Priyadarshini Karve: పొగరహిత కుక్కర్‌ తో.. పొగకు పొగ పెట్టవచ్చు!

16 Jan, 2023 18:30 IST|Sakshi

శతకోటి సమస్యలకు అనంతకోటి పరిష్కారాలు ఉన్నాయట!
మనం చేయాల్సిందల్లా... ఆ పరిష్కారాల గురించి ఆలోచించడం.
చిన్నప్పుడు తనకు ఎదురైన సమస్యను దృష్టిలో పెట్టుకొని దానికి  శాస్త్రీయ పరిష్కారాన్ని అన్వేషించింది ప్రియదర్శిని కర్వే. ‘సముచిత ఎన్విరో టెక్‌’తో పర్యావరణ ప్రేమికులను 
ఆకట్టుకుంటోంది...

చిన్నప్పుడు స్కూల్‌కు వెళుతున్నప్పుడు, వస్తున్నప్పుడు దారిలో తీయగా పలకరించే చెరుకుతోటలను చూసేది ప్రియదర్శిని. ఈ తీపిపలకరింపుల మాట ఎలా ఉన్నా తోటల్లో పంటవ్యర్థాలను దహనం చేసినప్పుడు నల్లటిపొగ చుట్టుముట్టేది. తోట నుంచి ఊళ్లోకి వచ్చి అక్కడ అందరినీ ఉక్కిరిబిక్కిరి చేసేది.

‘ఈ సమస్యకు పరిష్కారం లేదా!’ అనే ఆలోచన ఆమెతో పాటు పెరిగి పెద్దదైంది.

పుణెకు సమీపంలోని పల్తాన్‌ అనే చిన్నపట్టణానికి చెందిన ప్రియదర్శిని కర్వే సైంటిస్ట్‌ కావాలనుకోవడానికి, సైంటిస్ట్‌గా మంచిపేరు తెచ్చుకోవడానికి తన అనుభవంలో ఉన్న వాయుకాలుష్యానికి సంబంధించిన సమస్యలే కారణం.

కేంద్రప్రభుత్వం ‘యంగ్‌ సైంటిస్ట్‌’ స్కీమ్‌లో భాగంగా వ్యవసాయవ్యర్థాలకు అర్థం కల్పించే ప్రాజెక్ట్‌లో పనిచేసింది ప్రియదర్శిని. 
ఇది తొలి అడుగుగా చెప్పుకోవచ్చు.

2004లో స్కాట్‌లాండ్‌లోని ‘యూనివర్శిటీ ఆఫ్‌ ఎడిన్‌బర్గ్‌’లో బయోచార్‌ రిసెర్చ్‌ సెంటర్‌లో చేరింది. బయోమాస్‌ సాంకేతికతను లోతుగా అర్థం చేసుకోవడానికి ఈ రిసెర్చ్‌ సెంటర్‌ ఉపయోగపడింది. ఎంతోమంది ప్రముఖులతో మాట్లాడి, ఎన్నో విషయాలపై అవగాహన ఏర్పర్చుకునే అరుదైన అవకాశం దీని ద్వారా లభించింది.

‘సముచిత ఎన్విరో టెక్‌’ అనే కంపెనీ స్థాపించి పర్యావరణ అనుకూల వస్తువుల ఉత్పత్తికి శ్రీకారం చుట్టింది ప్రియదర్శిని. తోటలోని చెట్ల వ్యర్థాలను తొలగించడం అనేది పెద్ద పని. చాలామంది ఆ వ్యర్థాలను ఒక దగ్గర చేర్చి మంట పెట్టి ఇబ్బందులకు గురవుతుంటారు. చుట్టుపక్కల వారిని ఇబ్బందులకు గురి చేస్తుంటారు.
ఈ నేపథ్యంలో ‘సముచిత ట్రాన్స్‌ఫ్లాషన్‌ క్లీన్‌’తో అందరి దృష్టిని ఆకర్షించింది ప్రియదర్శిని. ఇది రివల్యూషనరీ డిజైన్‌గా పేరు తెచ్చుకుంది. 
ఈ బాక్స్‌ బట్టీలో తోట వ్యర్థాలను వేసి, మంటపెట్టి మూత పెడతారు. అవి బయోచార్‌ ఇంధనంగా మారుతాయి.
ప్రియదర్శిని మరో ఆవిష్కరణ పొగరహిత కుక్కర్‌.

‘వంటగది కిల్లర్‌’ అనే మాట పుట్టడానికి కారణం అక్కడ నుంచి వెలువడే పొగతో మహిళలు రకరకాల ఆరోగ్యసమస్యలకు గురికావడం. కట్టెలు, బొగ్గు మండించి వంట చేయడం తప్ప వేరే పరిష్కారం కనిపించని పేదలకు ఈ పొగరహిత కుక్కర్‌ సరిౖయెన పరిష్కారంగా కనిపించింది.

కొద్ది మొత్తంలో బయోచార్‌ని ఉపయోగించి దీనితో వంట చేసుకోవచ్చు. పొగకు పొగ పెట్టవచ్చు. ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

పట్టణ ప్రాంత ప్రజల కోసం ‘కార్బన్‌ ఫుట్‌ప్రింట్‌ క్యాలిక్యులెటర్‌’ను తయారుచేసిన ప్రియదర్శిని కర్వే కొత్త కొత్త ఆవిష్కరణలపై దృష్టి పెట్టడమే కాదు పర్యావరణ పరిరక్షణకు సంబంధించి పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా అవగహన సదస్సులు నిర్వహిస్తోంది. వీటివల్ల తనకు తెలిసిన విషయాలను స్థానికులతో పంచుకోవడమే కాదు తనకు తెలియని సమస్యల గురించి కూడా తెలుసుకొని వాటి పరిష్కారానికి ఆలోచన చేస్తోంది ప్రియదర్శిని కర్వే.

మరిన్ని వార్తలు