DSP Shilpa Sahu; ‘అమ్మ’ఆన్‌ డ్యూటీ

22 Apr, 2021 01:22 IST|Sakshi
పోలీస్‌ దుస్తులను మెటర్నరీ వేర్‌గా మార్చుకుని కోవిడ్‌ లాక్‌ డౌన్‌ డ్యూటీ చేస్తున్న డీఎస్పీ శిల్పా సాహూ, పోలీస్‌ యూనిఫాంలో శిల్పా సాహూ

కోవిడ్‌ వారియర్‌

అవసరం అయితే తప్ప ఇళ్లలోంచి కదలవద్దని జనానికి చెప్పడానికి.. ఇంట్లో ఉండవలసిన అవసరం ఉన్నప్పటికీ బయటికి వచ్చి ఎర్రటి ఎండలో డ్యూటీ చేస్తున్నారు ఐదు నెలల గర్భిణీ అయిన దంతెవాడ డీఎస్పీ శిల్పా సాహూ!! ‘సురక్షితంగా ఉండండి, మాస్కులు ధరించండి’ అని చెప్పడానికి, నిర్లక్ష్యంగా తిరుగుతున్న వారిని హెచ్చరించడానికి లాఠీ చేతపట్టి.. తన కడుపులోని బిడ్డకు ప్రమాదమేమో అని కూడా తలవకుండా కరోనా సెకండ్‌ వేవ్‌ లో, సూర్యుడి భగభగల్లో, మావోయిస్టుల కదలికల నడుమ.. ఆమె తన విధులు నిర్వహిస్తున్నారు!

ఎప్పుడూ గుడిలో దర్శనమిచ్చే దంతేశ్వరీ దేవి మంగళవారం మధ్యాహ్నం ఎర్రటి ఎండలో దంతెవాడ పట్టణ ప్రధాన కూడళ్లలో కర్ర పట్టి తిరుగుతూ, ప్రజలు కరోనా బారినపడకుండా జాగ్రత్తలు చెబుతూ ఉన్నట్లే అనిపించి ఉండవచ్చు అక్కడి వారికి కొందరికైనా! ఆ ‘దంతేశ్వరీ దేవి’ పేరు శిల్పా సాహూ (29). దంతెవాడ డిప్యూటీ సూపరింటిండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌. దంతెవాడ చత్తీస్‌గఢ్‌ జిల్లాలో ఉంది.

సాధారణంగా మావోయిస్టులను గుర్తుకు తెచ్చే ఈ ప్రాంతం.. కరోనా లాక్‌డౌన్‌ విధుల నిర్వహణలో డీఎస్పీ శిల్పా సాహూ చూపిన అంకితభావం కారణంగా ఎవరికైనా శక్తిమాతను గుర్తు తెచ్చి ఉంటే అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. దేశంలోని మొత్తం యాభై రెండు శక్తి పీఠాలలో ఒకటైన దంతేశ్వరీదేవి ఆలయం దంతెవాడలో ఉంది. ఆ తల్లి తన బిడ్డల్ని అదిలించి, కదిలించి, సంరక్షించిన విధంగానే ఇప్పుడు శిల్ప తన పౌరుల్ని కరోనా నిర్లక్ష్యం నుంచి అదిలిస్తూ, త్వరగా చేరమని ఇళ్లకు కదిలించే డ్యూటీలో ఉన్నారు. నిజానికైతే ఆమె కూడా ఇంట్లోనే ఉండిపోవలసిన పరిస్థితే.

గాలి సోకితే చాలు కరోనా వచ్చేలా ఉంది. ఎండ ఆవిర్లు వదులుతోంది. మావోయిస్టులు ఎక్కడ మాటువేసి ఎటుగా వస్తోరో తెలియదు. అయినా పోలీస్‌ డ్యూటీ పోలీస్‌ డ్యూటీనే. అన్నిటినీ తట్టుకోవాలి. పౌరుల్ని కాపాడాలి. డిఎస్పీ శిల్ప కూడా అదే డ్యూటీ ఉన్నారు కానీ, ఆమె కాస్త ప్రత్యేకమైన పరిస్థితిలో డ్యూటీ చేస్తున్నారు. ఐదవ నెల గర్భిణి ఆమె. ఇక నుంచి ఆమె మరింతగా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి డాక్టర్‌ ఆమెకు చెప్పే ఉంటారు. అయితే సెకండ్‌ వేవ్‌ కరోనాలో ప్రజలు మరింతగా భద్రంగా ఉండాలని చెప్పడం కోసం ఆమె బయటికి వచ్చారు.

లాఠీ పట్టుకుని దంతెవాడ ప్రధాన రహదారులలో డ్యూటీ చేశారు. మాస్క్‌ వేసుకోని వాళ్లను, అనవసరంగా బయటికి వచ్చినవాళ్లను ఆపి, మందలించారు. కరోనా బారిన పడకుండా, ఇతరులను పడేయకుండా ఉండటానికి జాగ్రత్తలు చెప్పి పంపారు. సాటి మానవులు చెబితే కోపం వస్తుందేమో కానీ, డీఎస్పీ చెబితే వినకుండా ఉంటారా? ఇప్పుడామె చేస్తున్నది బాధ్యతల్ని గుర్తు చేసే డ్యూటీ. ఒకరు గుర్తు చేయాల్సినంతగా నిర్లక్ష్యాన్ని, ఉదాసీనతను ప్రదర్శిస్తున్న పౌరులు.. గర్భిణిగా ఉండి కూడా మిట్ట మధ్యాహ్నపు ఎండలో డ్యూటీ చేయడం చూసి సిగ్గుపడే ఉంటారు. తనకు, కడుపులో ఉన్న తన బిడ్డకు కరోనా సోకుతుందేమోనన్న భయం లేకుండా శిల్ప పౌరుల క్షేమం కోసం పాటు పడటం మొత్తం పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ గౌరవాన్నే పెంచింది.

గర్భంతో ఉండి కూడా ఆమె డ్యూటీ చేస్తున్నప్పటి ఫొటోను ఐపీఎస్‌ ఆఫీసర్, చత్తీస్‌గఢ్‌ అడిషనల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ దీపాంశు కబ్రా తన ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేయగానే ‘డ్యూటీ మైండెడ్‌’ శిల్పపై గత 48 గంటలుగా ట్విట్టర్‌లో ధారాపాతంగా ప్రశంసలు కురుస్తూనే ఉన్నాయి. ‘సెల్యూట్‌ టు డీఎస్పీ శిల్పా సాహూజీ! డీజీపీ శ్రీ అవస్థిగారూ.. ఆమెకు అవార్డు ప్రకటించంది. అలాగే ఆమె కోరుకుంటే కనుక ఆమెను రాయ్‌పుర్‌ బదలీ చేయండి’ అని ఒకరు, ‘గుడ్‌ జాబ్‌ మేమ్, ఐ రిక్వెస్ట్‌ యు ప్లీజ్‌ స్టే సేఫ్‌ అండ్‌ స్టే హెల్దీ’ అని ఇంకొకరు.. పదులు, వందల్లో ఆమెను అభినందిస్తూ, జాగ్రత్తలు చెబుతున్నారు. రాయ్‌పుర్‌ చత్తీస్‌గఢ్‌ రాజధాని. అక్కడికి, దంతెవాడకు ఏడున్నర గంటల ప్రయాణం. రాయ్‌పుర్‌లో అయితే శిల్పకు ఈ సమయంలో సౌకర్యంగా ఉంటుందని కూడా ట్విటిజెన్‌లు ఆలోచిస్తున్నారు. సీఎం ఆమెను ఒక ఆదర్శ మహిళా అధికారిగా కీర్తించారు.

ఇంతకంటే కఠిమైన డ్యూటీలనే చేశారు శిల్పి. ఎ.కె.47 ధరించి ‘ఆపరేషన్‌’లలో పాల్గొన్నారు. దంతేవాడలో మావోయిస్టులకు వ్యతిరేకంగా ఏర్పాటైన ‘దంతేశ్వరి ఫైటర్స్‌’ (మహిళా కమాండోలు) కు నాయకత్వం వహించారు. వాటికంటే కష్టమైన పని.. కరోనా లాక్‌డౌన్‌ నిబంధనల్ని జనం ఉల్లంఘించకుండా చూడటం అని ఇప్పుడామె గ్రహించే ఉంటారు.

‘‘నేను బయట ఉంటేనే.. వాళ్ల లోపల ఉంటారు’’
రోడ్డు మీద వెళుతూ అధాటున చూసిన వారికి మామూలు దుస్తుల్లో ఉన్న శిల్పా సాహు మొదట సాధారణ మహిళగా అనిపించవచ్చు. కానీ, గర్జించే ఆమె స్వరం.. ఆమె పోలీసు అన్న వాస్తవాన్ని ఆ వెంటనే తెలియజేస్తుంది. ‘వాపస్‌ జావో, ఘర్‌ జావో’ (వెనక్కు వెళ్లు.. ఇంటికి వెళ్లు) అని గట్టిగా అరచి చెప్పినా వినని వారికి ఆమె చేతిలోని లాఠీ చక్కగా అర్థమయ్యేలా చెప్పేందుకు సిద్ధమౌతుంది. ఏప్రిల్‌ 18 నుంచి దంతెవాడ జిల్లా (దక్షిణ బస్తర్‌) లాక్‌డౌన్‌లో ఉంది. ఆ రోజు నుంచీ శిల్ప లాక్‌డౌన్‌ డ్యూటీలో ఉన్నారు. ‘‘గర్భిణిగా ఉండి మీరు బయటికి రావడం ఎందుకు?’’ అనే ప్రశ్నకు.. ‘‘నేను బయట ఉంటేనే వాళ్లు లోపల ఉంటారు’’ అంటున్నారు శిల్ప.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు