Assam: తల్లి శ్రమ ఫలించింది.. ఎన్నికల్లో అఖిల్‌ గెలుపు

5 May, 2021 12:03 IST|Sakshi

అఖిల్‌ గొగొయి జైల్లో ఉన్నారు. ఆయన తరఫున 85 ఏళ్ల ఆయన తల్లి ప్రియాద ఎన్నికల ప్రచారం చేశారు. అస్సాంలోని శివసాగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అఖిల్‌ సుమారు 12 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక 30 ఏళ్ల చందనా బారి ఒక పూరి గుడిసెలో ఉంటారు. భర్త రోజువారీ కూలీ. పశ్చిమ బెంగాల్‌లోని సల్తోరా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నాలుగు వేల ఓట్లు మెజారిటీతో గెలిచారు. డబ్బు, రాజకీయ అనుభవం లేకున్నా చందన గెలిస్తే.. తన బిడ్డను ఎలాగైనా జైలు నుంచి విడిపించుకునే ప్రయత్నంలో భాగంగా ప్రియాద అతడిని గెలిపించుకున్నారు. వీరివి అసాధారణ విజయాలు మాత్రమే కాదు.. వీరు అసాధారణ విజేతలు కూడా!

ప్రియాద 
అఖిల్‌ సామాజిక కార్యకర్త. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా అస్సాంలో ప్రదర్శనలు నిర్వహించి 2019 డిసెంబరులో అరెస్ట్‌ అయ్యారు. ఎన్నికల్లో తన సొంత పార్టీ ‘రైజోర్‌ దళ్‌’ అభ్యర్థిగా శివసాగర్‌ నియోజకవర్గం నుంచి పోటీకి నిలబడ్డారు. కానీ బయటికి వచ్చి ప్రచారం చేయడానికి లేదు. ఆ బాధ్యతను వృద్ధురాలైన అతడి తల్లి ప్రియాద తన భుజంపై వేసుకున్నారు. ఆమె ఆశ ఒక్కటే. తన కొడుకు గెలిస్తే, అప్పుడైనా అతడిని విడుదల చేస్తారని. అందుకే అతడిని గెలిపించడం కోసం ఆమె శివసాగర్‌లో ఇంటింటికి తిరిగారు. వేసవి గాలుల్ని, తన హృద్రోగాన్ని, సహకరించని కంటి చూపును కూడా ఆమె లక్ష్య పెట్టలేదు. ఆ మాతృమూర్తి పట్టుదలకు చలించిపోయిన ప్రముఖ సామాజిక కార్యకర్తలు మేధా పాట్కర్, సందీప్‌ పాండే ఆమెకు తోడుగా ప్రచారానికి వచ్చారు. ఆ తల్లి శ్రమ ఫలించింది. అఖిల్‌ గెలిచాడు. ఇక అతడికి బెయిలు రావడమే మిగిలింది. 

చందన
పశ్చిమ బెంగాల్‌లోని సల్తోరా నియోజకవర్గం నుంచి గెలిచిన చందనా బారి బీజేపీ నిలబెట్టిన అభ్యర్థి. ఆ రాష్ట్రంలో ఆ పార్టీ తరఫున ఆశ్చర్యకరమైన రీతిలో గెలిచిన వారిలో చందన ఒకరు. నిరుపేద కుటుంబం. భర్త రోజువారీ కూలి. అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిపై ఆమె ఘన విజయం సాధించగానే ట్విట్టర్‌లో చందన పేరు మార్మోగిపోయింది. ఆమె గెలుస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ ఆమె ఓట్లు అడిగిన విధానం, ఏ బలమూ లేని నిదానం.. ఓటర్లను ఆకట్టుకుంది. ‘‘ఆమెను చూడండి. రాజకీయాలు తెలియవు. డబ్బు లేదు. ఉండటానికి సరైన ఇల్లు కూడా లేదు. అయినప్పటికీ ఆత్మవిశ్వాసంతో ప్రజలకు సేవ చేసేందుకు ముందుకొచ్చింది’’ అని ట్విట్టర్‌ యూజర్‌లు వందల సంఖ్యలో చందనకు నేటికింకా అభినందనలు తెలియజేస్తూనే ఉన్నారు. 
చదవండి: West Bengal: మూడోసారి సీఎంగా మమత ప్రమాణ స్వీకారం

మరిన్ని వార్తలు