Programming Languages: కాస్త సరదాగా నేర్చుకుందాం...

2 Mar, 2022 11:43 IST|Sakshi

కాలంతో పాటు ఆసక్తులు మారుతుంటాయి. అయితే అవి కాలక్షేప ఆసక్తులు కాకుండా భవిష్యత్‌ కార్యాచరణకు అవసరమైనవి అయితే ఎంతో బాగుంటుంది. ప్రస్తుతం జరుగుతున్నది అక్షరాలా అదే!

బ్రిటిష్‌ సాప్ట్‌వేర్‌ డెవలపర్,రచయిత, పబ్లిక్‌ స్పీకర్‌ మార్టిన్‌ ఫౌలర్‌ ‘ప్రోగామ్‌ రాయడానికి అసాధారణమైన నైపుణ్యం అక్కర్లేదు’ అని ఎంతోమందికి చెప్పి పుణ్యం కట్టుకున్నాడు.

‘మీ హాబీస్‌ ఏమిటి?’ అనే ప్రశ్నకు ‘సినిమాలు చూడడం’ ‘సంగీతం వినడం’ ‘కవిత్వం రాయడం’ ‘ఫేస్‌బుక్‌లో పోస్ట్‌లు పెట్టడం’... ఇలాంటి సమాధానాలు ‘యూత్‌’ నుంచి రావడం ఎప్పుడూ ఉండేదే. అయితే ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న మాట... ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌!

‘సరదాగా ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌ నేర్చుకుంటున్నాను’ అని చెప్పేవారు పెరుగుతున్నారు. అయితే తమ చదువుకు కొనసాగింపుగానో, భవిష్యత్‌ ప్రణాళికలో భాగంగానో నేర్చుకోవడం లేదు. కాస్త సరదాగా మాత్రమే నేర్చుకుంటున్నారు. కోవిడ్‌ సృష్టించిన విరామసమయం ఎన్నో ‘డిజిటల్‌’ ఆసక్తులకు తెరతీసింది. అందులో ప్రోగామింగ్‌ లాంగ్వేజెస్‌ కూడా ఒకటి. 

యూత్‌ ఆసక్తి చూపుతున్న లాంగ్వేజెస్‌లలో టెక్‌ దిగ్గజం యాపిల్‌ అఫిషియల్‌ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌ ‘స్విఫ్ట్‌’లాంటివి ఉన్నాయి. ఈ లాంగ్వేజ్‌ నేర్చుకోవడానికి స్విఫ్ట్‌ ప్రోగామింగ్‌ ఫర్‌ బిగినర్స్‌... మొదలైన ఆన్‌లైన్‌ కోర్సులను ఆశ్రయిస్తున్నారు. ఇక పైథాన్‌ సంగతి సరేసరి. ఇంట్రడక్షన్‌ టు ఫైథాన్‌ ప్రోగ్రామింగ్, పైథాన్‌ ఫ్రమ్‌ బిగినెర్‌ టు ఇంటర్‌మీడియట్‌ ఇన్‌ 30 మినిట్స్, ఎనాలసిస్‌ డాటా విత్‌ ఫైథాన్‌... మొదలైన ఫ్రీ ఆన్‌లైన్‌ కోర్సులు యువతను ఆకర్షిస్తున్నాయి. ఈ కోర్సులు పైథాన్‌ ప్రోగ్రామింగ్‌కు బేసిక్‌ ఇంట్రడక్షన్‌ గా పనిచేస్తున్నాయి. వీటి ద్వారా స్క్రిప్ట్, ఫంక్షన్స్‌ రాయడంలో మెలకువలు నేర్చుకుంటున్నారు. ఈ ఫ్రీ కోర్సు నేర్చుకోవడానికి 5 వారాల సమయం పడుతుంది.

‘టెక్నికల్‌ విషయాలు అంటే నాకు పెద్దగా ఆసక్తి లేదు’ అనే వాళ్లు కూడా ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌ను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ‘నేర్చుకున్నది ఏదీ వృథా పోదు’ అన్నట్లుగా తాము నేర్చుకుంటున్న ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌ తమలోని సృజనను పదునుపెట్టడానికి పనికొస్తున్నాయి. ప్రోగామింగ్‌లో లాజిక్, ప్రాబ్లమ్‌ సాల్వింగ్, ఆర్గనైజేషన్‌... అనే కీలక అంశాలు తమను తాము మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడుతున్నాయి.

ప్రోగ్రామింగ్‌లో నిరూపించుకోవడానికి కంప్యూటర్‌ సైన్స్‌ పట్టాతో అట్టే పనిలేదని నిరూపించుకోవడానికి బిలాల్‌ను ఉదాహరణగా చూపవచ్చు. ముంబైకి చెందిన బిలాల్‌ ఫైనాన్స్‌ డిగ్రీ చేసిన విద్యార్థి. టెక్‌ విషయాలపై ఆసక్తితో ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌లు నేర్చుకున్నాడు. ఇదేమీ వృ«థా పోలేదు. చిన్నపాటి సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం వచ్చేలా చేసింది. తరువాత తానే ఒక సాఫ్ట్‌వేర్‌ ల్యాబ్‌ను మొదలుపెట్టాడు.

పదవ తరగతి మధ్యలో మానేసిన వాళ్లు కూడా ప్రోగ్రామింగ్‌లో అద్భుత మైన ప్రతిభ చూపుతున్న ఉదాహరణలు మనకు ఉన్నాయి. వీరు మార్టిన్‌ ఫౌలర్‌ మాట విని ఉండకపోవచ్చు. అతడి ఉపన్యాసంతో ప్రభావితమైన అనేక మందిలో మనం లేకపోవచ్చు. అయితే ఆయన చెప్పిన ‘ప్రోగ్రాం రాయడానికి అసాధారణమైన నైపుణ్యం అక్కర్లేదు’ అనే మాటతో మాత్రం పూర్తిగా ఏకీభవిస్తారు.

కొంతకాలం క్రితం గ్లోబల్‌ డిజిటల్‌ పేమెంట్స్‌ ప్లాట్‌ఫామ్‌ ‘పే పాల్‌’ ఒక సర్వే నిర్వహించింది. స్కూల్, కాలేజీలలో చదివే 96 శాతం మంది అమ్మాయిలు కొత్త సాంకేతిక విషయాలు నేర్చుకోవడానికి అమిత ఆసక్తి చూపుతున్నారని చెప్పింది. ఈ సంతోషాన్ని రెట్టింపు చేసింది తాజా బైట్‌ ఎక్స్‌ఎల్‌ సర్వే. హైదరాబాద్‌కి చెందిన ఎడ్యుకేషనల్‌ టెక్నాలజీ సంస్థ ‘బైట్‌ ఎక్స్‌ఎల్‌’ డీప్‌ టెక్‌ ఇన్‌సైట్స్‌ 2021–2022 నివేదిక సాంకేతిక అంశాల పట్ల అమ్మాయిలు ఆసక్తి చూపుతున్నారని, నైపుణ్యం పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని తెలియజేసింది.

మరిన్ని వార్తలు