లిఫ్ట్‌ బటన్స్‌ గురించి తెలిపేలా లిఫ్ట్‌ టూర్‌! ..

7 Nov, 2021 10:48 IST|Sakshi

పక్కనే మెట్లు ఉన్నా.. లిఫ్ట్‌ను ఉపయోగించే వారే ఎక్కువ. మరి, ఒక్కసారైనా.. లిఫ్ట్‌లోని బటన్స్‌ను పరిశీలించారా? వాటి పేర్లు, ఉపయోగాలను తెలుసుకునే ప్రయత్నం చేశారా? తెలుసుకోవడానికి ఏముంది? మహా అయితే, డోర్‌ క్లోజ్, డోర్‌ ఓపెన్, అలారమ్, అంతస్తులను సూచించే నంబర్‌ బటన్స్‌.. అంతే కదా! అని అనుకుంటే పొరపాటు. ప్రపంచంలోని అన్ని రకాల లిఫ్ట్‌ బటన్స్‌ గురించి తెలిపేలా జపాన్‌లోని ఓ పరిశ్రమ లిఫ్ట్‌ టూర్‌ నిర్వహిస్తోంది. ఇందుకోసం 1,048 బటన్స్‌తో కూడిన ఓ పెద్ద లిఫ్ట్‌ బటన్‌ డిస్‌ప్లే వాల్‌ ఏర్పాటు చేసింది. వాల్‌పై కనిపించే బటన్‌ నొక్కి, దాని పేరు, ఉపయోగం తెలుసుకోవచ్చు.

ఎక్కువమంది ‘నెవర్‌ ప్రెస్‌’ బటన్‌ నొక్కారు. ఈ బటన్‌ లిఫ్ట్‌ను మధ్యలోనే ఆగిపోయేలా చేస్తుంది. తిరిగి పనిచేయాలంటే.. లాక్‌ ఓపెన్‌ చేసి, రీస్టార్ట్‌ చేయాల్సిందే. అయితే, అన్నింటిలోనూ ఈ బటన్‌ ఉండదు. భద్రత కోసం కొంతమంది వీఐపీలు వారి ఇళ్లల్లో వీటిని ఏర్పాటు చేయించుకుంటారట. ఇందుకోసం అధికారులకు సరైన కారణం, పత్రాలు కూడా సమర్పించాలి. ఇలా ఎంతోమంది లిఫ్ట్‌ బటన్స్‌పై సరైన అవగాహన లేక.. ప్రమాదాలకు గురవుతున్నారు. వీటిని అరికట్టడానికి ఈ టూర్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. బాగుంది కదూ! మీరు కూడా ఈ టూర్‌కు వెళ్లాలనుకుంటే.. కాస్త వేచి చూడాల్సిందే. ఎందుకంటే, వచ్చే ఏడాది జూన్‌ వరకు ఈ టూర్‌ టికెట్స్‌ అన్నింటినీ జపాన్‌లోని వివిధ స్కూల్‌ యాజమాన్యాలు బుక్‌ చేసుకున్నాయి.

చదవండి: ఇక చంద్రుడి మీద డుగ్గు డుగ్గు.. ‘నాసా’ కొత్త తరహా బుల్లెట్టు

మరిన్ని వార్తలు