Preeti Maske: ఇద్దరు పిల్లలు... 40 ఏళ్ల వయసులో సరికొత్త ప్రయాణం.. గిన్నిస్‌ రికార్డు సహా

7 Jan, 2023 12:23 IST|Sakshi

సాహసయాత్రలు యాత్ర వరకు మాత్రమే పరిమితం కావు. మనలో కొత్త వెలుగును నింపుతాయి. కొత్త దారి చూపుతాయి. కొత్త విజయాలు సాధించేలా సంకల్పబలాన్ని ఇస్తాయి. సైకిల్‌పై ఎన్నో సుదూరయాత్రలు చేసి రికార్డ్‌లు సాధించిన ప్రీతి మస్కే తాజాగా ఇండియా నుంచి సింగపూర్‌కు సైకిల్‌యాత్ర చేయడానికి సన్నద్ధం అవుతోంది...

ఫాస్టెస్ట్‌ ఫిమేల్‌ సోలో సైకిలిస్ట్‌గా గత సంవత్సరం నవంబర్‌ నెలలో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌లో చోటు సంపాదించింది పుణెకు చెందిన ప్రీతి మస్కే. 13 రోజుల 18 గంటల 38 నిమిషాలలో గుజరాత్‌ నుంచి అరుణాచల్‌ప్రదేశ్‌ సైకిల్‌యాత్రను పూర్తి చేసింది. గుజరాత్‌లోని కోటేశ్వర్‌ నుంచి మొదలైన ఈ సైకిల్‌ యాత్ర ఏడు రాష్ట్రాల గుండా సాగి అరుణాచల్‌ప్రదేశ్‌లోని కిబితులో ముగిసింది.

ఈ యాత్ర చేయగలనా?
‘ప్రతి ఒక్కరూ అస్సామ్, అరుణాచల్‌ప్రదేశ్‌లను చూడాలనుకుంటారు. అయితే సైకిల్‌పై యాత్ర అనేసరికి వెనక్కి తగ్గుతారు. దీనికి కారణం అంతదూరం సైకిల్‌యాత్ర అంత సులువైన విషయం కాదు. ఈ యాత్ర చేయగలనా? అని మొదట్లో నేను కూడా సందేహించాను. కొద్ది సమయంలోనే ఆ సందేహం నుంచి బయటపడి సాహసయాత్రకు పూనుకున్నాను’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంది ప్రీతి.

‘యాత్ర కోసం యాత్ర’ అని కాకుండా తన యాత్రకు సామాజిక సందేశాన్ని కూడా జోడించింది. దారి పొడుగునా అవయవదానం ప్రాముఖ్యత గురించి ప్రచారం చేస్తూ వెళ్లింది. చిన్నప్పుడు ప్రీతికి ఆటలు అంటే ఇష్టం. హాకీ, బాస్కెట్‌బాల్‌ బాగా ఆడేది. అయితే స్కూలు చదువుల తరువాత తనకు ఆటలు దూరమయ్యాయి. 2017లో సరదాగా చేసిన సైకిలింగ్‌ తన జీవితాన్నే మార్చేసింది. ఎంతో సానుకూల శక్తిని ఇచ్చి ముందుకు నడిపిస్తోంది.

ఎన్నో కొత్త ద్వారాలు
‘ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తరువాత, నలభై ఏళ్ల వయసులో పిల్లలు, కుటుంబం తప్ప వేరే ప్రపంచం ఏదీ తెలియని ప్రపంచంలోకి  వెళ్లిపోతాం. సైకిలింగ్‌ నా కోసం ఎన్నో కొత్త ద్వారాలు తెరిచింది. కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. సాధించాల్సింది ఎంతో ఉంది అని చెప్పింది’ అంటుంది ప్రీతి.

వెనక్కి చూడలేదు
2019లో కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు సోలోగా సైకిల్‌యాత్ర చేపట్టినప్పుడు చాలామంది భయపెట్టేలా మాట్లాడారు. అయితే ఆ భయంగొల్పే మాటలు ప్రీతిని వెనక్కి తీసుకువెళ్లకపోగా మరింత ధైర్యాన్ని ఇచ్చాయి. పట్టుదలను పెంచాయి. అసాధ్యం అనుకున్న సైకిల్‌ యాత్ర విజయవంతం అయ్యేలా చేశాయి. ఇక అప్పటి నుంచి ఆమె వెనక్కి చూడలేదు.

సుదీర్ఘ సైకిల్‌యాత్రలు లేని సమయంలో ఆసక్తి ఉన్న వారికి సైకిలింగ్‌లో శిక్షణ ఇస్తోంది. స్విమ్‌ చేస్తోంది. శరీరం ఫిట్‌గా ఉండేలా రకరకాల ఎక్సర్‌సైజ్‌లు చేస్తుంది. వారాంతాలలో 100 నుంచి 300 కి.మీ వరకు సైకిలింగ్‌ చేస్తోంది. ఎన్నో సుదూర సైకిల్‌ యాత్రలు పూర్తి  చేసిన ప్రీతి ‘ప్రతి రికార్డ్‌ ఒక సవాలే. దేనికదే ప్రత్యేకమైనది’ అంటోంది.

ఆప్యాయ పలకరింపులు
ఒక మంచిపని, స్ఫూర్తిని ఇచ్చే పని చేస్తే, సాహసాన్ని తట్టిలేపే పనిచేస్తే సమాజం తనకు తానుగా ముందుకు వచ్చి భుజం తట్టి ముందుకు నడిపిస్తుంది. సైకిల్‌ యాత్రలో ఎన్నో రాష్ట్రాలలో, ఎన్నోచోట్ల అపరిచితురాలైన తనను ఆప్యాయంగా పలకరించారు ప్రజలు. ఆతిథ్యం ఇచ్చారు. సైకిల్‌కు రిపేర్లు వస్తే బాగు చేయించారు. హైవే హోటళ్ల వాళ్లు కూడా మర్యాదగా పలకరించి తనకు ఆతిథ్యం ఇచ్చారు.

సాధించిన దానితో సంతృప్తి చెంది అదే విజయం అనుకోవడం లేదు ప్రీతి. తాజాగా ఇండియా నుంచి సింగపూర్‌ సైకిల్‌ యాత్రకు సన్నద్ధం అవుతోంది. ‘సాధ్యం అవుతుంది’ అనడం తేలిక. ‘అసాధ్యం’ అనుకోవడం అంతకంటే తేలిక. అయితే అసాధ్యాలను, సుసాధ్యం చేయడం కొందరికే సాధ్యం. ఆ కొందరిలో ప్రీతీ మస్కే ఒకరు.

చదవండి: Soumya Ranjan Biswal: సాగర తీరాన సైన్యమై కదులుతున్నాడు   
Kangana Ranaut: వారసత్వంగా మాకు అందిన చిట్కాలు.. నా బ్యూటీ సీక్రెట్‌ ఇదే          

మరిన్ని వార్తలు