో వాడాలి. వేరుకుళ్లు తెగులు సోకితే కార్బండిజమ్‌ మందును లీటరు నీటికి ఒక గ్రాము చొప్పున కలిపి మొక్కల మొదళ్ల వద్ద పోయాలి. మల్లె తోటల్లో ఆకుమచ్చ తెగులు కనిపించినా, గులాబీ తోటల్లో పూల రేకులు నల్లబడుతున్నా, బూడిద తెగులు కనిపించినా దాదాపు ఇవే మందుల్ని వాడవచ్చు. మరింత సమాచారం కోసం సమీపంలోని ఆర్బీకేలలో ఉద్యాన శాఖ సహాయకుడిని లేదంటే గన్నవరంలోని సమగ్ర కాల్‌ సెంటర్‌ నంబర్‌ 155251కు ఫోన్‌చేసి సంప్రదించవచ్చు.

వర్షాలు దెబ్బతీశాయి
చామంతి తోటలో నాలుగు రోజులుగా నీళ్లు నిలిచిపోయాయి. తోట ఉరకెత్తే ప్రమాదం ఉంది. ఇప్పటికే రూ.60 వేల వరకు ఖర్చు చేశాను. కార్తీక మాసంలో చామంతికి మంచి గిరాకీ ఉంటుందనుకుంటే వర్షాలొచ్చి దెబ్బతీశాయి. 
- తమ్మా చెన్నారెడ్డి, ఉండవల్లి, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా

మరిన్ని వార్తలు