Priyanka Tiwari: ఒక్క ఏడాదిలోనే ఎంత అభివృద్ధి! రూ. 9 లక్షల బహుమతిని గ్రామం కోసం!

4 Jun, 2022 08:55 IST|Sakshi

ఒక్క ఏడాదిలోనే ఎంత అభివృద్ధి!

పర్యావరణమైనా, పాలిటిక్స్‌ అయినా ‘‘నేను ఒక్కడిని మారినంత మాత్రాన వ్యవస్థ మొత్తం మారిపోతుందా?’’ అంటూ కనీసం తమవంతు సాయం, కృషి కూడా చేయని వారే సమాజంలో ఎక్కువ. ఒక అడుగు ముందుకేసినప్పుడు, మరో నాలుగు ఆడుగులు మన వెనకుండి ప్రోత్సహిస్తాయి.

అప్పుడు ఎంతటి మొండి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది అని నిరూపించి చూపిస్తోంది ప్రియాంక తివారీ. సర్పంచ్‌గా ఏడాదిపాటు ఉండి పర్యావరణాన్ని ఎంతబాగా కాపాడుకోవచ్చో చేతల్లో చేసి చూపించి ఎంతోమందికి ఉదాహరణగా నిలుస్తోంది ప్రియాంక. 

రాజస్థాన్‌లో పుట్టి ఢిల్లీలో పెరిగిన 29 ఏళ్ల ప్రియాంక తివారీ మాస్‌ కమ్యునికేషన్స్‌లో గ్రాడ్యుయేషన్‌ చేసింది. ప్రియాంకకు 2019లో బిజినెస్‌ మ్యాన్‌తో వివాహం అయ్యింది. దీంతో ఉత్తరప్రదేశ్‌లోని రాజ్‌పూర్‌ గ్రామంలోని అత్తారింటికి కాపురానికి వెళ్లింది. ఢిల్లీలో పెరిగిన ప్రియాంకకు రాజ్‌పూర్‌ పెద్దగా నచ్చలేదు.

గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పన, నిర్వహణ సరిగా లేదని అర్థమైంది. వ్యర్థాల నిర్వహణ, పాడైపోయిన డ్రైనేజీ వ్యవస్థ, కనీసం శ్మశానవాటికలు లేకపోవడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేశాయి. దీంతో వీటిని ఎలా సరిచేయాలా అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేది.  

సర్పంచ్‌గా.. 
ఎప్పుడూ గ్రామ పరిస్థితులు బాలేదు. ఇలా చేస్తే బావుంటుంది, అలా చేస్తే బావుంటుంది అని భర్త, అత్తమామల దగ్గర తన ఐడియాలను చెబుతుండేది ప్రియాంక. ఆమె ఐడియాలు సరికొత్తగా ఉండడంతో భర్తతోపాటు ప్రొఫెసర్, టీచర్‌లుగా పనిచేస్తోన్న అత్తమామలు సైతం ఆమెను ప్రోత్సహిస్తుండేవారు. ఆమె ఆలోచనలు ఎలా కార్యరూపం దాల్చుతాయి? అని ఆలోచిస్తున్నప్పుడు గతేడాది రాజ్‌పూర్‌ పంచాయితీ ఎన్నికల ప్రకటన వచ్చింది.

దీంతో అత్తమామలు ప్రియాంకను పోటీచేయమని చెప్పారు. ‘‘ఈ గ్రామంలోని సమస్యలు పరిష్కరించి అభివృద్ధి పథంలో నడపించాలంటే ఇదే మంచి అవకాశం. నువ్వు తప్పకుండా పోటీచేయాలి’’ అని అందరూ ప్రోత్సహించడంతో ప్రియాంక సర్పంచ్‌ అభ్యర్థిగా నిలబడింది. గ్రామస్థులంతా ప్రియాంకను గెలిపించారు.  

మరుసటి రోజునుంచే.. 
పంచాయితీ సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజునుంచే ప్లాస్టిక్‌ నిషేధం అమల్లోకి తెచ్చింది ప్రియాంక. ప్లాస్టిక్‌ని సమూలంగా నిర్మూలించడం ఒక్కరోజులో అయ్యే పనికాదు. చాలా సమయం పడుతుంది. కానీ అందరూ సహకరించాలని గ్రామస్థులను కోరింది. గ్రామంలోని కిరాణా, రోడ్లమీద బడ్డీ దుకాణాలకు పంచాయితీ నుంచి బట్టతో తయారు చేసిన బ్యాగ్‌లను సరఫరా చేసింది.

వీటిని మాత్రమే వినియోగించాలని నిబంధన పెట్టడడమేగాక, తొలిసారి నిబంధనలు అతిక్రమించిన వారికి రూ.500, రెండో సారికి రూ.1000 ఫైన్‌ విధించడం, మూడోసారి కూడా అతిక్రమిస్తే షాపు లైసెన్స్‌ రద్దుచేస్తామని హుకుం జారీ చేసింది. వీటితోపాటు  ప్లాస్టిక్‌ వల్ల మానవాళికి, పర్యావరణానికి కలిగే నష్టం గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించి గ్రామస్థులు స్వచ్ఛందంగా ప్లాస్టిక్‌ నిషేధాన్ని పాటించేలా చేసింది.

దీంతో ప్లాస్టిక్‌ వినియోగం చాలా వరకు తగ్గింది. చిన్నపిల్లలు వాడే స్నాక్స్‌ ప్యాకెట్స్, చాక్లెట్‌ రేపర్స్‌ తీసుకొచ్చి ఇస్తే కేజీ ప్లాస్టిక్‌కు రెండు రూపాయలు ఇస్తామని స్కూళ్లు, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో గ్రామంలో ప్లాస్టిక్‌ వినియోగం 75 శాతం పడిపోయింది. యూపీ గవర్నమెంట్‌ ప్లాస్టిక్‌ కలెక్షన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయడంతో..ప్రియాంక కూడా ప్లాస్టిక్‌ బ్యాంక్‌లు ఏర్పాటు చేసి గ్రామంలోని వ్యర్థాలను సేకరించి, ప్లాస్టిక్‌ను గ్రాన్యూల్స్‌గా రోడ్లకు వేసే తారు తయారీదారులకు ఇచ్చేది.

ప్లాస్టిక్‌ నిషేధాన్ని ఇంత పకడ్బందీగా అమలు చేస్తోన్న ప్రియాంకని రాష్ట్రప్రభుత్వం గుర్తించి రూ.9 లక్షల రూపాయలను బహుమతిగా ఇచ్చి సత్కరించింది. ఈ డబ్బులను గ్రామంలో రివర్స్‌ ఆస్మాసిస్‌ వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు వినియోగించనుంది. 

ఏడాదిలోనే... 
పటిష్టమైన డ్రెయినేజ్, మురుగు నీటికోసం పిట్స్‌ ఏర్పాటు చేయడం, శ్మశాన వాటికను నిర్మించడం వంటివి కేవలం ఏడాదిలోనే పూర్తిచేసింది. గ్రామంలో లైబ్రరీని కూడా ఏర్పాటు చేసి చేసింది. ఇంకా అభివృద్ధికోసం నిధుల్లేక విరాళాలకోసం చూస్తోంది.

ఏడాదిలోనే రాజ్‌పూర్‌వైపు అందరూ చూసేలా చేసిన ప్రియాంక తన పదవీ కాలం పూర్తయ్యేలోపు ఇప్పటికే 75 శాతం పడిపోయిన ప్లాస్టిక్‌ వినియోగాన్ని మరింతగా తగ్గిస్తానని ధీమా వ్యక్తం చేస్తోంది.

చదవండి: వైరల్‌.. అమ్మ నీకు దండమే...
 

మరిన్ని వార్తలు