నెలలు నిండకముందే పుట్టే బిడ్డలను ముందుగానే పసిగట్టవచ్చు!

12 Sep, 2021 13:57 IST|Sakshi

సాధారణంగా బిడ్డలంతా తమ తల్లిగర్భంలో నవమాసాలూ ఉంటారన్నది తెలిసిందే. అంటే పూర్తిగా 36 వారాలన్నమాట. అయితే కొందరు చిన్నారులు పూర్తిగా నెలలు నిండకముందే పుడుతుండటం మనకు తెలిసిందే. నెలలు నిండకుండా పుట్టిన బిడ్డలను (ప్రీమెచ్యుర్‌ బేబీస్‌) అంటే ప్రసవానికి కనీసం పది వారాల ముందుగానే పసిగట్టవచ్చంటున్నారు బ్రిటన్‌ శాస్త్రవేత్తలు. ఇటీవలే ఇంగ్లాండ్‌లోని లండన్‌ ‘కింగ్స్‌ కాలేజీ’కి చెందిన శాస్త్రవేత్తలు తాము నిర్వహిస్తున్న అధ్యయనాల్లో భాగంగా కొందరు కాబోయే తల్లుల మెడ భాగంలో కొన్ని బ్యాక్టీరియాతోపాటు ప్రత్యేకంగా ఉన్న కొన్ని మాలెక్యూల్స్‌ కనుగొన్నారు.

వీటి ఆధారంగా పూర్తిగా నెలలు నిండటానికి ముందే ఈలోకంలోకి వచ్చేందుకు తొందరపడే బిడ్డలను పసిగట్టేందుకు ఆస్కారముందంటున్నారు. దాంతో ముందుగానే ఏయే శిశువులు పుట్టబోతున్నారన్న విషయం తెలుస్తుంది కాబట్టి... బిడ్డను పూర్తికాలం తల్లిగర్భంలోనే ఉంచడానికి ఏమైనా ప్రత్యేక ప్రక్రియలు లేదా చికిత్సలను రూపొందించవచ్చా అనే దిశలో ఇప్పుడు ప్రయత్నాలు జరిపేందుకు ఆస్కారం ఉందంటున్నారా శాస్త్రవేత్తలు. ఒకవేళ అది ఇప్పటికిప్పుడు సాధ్యం కాకపోయినప్పటికీ... పుట్టబోయేదెవరో తెలిసిపోతుంది కాబట్టి... అలాంటి శిశువుల విషయంలో... ఆ మేరకు అవసరమైన ‘ఇంక్యుబేషన్‌’ వంటి పలు జాగ్రత్తలను తీసుకునేందుకు వీలుంటుందని అధ్యయనవేత్తలు పేర్కొంటున్నారు.  

మరిన్ని వార్తలు