Pregnant Ladies Health Tips: నేను గర్భవతిని.. మూర్ఛ వల్ల ఏమైనా సమస్యలు తలెత్తుతాయా?

27 Mar, 2022 10:49 IST|Sakshi

Pregnant Ladies Epilepsy Health Tips In Telugu: నాకు ఫిట్స్‌ వస్తుంటాయి. ఇప్పుడు నేను గర్భవతిని. మూర్ఛ వల్ల నా ప్రెగ్నెన్సీలో ఏమైనా సమస్యలు తలెత్తుతాయా? పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం మీదేమైనా ప్రభావం ఉండొచ్చా?
– విరిజ, ఆదిలాబాద్‌

ఫిట్స్‌ (ఎపిలెప్సీ, మూర్ఛ) చాలామందికి ఉంటుంది. అది చాలావరకు ప్రెగ్నెన్సీలో ఇబ్బంది కలగచేయకపోవచ్చు. కానీ మందులు కచ్చితంగా వేసుకోనప్పుడు, డాక్టర్‌ పర్యవేక్షణలో నెలనెలా సరైన జాగ్రత్తలు తీసుకోనప్పుడు చాలామందికి ప్రెగ్నెన్సీలో రిస్క్‌ ఉండే అవకాశం ఉంది. ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌కి మూడు నెలల ముందే గైనకాలజిస్ట్, న్యూరాలజిస్ట్‌ను కలిసి.. వాళ్లు సూచించిన మందులు వాడితే ప్రెగ్నెన్సీలో ఉండే రిస్క్‌ను తగ్గించవచ్చు.

ఫిట్స్‌ ఉన్న కొంతమందిలో ప్రెగ్నెన్సీ సమయంలో ఎక్కువ సార్లు ఫిట్స్‌ వచ్చే ప్రమాదం ఉంది. గర్భం ధరించగానే అంతకుముందు వాడుతున్న ఫిట్స్‌ మందులను తగ్గించడం లేదా పూర్తిగా ఆపేయడమే దానికి కారణం. సాధారణంగా గర్భంతో ఉన్నప్పుడు నీరసం, సరైన నిద్రలేకపోవడం, ఒత్తిడి వల్ల ఫిట్స్‌ పెరుగుతాయి. ఫిట్స్‌ మందులు ఆపేస్తే పుట్టబోయే బిడ్డకూ రిస్క్‌ ఉంటుంది. ఈ ఫిట్స్‌ నియంత్రణలో లేకపోతే  SUDEP (సడెన్‌ అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్‌ డెత్‌ విత్‌ ఎపిలెప్సీ) అనే రిస్క్‌ పెరుగుతుంది. ఫిట్స్‌ ఉన్న తల్లులకు అవయవలోపాలతో బిడ్డ పుట్టే ప్రమాదం కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ రిస్క్‌ వాళ్లు తీసుకునే మందులు, వాటి మోతాదుపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఈ బిడ్డల్లో వెన్నుపూస, గుండె, మొహానికి సంబంధించిన సమస్యలను చూస్తాం. గర్భధారణ కంటే ముందు మూడు నెలలు ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలను తీసుకున్నవారిలో ఈ రిస్క్‌ చాలా తగ్గుతుంది. 

కొన్ని ఫిట్స్‌ మందులు ఉదాహరణకు సోడియమ్‌ వాల్‌ప్రోయేట్‌ వంటివాటిని గర్భంతో ఉన్నప్పుడు తీసుకోకూడదు. దీనివల్ల పుట్టబోయే బిడ్డకు ప్రమాదావకాశం ఎక్కువ. ఈ మాత్రలను తీసుకునేవారు ప్రెగ్నెన్సీని ప్లాన్‌ చేసుకోవాలనుకున్నప్పుడు న్యూరాలజిస్ట్‌ను కలిస్తే.. ఆ మాత్రలకు బదులు సురక్షితమైన మరోరకం మాత్రలను సూచిస్తారు. అయితే ఫిట్స్‌ మందులను హఠాత్తుగా ఎప్పుడూ ఆపకూడదు. మందులు వేసుకున్న దానికన్నా ఇలా హఠాత్తుగా ఆపినప్పుడే తల్లికి, బిడ్డకు ప్రమాదావకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే వీటన్నిటి నేపథ్యంలో ఫిట్స్‌కి వాడే మందులు, వాటి మోతాదు గురించి గర్భధారణ కన్నా ముందే గైనకాలజిస్ట్, న్యూరాలజిస్ట్‌తో చర్చించడం మంచిది. ఫోలిక్‌యాసిడ్, ఫిట్స్‌ను నియంత్రణలో ఉంచాకే గర్భధారణకు ప్లాన్‌ చేసుకోవాలి.

క్రమం తప్పకుండా చెకప్స్‌కి వెళుతూ.. మందులు సరిగ్గా వేసుకుంటే ఇటు తల్లికి, అటు పుట్టబోయే బిడ్డకూ రిస్క్‌ తక్కువగా ఉంటుంది. గర్భధారణ కంటే ముందు లేదా గర్భం ఉన్నట్టు నిర్ధారణ అయిన వెంటనే గైనకాలజిస్ట్, న్యూరాలజిస్ట్‌ను కలవాలి. ప్రెగ్నెన్సీలోనూ క్రమం తప్పకుండా ఫిట్స్‌కు మందులు వాడాలి. ఒత్తిడి, ఆందోళనలకు గురికాకూడదు. తగినంత విశ్రాంతి, నిద్ర ఉండేట్టు చూసుకోవాలి. మంచి ఆహారం తీసుకోవాలి. రోజూ కొంతసేపు వ్యాయామం చేయాలి. ఒకవేళ ప్రెగ్నెన్సీ సమయంలో ఫిట్స్‌ వస్తే.. వెంటనే ఆసుపత్రిలో జాయిన్‌ కావాలి. న్యూరాలజిస్ట్‌ పర్యవేక్షణలో మందులు, మోతాదులను అడ్జెస్ట్‌ చేస్తారు.

ఫీటల్‌ మెడిసిన్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన నిపుణులతో స్కానింగ్‌ చేయించుకోవాలి. సాధారణ గర్భవతుల్లాగే మీరూ నార్మల్‌ డెలివరీకి ప్లాన్‌ చేసుకోవచ్చు. కాన్పు సమయంలో, ఆ తరువాత ఫిట్స్‌ వచ్చే అవకాశం పెరుగుతుంది కాబట్టి మిమ్మల్ని చాలా జాగ్రత్తగా పర్యవేక్షిస్తారు. నొప్పి తెలియకుండా ప్రసవం అయ్యే పెయిన్‌ రిలీఫ్‌ ఆప్షన్స్‌ అందుబాటులో ఉన్నాయి. దీనికి సంబంధించి మత్తమందు డాక్టర్‌ (ఎనస్తటిస్ట్‌) పర్యవేక్షణలో కౌన్సెలింగ్‌ ఇస్తారు. ఇది తీసుకోవచ్చు. 

కాన్పు తరువాత.. బిడ్డకు మీ పాలు పట్టొచ్చు. మీకు తగినంత నిద్ర, విశ్రాంతి ఉండాలి. సపోర్ట్‌గా కుటుంబ సభ్యులు ఉంటే మంచిది. పళ్లు, మంచినీళ్లు ఎక్కువగా తీసుకుంటూ డీహైడ్రేషన్‌ కాకుండా చూసుకోవాలి. అలాగే బిడ్డ సంరక్షణ విషయంలో మీ మీద ఒత్తిడి పడకుండా కుటుంబ సభ్యుల సహాయం తీసుకోవాలి. బిడ్డకు పాలిచ్చేప్పుడు మీరు నేల మీద కూర్చోవడం, బిడ్డకు నేల మీదే పక్కవేసి.. దాని మీద పడుకోబెట్టే బట్టలు మార్చడం వంటివి చేయాలి.

ఎందుకంటే హఠాత్తుగా మీకు  ఫిట్స్‌ వచ్చినా బిడ్డకు ఇబ్బంది లేకుండా .. ప్రమాదవశాత్తు కిందపడకుండా ఉంటుంది. ఇక తరువాత కాన్పు విషయానికి వస్తే.. తగినంత సమయం తీసుకుంటేనే మంచిది. దానికోసం వాడాల్సిన గర్భనిరోధక పద్ధతుల గురించి డాక్టర్‌ను సంప్రదించాలి. ఫిట్స్‌ మందులు కొనసాగించాలి. ప్రసవం అయ్యాక రెండు వారాలకు మీ న్యూరాలజిస్ట్‌ను సంప్రదించాలి. బిడ్డకు తల్లి పాలు మాత్రమే ఇవ్వాలి. 
-డా. భావన కాసు
గైనకాలజిస్ట్‌ – ఆబ్‌స్టెట్రీషియన్‌
హైదరాబాద్‌

మరిన్ని వార్తలు