Health: మేనరికపు పెళ్లి.. నాలుగు సార్లు అబార్షన్‌.. సమస్య ఏమిటి? పరిష్కారం ఉందా?

27 Dec, 2022 13:41 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మాది మేనరికం. పెళ్లై మూడేళ్లవుతోంది. పిల్లల్లేరు. నెల నిలిచినా ఆగట్లేదు. నాలుగు సార్లు అబార్షన్‌ అయింది. నాకింకా పిల్లలు పుట్టరా? – కె. ఇందుమతి, మెదక్‌

నాలుగు సార్లు అబార్షన్‌ అవడం అనేది చాలా అరుదు. కారణం తెలుసుకోవడానికి కంప్లీట్‌ ఓవ్యులేషన్‌ చేయించుకోవాలి. మేనరికం ఒక్కటే కారణం కాకపోవచ్చు. రెండుసార్లు అబార్షన్‌ అయిన తరువాత ఇటు పిండానిదీ, అటు తల్లిదండ్రులదీ జెనెటిక్‌ మేకప్‌ అనేది కచ్చితంగా చేయించాలి.

మూడు నాలుగుసార్లు గర్భస్రావం అయిన తరువాత కూడా గర్భం వచ్చి.. నిలిచే అవకాశం లేకపోలేదు. అయితే మీరు ఒకసారి గర్భసంచి లోపల సెప్టమ్‌ లేదా ఫైబ్రాయిడ్స్‌ ఏమైనా ఉన్నాయా.. గర్భసంచి ముఖద్వారం అంటే సెర్విక్స్‌ ఏమైనా వీక్‌గా ఉందా డిటైల్డ్‌ పెల్విక్‌ ఆల్ట్రాసౌండ్‌ చేయించుకోవాలి. కొంతమందిలో రక్తం గడ్డకట్టడం ఎక్కువగా ఉంటుంది.

వీళ్లకి ప్రెగ్నెన్సీ కన్‌ఫర్మ్‌ అయితే బిడ్డకి వెళ్లే రక్తనాళాల్లో గడ్డకడితే బిడ్డ ఎదుగుదల లేకపోవడం.. గర్భస్రావం జరగడం వంటివి సంభవిస్తాయి. దీనిని అ్కఔఅ సిండ్రోమ్‌ అంటారు. దీనిని రక్త పరీక్షల ద్వారా కనిపెట్టవచ్చు. థైరాయిడ్, డయాబెటిస్, ఎనీమియా వంటివి కూడా ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌కి ముందే సరైన రేంజ్‌లో ఉండేట్టు చూడాలి. జెనెటిక్, క్రోమోజోమ్స్‌ కారణాలతో గర్భస్రావం అవుతుంటే అది ప్రతిసారి రిపీట్‌ అయ్యే చాన్సెస్‌ తక్కువ.

కానీ మీది మేనరికం అంటున్నారు కాబట్టి ఒకసారి మీది, మీవారిది కార్యోటైప్‌ టెస్ట్‌ చేయాలి. జెనెటిక్‌ కౌన్సెలింగ్‌కి తప్పనిసరిగా వెళ్లాలి. కొన్ని టెస్ట్‌లు చేసి మళ్లీ గర్భస్రావం అయ్యే రిస్క్‌ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. ఏ ట్రీట్‌మెంట్‌ లేకపోయినా మళ్లీ హెల్దీ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం 60 శాతం ఉంటుంది. అయినా ఒకసారి పైన చెప్పిన పరీక్షలన్నీ చేయించుకోండి. ప్రెగ్నెన్సీ కంటే మూడు నెలల ముందు నుంచే బీ–కాంప్లెక్స్, ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలను తీసుకోవడం మొదలుపెట్టాలి. హెల్దీ, బ్యాలెన్స్‌డ్‌ డైట్‌ తప్పనిసరి.
-డా. భావన కాసు, గైనకాలజిస్ట్‌ – ఆబ్‌స్టెట్రీషియన్‌, హైదరాబాద్‌

మరిన్ని వార్తలు