హ్యాపీ బర్త్‌ డే.. యూ ర్యాట్‌

3 Sep, 2020 08:55 IST|Sakshi

మిన్స్క్‌: ‘యూ ర్యాట్‌’ అని తిడితే ముద్దుగానో, అల్లారు ముద్దుగానో తిట్టినట్లుగా ఉండొచ్చు. విద్యావంతుల తిట్టు ఇది. పైకి సాఫ్ట్‌ గా ఉన్నా, అర్ధం విపరీతమైనది. అందుకే కుక్క అన్నా, నక్క అన్నా రాని కోపం.. బయటి దేశాల వారికి ఎలుక అంటే వస్తుంది. ‘ర్యాట్‌’ అంటే.. దూరంగా పెట్టవలసిన (హేట్‌ఫుల్‌) మనిషి అని. ఇంతవరకు నయం. అబద్ధాలకోరు అని, ద్రోహి అని, దొంగ అని, డబుల్‌–క్రాసర్‌ (మోసగాడు) అని.. ఇన్ని మీనింగులున్నాయి పాపం ఎలుక పేరు మీద! అశుభ్రంగా ఉండి, వ్యాధుల్ని వ్యాపింపజేస్తుందని కావచ్చు. ఏమైనా.. ‘నీదసలు మానవ జన్మేనా’ అని తిట్టినప్పుడు కూడా రాని కోపం, ‘నువ్వో ఎలుక’ అంటే వచ్చేస్తుంది పాశ్చాత్యులకు! మొన్న ఆదివారం బేలారస్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ ల్యుకాషేంకో బర్త్‌ డే. 66 లో కి వచ్చారు. అయితే ఆయన తన పుట్టినరోజును జరుపుకునే విధంగా ఏమీ అక్కడి పరిస్థితులు లేవు. (కూతురి క‌ష్టాన్ని న‌వ్వుల‌పాలు చేసిన త‌ల్లి)

కొన్నాళ్లుగా ఆ దేశ పౌరులు కరోనాను కూడా లెక్క చేయకుండా వేలాదిగా వీధుల్లోకి వచ్చి అధ్యక్షుడికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరుపుతున్నారు. నిన్న ఆ నిరసన వ్యకిగత దూషణ వరకు వెళ్లింది. ‘హ్యాపీ బర్త్‌ డే.. యూ ర్యాట్‌’ అని నినాద స్వరంతో అలెగ్జాండర్‌కి శుభాకాంక్షలు తెలిపారు. బేలారస్‌ మన బెనారస్‌లా అనిపిస్తుంది. ఐరోపాలోనే ఒక దేశం అది. ఆగస్టు 9న అక్కడ అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. మళ్లీ అలెగ్జాండరే గెలిచారు. రిగ్గింగ్‌ చేసి గెలిచాడని ఆందోళనకారుల ఆరోపణ. ఆయన్ని ర్యాట్‌ అన్నవాళ్లలో 125 మందిని పోలీసులు వెంటబెట్టుకెళ్లారు. ఇరవై ఆరేళ్లుగా అలెగ్జాండరే ఆ దేశానికి అధ్యక్షుడు.  

మరిన్ని వార్తలు