ఆ అమ్మాయి ఈడేర లేదు..!

18 May, 2022 08:18 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఒక సమస్య రెండు కథలు

ఆడపిల్ల ఉంటే ఇంట్లోని వారు ఇరుగు పొరుగు వారు ఆ పిల్ల ఈడేరే విషయమై ఎదురు చూస్తూ ఉంటారు. ‘మీ అమ్మాయి ఈడేరిందా?’ అని అడుగుతూ ఉంటారు. కాని అందరు అమ్మాయిలు ఈడేరాలని లేదు. ప్రతి ఐదువేల మంది ఆడపిల్లల్లో ఒకరు ఎప్పటికీ రజస్వల కాని లోపంతో ఉంటారు. ఈ లోపాన్ని ‘టర్నర్‌ సిండ్రోమ్‌’ అంటారు. వైద్యశాస్త్రం పెద్దగా ఏ సహాయం చేయలేని ఈ సమస్యను సానుభూతితో అర్థం చేసుకోవడం గురించి ఇటీవల తెలుగులో కథలు వస్తున్నాయి. ఆ కథలు ఏమంటున్నాయి?

‘తొమ్మిదో తరగతికి వచ్చిన చెల్లెలు ఏపుగా ఎదిగి పోతుంటే నేనేమో గిడసబారిన మొక్కలాగా నాలుగున్నర అడుగులు దాటలేదు. అసలే మెడ కురచ. భుజాలు కొంచెం దగ్గరకొచ్చి మరింత చిన్నగా కనిపించేదాన్ని. నాతో కాలేజీకి వచ్చే అమ్మాయిల్లో కొందరికి నేనంటే చాలా చులకన. ఎప్పుడూ ఏదో రకంగా నన్ను ఆట పట్టించడం, జోకులేసి నవ్వుకోవడం వాళ్లకి సరదా. కళ్లలో తడి కనిపిస్తే మరింత ఏడిపిస్తారు. నేను పుష్పవతిని కాలేదు. అంతమాత్రం చేత నన్నెందుకు చిన్నచూపు చూడాలి. అందుకు బాధ్యురాలిని నేను కాదు కదా’
– రచయిత్రి వల్లూరిపల్లి శాంతి ప్రబోధ రాసిన ‘టర్నర్‌ సిండ్రోమ్‌’ అనే కథ నుంచి

‘ఎనిమిదో తరగతి అయిపోయింతర్వాత యేసవి సెలవుల్లో మా క్లాసుల మిగిలిన ఆడగుంటలు కరణాలమ్మాయి రాజేస్వరి, తెలకలోళ్ల కమల పుష్పవతులైపోయినారు. మా లచ్చుమత్త వచ్చినప్పుడల్లా ‘ఎప్పుడు మూల కూకుంటావే, ఎప్పుడు తిరపతిగాడిని పెల్లి సేసుకుంటావే’ అని అడుగుతుండీది. కళ్లు మూసి కళ్లు తెరిసినప్పుడికి రోజులు గిర్రున తిరిగిపోతున్నాయిగాని నేను పెద్దమనిషి కాకుండా శీలవతిలాగ మిగిలిపోతానేమో అని మాయమ్మకు, నాయనకు బెంగ పట్టుకున్నాది.

మా ఊరిలోన నా ఒయసు ఆడగుంటలు తొమ్మండుగురు. నేను తొమ్మిదో తరగతికొచ్చినప్పుడికి ఏడుగురు పెద్దమనుసులైపోయినారు. నేను, పెదరైతుగారింటి మంగ ఇంకా అవ్వలేదు. నాలాగే కూకోడానికి ఇంకొక మనిషి ఊర్ల ఉందని మాయమ్మకు, మా నాన్నకు కొంచెం దైర్యంగా ఉండేది. ఇదిగో ఇప్పుడు పెదరైతుగారి పిల్ల సంవర్తాడిందనగానే మాయమ్మ, మా నాయిన తడిసిపోయిన సొప్పకట్టల్లాగా అయిపోగానే మొదటిసారి నేను పెద్దపిల్లనవ్వనేమో అని నాకు బయ్యమేసింది’
– రచయిత కరుణ కుమార్‌ రాసిన ‘పుష్పలత నవ్వింది’ కథ నుంచి.

ఆడపిల్ల ఈడేరకపోతే మన దగ్గర భూకంపాలు వస్తాయి. ఆడజన్మ అంటేనే మన దృష్టిలో అమ్మ అయ్యే జన్మ అని అర్థం. సెంటిమెంట్‌ బలం ఎక్కువ. ఆమె ప్రత్యుత్పత్తికి అనువుగా ఉంటేనే గౌరవం. మన్నన. ప్రత్యుత్పత్తికి యోగ్యంగా లేకపోతే ఆమె మీద, కుటుంబం మీద చాలా ఒత్తిడి పెడుతుంది సమాజం. వింతగా చూస్తుంది. గేలి చేస్తుంది. చులకనతో విడిగా ఉంచేస్తుంది. ఈడేరని అమ్మాయికి సమాజం దృష్టిలో ఏ భవిష్యత్తూ లేనట్టే.

ఇది ఒక రకంగా మూస దృష్టి. ఇంత మూసలో అందరూ ఉండకపోవచ్చు. పై రూపం బాగున్నా లోపల స్వల్ప మార్పుల వల్ల భిన్నంగా ఉండొచ్చు. అంతమాత్రం చేత వారికి ఏ భవిష్యత్తూ లేదనట్టుగా చూసే తీరు తప్పు. అలాంటి స్త్రీలు తమకు నచ్చిన రీతిలో జీవితాన్ని నిర్మించుకోవచ్చు. సంతోషంగా జీవించవచ్చు. కుటుంబం, సమాజం చేయాల్సింది అందుకు సహకరించడమే... అని చెబుతూ తెలుగులో కథలు వస్తున్నాయి. అలాంటి రెండు కథలే ‘టర్నర్‌ సిండ్రోమ్‌’, ‘పుష్పలత నవ్వింది’.

ఆడపిల్లలు ఎందుకు ఈడేరరు?
వివిధ కారణాలు ఉండొచ్చు. కాని ప్రధాన కారణం ‘టర్నర్‌ సిండ్రోమ్‌’. మనుషుల్లో 23 జతల క్రోమోజోములు ఉంటాయి. స్త్రీలలో ఈ 23 జతల క్రోమోజోముల్లో ఏదైనా ఒక జతలో ఒక ఎక్స్‌ క్రోమోజోము ఏర్పడకపోతే అటువంటి వారిలో మొత్తం 45 క్రోమోజోములు ఉంటాయి. ఇలా 45 క్రోమోజోములు ఉన్నవారిలో అండాశయాలు చాలా చిన్నగా ఉండాయి. నెలసరి రాదు. అంటే వీరు ఎప్పటికీ రజస్వల కాలేరు. అది వినా ఇతరత్రా సాధారణ జీవనం జీవించొచ్చు.

వైవాహిక జీవితం కూడా పొందవచ్చు. హెన్రీ టర్నర్‌ అనే అమెరికన్‌ ఎండోక్రైనాలజిస్ట్‌ ఈ సంగతి కనిపెట్టాడు కనుక దీనిని టర్నర్‌ సిండ్రోమ్‌ అంటారు. ఈ సమస్య ఉన్న 70 శాతం గర్భస్థ శిశువులను ఆల్ట్రాసౌండ్‌ పరీక్షలలో కనిపెట్టి అబార్షన్‌ చేస్తున్నారు అమెరికాలో. మిగిలిన ముప్పై శాతం శిశువుల్లో ఈడేరే వయసు వచ్చే దాకా ఈ సమస్య ఉన్నట్టు తెలియదు.

కథలు ఏమంటున్నాయి?
కరుణ కుమార్‌ రాసిన ‘పుష్పలత నవ్వింది’, శాంతి ప్రబోధ రాసిన ‘టర్నర్‌ సిండ్రోమ్‌’ ఈడేరని ఆడపిల్లల వేదనను చెబుతాయి. ‘పుష్పలత నవ్వింది’లో తండ్రి దాదాపు విరక్తిలోకి వెళతాడు తన ఒక్కగానొక్క కూతురు పెద్దమనిషి కాలేదని. టర్నర్‌ సిండ్రోమ్‌లో కథానాయిక తల్లి, నానమ్మ ఎంతో ఒత్తిడికి గురవుతారు. కథానాయిక కూడా. అయితే ‘పుష్పలత నవ్వింది’లో తల్లి, కూతురు కలిసి తండ్రికి అబద్ధం చెబుతారు.

అమ్మాయి ఈడేరిన నాటకం ఆడతారు. అదొక ఇంటి రహస్యంగా ఉంచుతారు. ‘మంచి మనసున్న కుర్రాడిని పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత అతనే అర్థం చేసుకుంటాడు’ అనే ముగింపు ఇస్తే... ‘టర్నర్‌ సిండ్రోమ్‌’ లో మాత్రం కథానాయిక బాగా చదువుకుని మొదట తన కాళ్ల మీద తాను నిలబడాలనుకుంటుంది. కుటుంబం నుంచి దూరంగా వచ్చి తన సమస్య తెలిసి తనతో జీవితాన్ని పంచుకునే అబ్బాయిని జీవితంలోకి ఆహ్వానిస్తుంది.

ఈ రెండు కథల్లోనూ కథానాయికలకు కుటుంబం నుంచి, సమాజం నుంచి సవాలే ఎదురయ్యింది. ఇంత సవాలు అక్కర్లేదు. మనుషులకు ఎన్నో శారీరక లోపాలు ఉంటాయి. కళ్లద్దాలు రావడం కూడా ఒక లోపమే కదా. అలాంటి సర్వసాధారణ లోపంగా భావించే దశకు ఇటువంటి ఆడపిల్లల విషయంలో సమాజం వెళ్లాలి. ఆ చైతన్యం కథలు ఇస్తున్నాయి. అలాంటి కథలను ఆహ్వానించాలి.

మా సమీప బంధువు ఒకరు తన కూతురు పెద్దమనిషి కావటం లేదని చాలా సంవత్సరాలు బాధపడటం దగ్గరగా చూశాను. అలాగే వరుసకు నాకు మేనత్త అయ్యే ఒకామె చివరి వరకు పెళ్లి లేకుండా ఉండిపోవడం చూసాను. అప్పుడే ఈ సమస్య వెనుక ఉన్న సామాజిక కోణం అర్థమయ్యింది. అప్పుడు ఈ కథ రాయాలని అనిపించింది.
– కరుణకుమార్, రచయిత, సినీ దర్శకుడు

నాకు బాగా తెలిసిన ఓ పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ యువతి ఒక సందర్భంలో తన సమస్య గురించి చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాను. మహిళలందరికీ నెలసరి అనే శరీర ధర్మం సహజం. కానీ కొందరిలో ఉండదు. అది నిజం. నాకు తెలిసిన గైనకాలజిస్ట్‌ దగ్గరకి ఆ అమ్మాయిని తీసుకెళ్ళాను. ఫలితం శూన్యం. అప్పటి నుంచి ఈ సమస్యపై రాయాలి అనుకునేదాన్ని. శరీర అంతర్గత అవయవాల్లో సమస్య ఉన్న ఆ అమ్మాయిలు ఎటువంటి మానసిక, సామాజిక, శారీరక సమస్యలు ఎదుర్కొంటారో అని నేను చేసిన ఆలోచనకు జవాబే ఈ కథ. – వల్లూరుపల్లి శాంతిప్రబోధ, రచయిత్రి 

ఇది కూడా చదవండి: Period Pain and Cramps: రోజుకో నువ్వుల ఉండ, ఇంకా...

మరిన్ని వార్తలు