Priyadarshini Nahar: విజయానికి ప్రధాన కారణం అదే...

15 May, 2021 13:16 IST|Sakshi

‘మేం అంగవికలురం కాదు, దివ్యాంగులం’ అంటారు ప్రియదర్శినీ నహర్‌. అందరు పిల్లల్లాగానే ఆరోగ్యంగా పుట్టారు ప్రియా. చక్కగా ఆటపాటలతో బాల్యం అందంగా, ఆనందంగానే గడుస్తోంది. ఇంతలోనే విధి చిన్న చూపు చూసింది. ప్రియదర్శినికి ఆరు సంవత్సరాల వయసులో, పోలియో కాటు వేసింది. రెండు కాళ్లు చచ్చుపడిపోయాయి. శరీరం పనిచేయలేదు. ప్రియా నహర్‌ తన అచేతన స్థితికి కుంగిపోలేదు. తల్లిదండ్రుల సహకారంతో, ప్రోత్సాహంతో చదువుకోవటం ప్రారంభించింది. కామర్స్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు ప్రియదర్శినీ నహర్‌. అక్కడితో ఆగిపోలేదు. 

తనలాంటి ఎంతోమందికి చదువు చెప్పాలనుకున్నారు. అందుకోసం టెక్నాలజీని వాడుకోవాలనుకున్నారు ప్రియదర్శిని. ఆన్‌లైన్‌ క్లాసుల ద్వారా దివ్యాంగులకు పోటీ పరీక్షలకు కావలసిన శిక్షణ ఇవ్వాలనుకున్నారు. తనకు ఆలోచన వచ్చిన వెంటనే ఆచరణలో పెట్టారు. ఇందుకోసం పెద్ద ఆఫీసు తీసుకోలేదు. ఒక చిన్న గదిలో కూర్చుని, ముగ్గురు విద్యార్థులకు ఆన్‌లైన్‌లో ట్యూషన్‌ చెప్పటం ప్రారంభించారు. ఒకరి నుంచి ఒకరికి ఈ విషయం తెలిసి, ఉత్సాహవంతులైన చాలామంది దివ్యాంగులు ఆన్‌లైన్‌ క్లాసులకు కూర్చోవటం మొదలుపెట్టారు. క్రమేపీ విద్యార్థుల సంఖ్య పెరుగుతుండటంతో, పుణేలోని లా కాలేజ్‌ రోడ్డులో ‘యాష్‌ క్లాసెస్‌’ ప్రారంభించే స్థాయికి ఎదిగారు.

‘ది ఆసరా’ సంస్థ ప్రియా నహర్‌కి ఎంతగానో సహకరించింది. మార్కెటింగ్‌ ప్లాన్‌ చెప్పి, మరింతమంది విద్యార్థులు ఇందులో చేరేలా ఈ సంస్థ ప్రోత్సహించింది. ఇప్పుడు ‘యాష్‌ క్లాసెస్‌’ అంటే మంచి శిక్షణ సంస్థగా పేరు సంపాదించుకుంది. వందమందికి పైగా సిబిఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ బోర్డు విద్యార్థులకు లెక్కలు, సైన్స్, ఇంగ్లీషు, కంప్యూటర్స్, ఎకనమిక్స్, కామర్స్‌ అంశాలలో మంచి శిక్షణ ఇస్తున్నారు ప్రియదర్శిని. తన దగ్గరే టీచర్లను వేసుకుని వారికి జీతాలు ఇచ్చే స్థాయికి చేరుకున్నారు ప్రియా నహర్‌. ఇప్పుడు ఈ సంస్థ ద్వారా రెండువేల మందికి పైగా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. అంతేకాదు, ‘ఓపెల్‌ ఫౌండేషన్‌ ఫర్‌ బెటర్‌ ఫ్యూచర్‌’ అనే సంస్థను కూడా స్థాపించి, దివ్యాంగులకు రకరకాల వృత్తులలో శిక్షణ ఇస్తున్నారు. ముప్పై సంవత్సరాలుగా ఈ సంస్థను ప్రియదర్శిని విజయవంతంగా నడుపుతున్నారు. 


తన గురించి చెబుతూ... ‘‘మా ఇంట్లో నేనే పెద్దదాన్ని. నాకు ఒక చెల్లి, ఒక తమ్ముడు ఉన్నారు. చెల్లికి వివాహమైంది. పుణేలో ఉంటోంది. మా తమ్ముడు మంచి వస్త్ర వ్యాపారవేత్త అయ్యాడు. మా తల్లిదండ్రుల కృషి, పట్టుదలతో ఇప్పుడు నేను కొద్దికొద్దిగా నడవగలుగుతున్నాను. కుటుంబ సభ్యులతో హాయిగా గడుపుతున్నాను. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కూడా నాకు మంచి చదువు చెప్పించారు అమ్మవాళ్లు. నా కాళ్ల మీద నిలబడాలనుకున్నాను. బయటకు వెళ్లలేని పరిస్థితి నాది. అందువల్ల ఇంటి నుంచే ఏదో ఒక పని చేయాలనుకున్నాను. చదువుకునే రోజుల్లో నేను బ్రైట్‌ స్టూడెంట్‌ని కావటం వల్ల, చదువుకు సంబంధించిన వాటిమీదే నా దృష్టి పెట్టాను. అలా ప్రారంభమైంది యాష్‌ కోచింగ్‌ సెంటర్‌’’ అంటున్న ప్రియదర్శిని.. విద్యార్థులకు చదువుతో పాటు, బిహేవియరల్‌ అనలిస్టులతో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌లో కూడా శిక్షణ ఇస్తున్నారు. కొంతమంది యోగా గురువులతో దివ్యాంగుల కోసం జిమ్‌ కూడా ప్రారంభించారు. 

‘‘నాకు టీచింగ్‌ అంటే చాలా ఇష్టం. పిల్లలకు పాఠాలు చెప్పటంలో నాకు చాలా ఆనందం ఉంటుంది. ముందు నేను శ్రద్ధగా చదువుకుని, ఆ తరవాత పిల్లలకు చెబుతాను. చాలామంది విద్యార్థులు మంచి మంచి పొజిషన్‌లలో ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలలో మంచి స్థాయిలో ఉంటూ, వారి కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. వాళ్లని చూస్తే నాకు చాలా గర్వంగా ఉంటుంది. నేను పెళ్లి చేసుకోకపోయినా, నాలాంటి చాలామంది పిల్లలకు తల్లిని. ‘నాణ్యమైన పని విజయానికి ప్రధాన కారణం’ అని నేను నమ్ముతాను’’ అంటారు ప్రియదర్శిని నహర్‌.

Fortune World's 50 Greatest Leaders List: ఫార్చూన్‌ ఉమెన్‌

మరిన్ని వార్తలు