ప్రియరాగం

2 Dec, 2020 02:35 IST|Sakshi

గ్రామీ అవార్డ్‌ల నామినీల జాబితాలో ‘బెస్ట్‌ న్యూ ఏజ్‌ ఆల్బమ్‌’ విభాగంలో స్థానాన్ని దక్కించుకొని అంతర్జాతీయ గుర్తింపు పొందింది ప్రియదర్శిని. ప్రియదర్శిని గురించి మాట్లాడుకోవాలంటే యూత్‌ను ఊపేస్తున్న ‘పెరిఫెరీ’ ఆల్బమ్‌ గురించి మాత్రమే కాదు... ఆమె బహుముఖప్రజ్ఞ, సేవాతత్వం గురించి కూడా మాట్లాడుకోవాలి.

చిన్నాచితకా పనులు చేస్తూనే ‘అబ్బా! టైమ్‌ సరిపోవడం లేదు’ అని గొణుక్కుంటాం. పెద్ద పెద్ద పనులు చేస్తున్నవారి గురించి ఆలోచిస్తూ ‘ఒక్కరే ఇన్నిన్ని పనులు ఎలా చేస్తారు!’ అని కూడా ఆశ్చర్యపోతుంటాం. ‘టైమ్‌ మన చేతిలో ఉంటే అదృష్టం కూడా మన చేతిలో ఉంటుంది’ అని చెప్పడానికి నిలువెత్తు ఉదాహరణ... ప్రియదర్శిని. సింగర్‌ సాంగ్‌ రైటర్‌ స్విమ్మర్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ సోషల్‌ యాక్టివిస్ట్‌ ఆల్ట్రా–మారథానర్‌... ప్రియదర్శిని అనే పేరుకు ముందు ఇన్ని విశేషణాలు ఉన్నాయి.

‘నా పేరు నిలపాలి సుమా!’  అని పెద్దలు అంటుంటారు. నిలపడమేమిటి, అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లింది. ప్రియదర్శిని బామ్మ పేరు ప్రియదర్శిని. సేమ్‌ పేరు అన్నమాట! అమ్మమ్మ ఒడిలోనే సంప్రదాయ కర్నాటక సంగీతాన్ని నేర్చుకుంది. ముంబైలో పుట్టి పెరిగిన ప్రియదర్శిని న్యూయార్క్‌ ఫిల్మ్‌ అకాడమీలో ఫిల్మ్‌–మేకింగ్, యాక్టింగ్‌లో శిక్షణ తీసుకుంది. ప్రసిద్ధ మ్యూజిక్‌ బ్యాండ్‌లు, సంగీతకారులతో కలిసి పనిచేసింది.

మదర్‌ థెరెసా  జీవితం ఆధారంగా తీసిన హాలివుడ్‌ సినిమా ‘ది లెటర్స్‌’లో సుభాషిణి దాస్‌ పాత్రలో ఒదిగిపోయింది. ప్యార్‌ క్యోం కియా, డి–కంపెనీ... మొదలైన బాలీవుడ్‌ సినిమాలలో పాటలు పాడి తన గాత్రంతో శ్రోతలను ఆకట్టుకుంది. వందకు పైగా రేడియో, టీవి కమర్షియల్స్‌కు తన గాత్రాన్ని అందించింది.
నే పాడితే లోకమే ఆడదా... 

2017లో ‘ఇట్‌ కాన్ట్‌ హ్యాపెన్‌ హియర్‌’ నాటకంలో నటించి రంగస్థలంపై కూడా తన ప్రతిభ చాటుకుంటుంది. ఇవన్నీ ఒక ఎత్తయితే ‘పెరిఫెరీ’ ఆల్బమ్‌ ఒక ఎత్తు. ఆమె తొలి ఆల్బమ్‌ యూత్‌ను తెగ ఆకట్టుకుంది. సంప్రదాయ కర్నాటక సంగీతం, అమెరికన్‌ పాప్‌ మ్యూజిక్‌ కలయికగా వచ్చిన ఈ ఆల్బమ్‌ న్యూ ఏజ్‌ మ్యూజిక్‌లో తనదైన స్టాంప్‌ వేసింది.

‘నా చిన్నప్పటి కల నిజమైంది. ముంబైలోని గోరెగావ్‌లో పెరిగిన నాలాంటి తమిళ పొన్నుకు ఇలాంటి నిజాలు జీర్ణం చేసుకోవడం కాస్త కష్టమే’ అంటోంది ప్రియదర్శిని. ఆమె తన గురించి ఏమనుకుంటుంది సరే, మరి ఇతరులు? ఫైవ్‌ టైమ్‌ గ్రామీ విన్నర్‌ రాయ్‌ వుటెన్‌ ఇలా అంటారు...

‘ఆమె ఎంతోమందికి స్ఫూర్తి’ గానం, సాహిత్యంలోనే కాదు సాహసంలోనూ తనదైన ప్రత్యేకత చాటుకుంది ప్రియదర్శిని. అత్యంత ప్రతికూల వాతావరణంలో ఆల్ట్రా మారథాన్‌ రన్నర్‌గా 100–మైల్‌ హిమాలయన్‌ స్టేజ్‌ రేస్‌ పూర్తి చేసి రికార్డ్‌ సృష్టించింది. ఆ సమయంలో పోర్టర్లు, గైడ్లుగా బతుకుతున్న షేర్పాల జీవితాన్ని దగ్గరగా చూసే అవకాశం వచ్చింది. వాళ్లు దోపిడికి గురవుతున్నారనే వాస్తవం బోధ పడింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆల్ట్రా మారథాన్‌లను నిర్వహించడానికి ‘ది విండ్‌ ఛేజర్స్‌’ అనే కంపెనీ లాంచ్‌ చేసింది. దీని ద్వారా వచ్చిన ఆదాయాన్ని షేర్పాల కుటుంబ సంక్షేమానికి కేటాయిస్తున్నారు.
హోమ్‌ మ్యూజిక్‌ వీడియోలో ఒక దృశ్యం 

నమీబియా ఎడారిలో 250 కిలోమీటర్ల హార్డ్‌ కోర్‌ రేస్‌ మరో సాహసం ప్రియదర్శిని దృష్టిలో గానం, పరుగు రెండు వేరు విషయాలు కాదు. ఒకదానికొకటి అనుసంధానమైవి. ‘సృజనాత్మకత మరింత పదును తేలడానికి ఇది ఉపకరిస్తుంది’ అంటోంది ప్రియదర్శిని.

సాహనం మాత్రమే కాదు సహాయం కూడా ఆమెకు ఇష్టమైన మాట. క్యాన్సర్‌ చికిత్స కోసం ముంబై మహానగరానికి వచ్చి ఆశ్రయం దొరకక ఇబ్బందిపడే పేదలకు ప్రియదర్శిని తల్లి తన వన్‌–బెడ్‌రూమ్‌ ఫ్లాట్‌లో ఆశ్రయం కల్పించేది. తల్లి నుంచి ఇలాంటి మంచి గుణాన్ని పుణికిపుచ్చుకున్న ప్రియదర్శిని ‘జనరక్షిత’ అనే స్వచ్ఛందసంస్థను ప్రారంభించింది. ‘జనరక్షిత’ ద్వారా ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని సౌకర్యాలు సమకూరుస్తుంది. బాలికల విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాప్‌ అవుట్స్‌ను తగ్గించడానికి  కృషి చేస్తుంది. కళ,సేవ,వ్యాపారరంగంలో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుంది ప్రియదర్శిని. నామినీ జాబితాలో చోటు సంపాదించుకున్న మన కళాకారులు అనుష్క శంకర్, నేహా మహాజన్, శిల్పారావులకు అభినందనలు తెలియజేద్దాం. 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు