Prostate Cancer: ప్రోస్టేట్‌ కేన్సర్‌ ముందస్తు లక్షణాలివే! ఈ జాగ్రత్తలు పాటించారంటే పురుషుల్లో ఆ సమస్య..

23 Nov, 2021 16:27 IST|Sakshi
డా.ప్రియాంక్‌ సలేచా

Leading Cause Of Cancer Deaths In Men Is Prostate Cancer And Risk Factors For Prostate Cancer: మన దేశంలో గత కొన్నేళ్లుగా పురుషుల్లో వెలుగు చూస్తున్న కేన్సర్‌ కేసుల్లో అత్యధిక శాతం ప్రోస్టేట్‌ కేన్సర్స్‌ ఉంటున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. రకరకాల కారణాల వల్ల ప్రోస్టేట్‌ కేన్సర్‌ వ్యాధి గ్రస్థులు పెరుగుతున్న నేపధ్యంలో అపోలో ఆసుపత్రికి చెందిన కన్సల్టెంట్‌ ఆండ్రాలజిస్ట్‌–యూరాలజిస్ట్‌ డా.ప్రియాంక్‌ సలేచా ఈ వ్యాధికి సంబంధించిన పలు విశేషాలు, నివారణ మార్గాలు సూచిస్తున్నారు. 

అవగాహన కీలకం..
 ఈ వ్యాధి గురించి సరైన అవగాహన లేకపోవడం, అపోహలు కూడా  ప్రోస్టేట్‌ పరీక్షల కోసం వైద్యుని దగ్గరకు వెళ్లే విషయంలో వెనుకాడేలా చేస్తున్నాయి. ప్రోస్టేట్‌ కేన్సర్‌ను ఎంత ముందుగా గుర్తిస్తే అంత ఎక్కువగా చికిత్స విజయవంతం అయే అవకాశాలు ఉన్నాయి.అలా జరగాలంటే ప్రోస్టేట్‌ కేన్సర్‌ బారినపడేందుకు ముందుగా శరీరంలో సంభవించే హెచ్చరిక సూచికలను గమనించాల్సి ఉంటుంది.

పురుషుల పునరుత్పత్తి వ్యవస్థలో ఉండే ఒక అవయవం ప్రోస్టేట్‌. ఇది శరీరపు మూత్ర విసర్జన విధులకు అనుసంధానించి ఉంటుంది. అన్ని వయసుల వారికీ ప్రోస్టేట్‌ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే 50 ఏళ్లు పై బడిన పురుషులు ఈ లక్షణాల పట్ల అవగాహన పెంచుకుని, ముందస్తు సూచికలను పసిగట్టగలగాలి. అదే విధంగా తరచుగా ప్రోస్టేట్‌ పరీక్షలు చేయిస్తూ ఉండడం కూడా ప్రోస్టేట్‌ ఆరోగ్యం సవ్యంగా ఉంచేందుకు, తొలిదశలోనే ఏ వ్యాధినైనా అడ్డుకునేందుకు అవసరం. 

చదవండి: Wild Facts About Octopuses: 9 మెదడులు, 3 గుండెలు.. ఐనా పాపం పిల్లలు పుట్టగానే మరణిస్తుంది!!

ప్రోస్టేట్‌కు అనుబంధంగా వచ్చే సాధారణ ఆరోగ్య సమస్యల్లో ఇన్‌ఫ్లమేషన్, ప్రోస్టేట్‌ ఎన్‌లార్జ్‌మెంట్‌ (బిపిహెచ్‌)... ప్రోస్టేట్‌ కేన్సర్‌ వరకూ దారితీస్తాయి. తొలి దశలోనే కేన్సర్‌ను గుర్తించిన కేసుల్లో అది ప్రోస్టేట్‌ అవయవం వరకూ మాత్రమే పరిమితమై, చికిత్స, కోలుకోవడం మరింత సులభంగా, ప్రభావవంతంగా సాధ్యపడుతోంది. లక్షణాలను  గుర్తించేలోగానే ఒకవేళ కేన్సర్‌ ఇతర అవయవాలకు కూడా విస్తరించినట్లయితే చికిత్స సంక్లిష్టంగా మారడం అలాగే కోలుకునేందుకు పట్టే సమయం కూడా పెరగడం వంటివి జరుగుతాయి. 

లక్షణాలివే...
►రాత్రి సమయంలో తరచు మూత్ర విసర్జన అవుతుంటుంది.  ప్రొస్టేట్‌ అవయవం ఎన్‌లార్జ్‌ అవడం వల్ల యురేత్రా మీద అదనపు ఒత్తిడి కలిగించే అవకాశం ఉంది. తద్వారా మూత్ర విసర్జన సరఫరాకి అడ్డంకులు ఏర్పడి మూత్ర కోశం గోడల ఇరిటేషన్‌కు కారణమవుతుంది. ఈ పరిస్థితి తరచుగా రాత్రి సమయంలో చోటు చేసుకుంటుంది. 
►కేన్సర్‌ సోకి వృద్ధి చెందే దశలో ఇది పలు రకాల గుర్తించదగిన లక్షణాలు వెల్లడయేలా చేస్తుంది. మూత్ర విసర్జన సమయంలో నొప్పి, నుంచుని మూత్ర విసర్జన చేసేందుకు ఇబ్బంది పడడం, ధార బలహీనంగా పోవడం... వంటివి ఉంటాయి. 
►మూత్రంలో రక్తం కనపడడం అనేది రకరకాల వ్యాధులకు సూచిక అలాగే ప్రోస్టేట్‌ కేన్సర్‌కి కూడా. ఈ లక్షణం కనపడిందంటే.. కేన్సర్‌ అడ్వాన్స్‌డ్‌ స్టేజ్‌కి చేరినట్టు అర్ధం. 
►పురుషుల పునరుత్పత్తి కి సంబంధించి కీలకమైన అవయవం కాబట్టి, ప్రోస్టేట్‌... స్కలన సమయంలో నొప్పితో పాటు రకాల ఇబ్బందికర భావనలు వచ్చేందుకు కేన్సర్‌ కారకమవుతుంది. కొన్ని సందర్భాల్లో ఇది అంగస్తంభన వైఫల్యాలకు కూడా దారి తీస్తుంది. 
►కేన్సర్‌ పెరుగుతున్న కొద్దీ... ప్రోస్టేట్‌ గ్లాండ్‌ మరింత ఎన్‌లార్జ్‌ అయి పురీష నాళంపై నిర్విరామంగా ఒత్తిడి కలిగిస్తుంది. 

పైన పేర్కొన లక్షణాలు మాత్రమే కాకుండా మరే విధమైన అసాధారణ మార్పులు కనపడినా వెంటనే వైద్య నిపుణులను సంప్రదించడం తప్పనిసరి. కేన్సర్‌ స్టేజ్‌ మీద ఆధారపడి రేడియేషన్‌ థెరపీ, శస్త్ర చికిత్సలను నిపుణులు సూచిస్తారు. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, హైడ్రేషన్‌ వంటివి శరీరానికి అవసరం లేని టాక్సిన్స్‌ను తొలగిస్తాయి. 

- డా.ప్రియాంక్‌ సలేచా
కన్సల్టెంట్‌ ఆండ్రాలజిస్ట్‌–యూరాలజిస్ట్‌
అపోలో ఆసుపత్రి

చదవండి: Winter Heart Attacks: అందుకే శీతాకాలంలో హార్ట్‌ అటాక్స్‌ అధికంగా సంభవిస్తాయి..!

మరిన్ని వార్తలు