సైకాలజీ మారాలి

19 Nov, 2020 04:34 IST|Sakshi

డాక్టర్‌ దగ్గరికి వెళ్లొస్తే..  ‘ఏమైంది?’ అని అడుగుతారు.  సైకాలజిస్ట్‌ దగ్గరికి వెళ్లొస్తే..‘ఏమైందో’.. అనుకుంటారు! మనవాళ్ల సైకాలజీ ఇంకా ఇలాగే ఉంది.పిచ్చివాళ్లుగా ముద్ర వేసేస్తారు. పశ్చిమ దేశాల్లో అలా ఉండదు.‘వెరీ కామన్‌’ అంటారు దీప్తి. మన దగ్గర కూడా..సైకాలజీ వైద్యాన్ని కామన్‌ చేసేందుకుఇండియా వచ్చేస్తున్నారు ఆమె. ఈ సందర్భంగా డాక్టర్‌ దీప్తిని ‘సాక్షి’ పలకరించింది. 

మానసిక ఆరోగ్యం గురించిన అవగాహన మన సమాజంలో చాలా తక్కువ. తక్కువ అంటే అవగాహన కల్పించేవాళ్లు తక్కువ. అదే పశ్చిమ దేశాల్లో అరటి పండు ఒలిచిపెట్టినంత సులువుగా మెంటల్‌ హెల్త్‌ గురించి అర్ధమయ్యేలా చెప్పే ప్రొఫెసర్‌లు ఎక్కువగా కనిపిస్తారు. ఈమధ్యనైతే షార్ట్‌ ఫిల్మ్‌లు కూడా తీసి, ప్రజలకు చక్కగా మానసిక ఆరోగ్యం గురించి వివరిస్తున్నారు అక్కడి ప్రొఫెసర్‌లు. వారి తరహాలోనే హైదరాబాద్‌కు చెందిన సైకాలజిస్ట్‌ దీప్తి మనదేశంలో మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడానికి ఒక వేదికను సిద్ధం చేసుకుంటున్నారు. ప్రస్తుతం అమెరికాలో బిహేవియర్‌ థెరపిస్టుగా ప్రాక్టీస్‌ చేస్తున్నారు డాక్టర్‌ దీప్తి.

మారుస్తాను చూడండి
హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన పోచంపల్లి దీప్తి జైన్‌ యూనివర్సిటీలో సైకాలజీ డిగ్రీ చేసి కొన్నాళ్లు చైల్డ్‌ సైకాలజిస్ట్‌గా ఆటిజమ్‌ పిల్లలకు వైద్యం చేశారు. పెళ్లితో అమెరికా వెళ్లి సైకాలజీలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేసి అక్కడే ప్రాక్టీస్‌ మొదలు పెట్టారు. అయితే తన ప్రాక్టీస్‌ సమాజహితం కోసమే తప్ప డాలర్‌ల కోసం కాదన్నారామె. ‘‘భారతీయ సమాజం అనేక అపోహలతో నిండిపోయి ఉంది. సైకాలజీ, మెంటల్‌ హెల్త్‌ గురించి మాటల్లో చెప్పలేనంత శూన్యత ఆవరించి ఉంది.

అమెరికాలో తల్లిదండ్రులు తమ పిల్లలు పరీక్షలు, చదువు ఒత్తిడి కారణంగా మానసికంగా ఆందోళనకు గురవుతున్నట్లు గమనిస్తే సైకాలజిస్ట్‌ దగ్గరకు తీసుకెళ్లి కౌన్సెలింగ్‌ ఇప్పిస్తారు. మన దగ్గర ఆ పని చేయడానికి సందేహిస్తారు. ఎందుకంటే సైకియాట్రిస్ట్‌ కాదు కదా కనీసం సైకాలజిస్ట్‌ ను కలిసినా సరే.. పిచ్చి అని ముద్ర వేసేస్తారు. ఆ క్షణం నుంచి బంధువులు, సన్నిహితులు కూడా ఆ పిల్లలను అనుమానంగా చూస్తారు. అయితే పిల్లల విషయంలో ఇప్పుడు కొంత మార్పు కనిపిస్తోంది. కానీ ఈ మార్పు నగరాలకే పరిమితమై ఉంది.

సైకాలజీ కౌన్సెలింగ్‌ సర్వీస్‌ను పట్టణాలకు కూడా తీసుకెళ్లగలిగితే గ్రామాలకూ అందుబాటులోకి వచ్చినట్లే. అందుకోసమే నా ప్రయత్నం’’ అన్నారు దీప్తి. కౌన్సెలింగ్, బిహేవియర్‌ అనాలిసిస్, కార్పోరేట్‌ ట్రైనింగ్, హాలిస్టిక్‌ సైకాలజీ ఆమె ప్రత్యేకాంశాలు. ఇంకా, దూషణ–నిర్లక్ష్యం, మానవ అక్రమ రవాణా, పిల్లల పెంపకం, కుటుంబ బంధాలు, పనిచేసే చోట హింస, సి.పి.ఆర్‌. ఫస్ట్‌ ఎయిడ్‌ వంటి వాటికీ కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. 

అవన్నీ సినిమాల్లో  
‘‘ఒకప్పుడు ఒక ఇంట్లో ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య పరస్పర భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండి, అవి ఇద్దరి మధ్య దూరానికి కారణమవుతుండేవి. వాటిలో చాలా వరకు తరాల అంతరాలే కనిపించేవి. ఇప్పుడు ఇద్దరి మధ్య దూరం పెరగడానికి తరం అంత అంతరం అవసరం ఉండడం లేదు. భార్యాభర్తల మధ్య కూడా పూడ్చలేనంత అగాధాలు ఏర్పడుతున్నాయి. మా దగ్గరకు వచ్చే ఆడవాళ్లు నుంచి వచ్చే తొలి మాట ‘నా భర్త నన్ను అర్థం చేసుకోవట్లేదు.

నన్ను సరిగ్గా చూసుకోవడం లేదు’ అనేదే ఉంటుంది. కొంతమంది మగవాళ్ల నుంచి కూడా ఇలాంటి ఆరోపణ వినిపిస్తుంటుంది. కానీ తక్కువ. ఈ తరహా భావజాలం మన సమాజంలోనే ఎక్కువ. ఇందుకు సినిమాలు కూడా కారణమే. భార్య లేదా భర్త తమ భాగస్వామిని సంతోషంగా ఉంచడం కోసమే తమ ఇరవై నాలుగ్గంటల సమయాన్ని కేటాయిస్తున్నట్లు ఉంటాయి. సాహిత్యం, సినిమాల్లోనే ఇలా ఉంటుంది. నిజ జీవితం ఇలా ఉండదు. ఉండాలన్నా సాధ్యం కాదని వాళ్లు సమాధాన పడేటట్లు చెప్పాల్సిన అవసరం మనదేశంలో చాలా ఎక్కువగా ఉంది’’ అన్నారు దీప్తి.

లోపం తెలుసుకోవాలి
‘‘ఒకసారి అమెరికాకు వెళ్లిన అమ్మాయి తిరిగి వచ్చేటప్పుడు స్కర్టు, స్లీవ్‌లెస్‌లో విమానం దిగుతుందని ఊహిస్తుంటారు మన దగ్గర. అందుకు నేనే పెద్ద ఉదాహరణ. యూఎస్‌ నుంచి ఇండియాకి వచ్చేటప్పుడు నార్మల్‌ కుర్తా వేసుకున్నాను. నన్ను చూడగానే నా ఫ్రెండ్స్‌ ఆశ్చర్యంగా ‘ఏమిటి అమెరికా నుంచి ఇలా వచ్చావు’ అని అడిగారు. పాశ్చాత్య దేశాల మీద మనకున్న పెద్ద అపోహల్లో ఇదొకటి. అక్కడ జనం ఆఫీసుకి, కాలేజ్‌కెళ్లేటప్పుడు నార్మల్‌గా ఉంటారు. పిక్‌నిక్‌లు, పార్టీల్లో మాత్రమ్లే స్కిన్‌ షో చేసే దుస్తులు ధరిస్తారు.

మనం ఆ విభజన రేఖను కోల్పోతున్నాం. పైగా కాలేజ్‌కి ఆఫీస్‌కి కూడా పార్టీకి హాజరైనట్లు దుస్తులు ధరించడమే కాక తమ మేకోవర్‌కు కాంప్లిమెంట్‌లు రావాలని ఎదురు చూస్తుంటారు. దీనిని మానసిక వ్యాధిగా పరిగణించరు. కానీ, ఇదీ ఒక మానసిక జాడ్యమే. ఆత్మవిశ్వాసం లేని వాళ్లలోనే ఈ లక్షణం ఎక్కువ. ఇలాంటి లక్షణాన్ని గమనించిన వెంటనే వాళ్లకు చిన్నపాటి కౌన్సెలింగ్‌ ఇస్తే మామూలవుతారు. కొంత మేరకు పరిణతి ఉన్న వాళ్లకు కౌన్సెలింగ్‌ అవసరం కూడా ఉండదు. ఇది లోపం అని తెలిస్తే చాలు, కౌన్సెలింగ్‌ అవసరం లేకుండా తమకు తాముగా పరివర్తన చెందడానికి ప్రయత్నిస్తారు.

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. అందుకే ఇండియాకి వచ్చి మన సమాజం కోసం పని చేయాలనుకుంటున్నాను’’ అని చెప్పారు దీప్తి. ‘‘పెళ్లికి ముందు ఇండియాలో ఎన్‌జీవోతో కలిసి ఆటిజమ్‌ పిల్లల కోసం పని చేశాను. పెద్దవాళ్ల కోసం పని చేయాల్సింది చాలా ఉందని యూఎస్‌కి వెళ్లిన తర్వాత తెలిసింది. అందుకే భారతీయ సమాజానికి పనిచేయడానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నాను’’ అన్నారామె.

మెంటల్‌ హెల్త్‌పై ఫిలిం ఫెస్టివల్‌
మానసిక ఆరోగ్యం థీమ్‌తో కేరళలో ప్రస్తుతం షార్ట్‌ ఫిలిం ఫెస్టివల్‌ జరుగుతోంది. నవంబర్‌ 8 మొదలైన ఈ చిత్ర ప్రదర్శన 27 వరకు ఉంటుంది. ఇండియా, యునైటెడ్‌ కింగ్‌డమ్‌లకు చెందిన విద్యావంతులు, నటీనటులు కలిసి రూపొందించిన చిత్రాలివి. మానసిక ఆరోగ్యం గురించి ప్రజల్లో అవగాహన కలిగించడానికి విజువల్‌ మీడియా సహకారం తీసుకోవాలన్న ఆలోచనతో ఈ ప్రయత్నానికి శ్రీకారం చుట్టినట్లు యూకేలోని ‘ది మాంట్‌ఫోర్ట్‌ యూనివర్సిటీ’ ప్రొఫెసర్‌ రఘు రాఘవన్‌ తెలిపారు. మానసిక ఆరోగ్యం గురించిన అనేక సంగతులను ఈ లఘు చిత్రాల్లో చిత్రీకరించినట్లు తెలియచేశారాయన. చిత్రం నిడివి నాలుగు నిమిషాలకు మించకూడదనే నిబంధనను పాటిస్తూ 237 రిజిస్ట్రేషన్‌లు వచ్చాయి. అందులో 77 సినిమాలు చిత్రీకరణ పూర్తి చేసుకుని కమిటీ ముందుకు వచ్చాయి. మెడికల్‌ ఎడ్యుకేషన్, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ న్యూరోసైన్సెస్‌ హెడ్‌ డాక్టర్‌ మీనా అయ్యర్‌ ఆధ్వర్యంలోని జ్యూరీ సభ్యులు ఇరవై చిత్రాలను ప్రదర్శనకు ఎంపిక చేశారు.  
– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

మరిన్ని వార్తలు