Pudami Sakshiga: వేస్టేజ్‌ తగ్గితేనే పుడమికి మనుగడ 

26 Jan, 2023 13:30 IST|Sakshi

Pudami Sakshiga 2023: రెడ్యూస్‌.. రీయూస్‌.. రీసైకిల్‌! వాడకం తగ్గించుకోవడం... వాడేసినవే మళ్లీ వాడటం... పడేసిన వాటితో కొత్తవి తయారు చేసుకుని వాడుకోవడం..! ఏమిటీ కర్మ! అవును కర్మే. మనిషి వల్ల పుడమికి పట్టిన కర్మ!

అవసరం ఉన్నవీ లేనివి కొని, అవసరం తీరీ తీరకుండానే పడేస్తున్నాం. కొత్తవి కొంటున్నాం. కుండెడన్నం కోసం బండెడన్నం వండేస్తున్నాం. ఫ్రిజ్‌ని రైతుబజార్‌ని చేస్తున్నాం. వార్డ్‌రోబ్‌  పొట్ట పగిలేలా బట్టల్ని కుక్కేస్తున్నాం.

భారీ ఫర్నీచర్‌తో ఇంటినంతా నింపేస్తున్నాం. బకెట్‌ల కొద్దీ నీళ్ల ట్యాంకుల్ని ఖాళీ చేస్తున్నాం! ఇ.ఎం.ఐ.ల కొద్దీ మన దగ్గర డబ్బుంటే ఉండొచ్చు. పుడమి దగ్గర ఇప్పుడు.. దాదాపుగా నో స్టాక్‌! పంచభూతాల షార్టేజ్‌!!  తక్షణం మన వేస్టేజ్‌ తగ్గితేనే పుడమికి మనుగడ! 

ఈ కఠోర వాస్తవంపై ‘పుడమి సాక్షిగా..’ మెగా టాకథాన్‌తో గత మూడేళ్లుగా సమాజానికి అవగాహన కల్పిస్తూ వస్తున్న.. ‘సాక్షి మీడియా గ్రూప్‌’ ఈ ఏడాది ‘రెడ్యూస్‌..రీయూజ్‌.. రీసైకిల్‌..’ అనే థీమ్‌తో  ఈవెంట్‌ని నిర్వహించింది. 

వాడకం తగ్గించి, వృథాను నివారించి, వ్యర్థాలను తగ్గిస్తేనే పుడమి తిరిగి జవసత్వాలు పుంజుకుంటుందని ఈ టాకథాన్‌  ద్వారా పర్యావరణ వేత్తలు, రాజకీయ నేతలు, ఐ.ఎ.ఎస్‌., ఐ.పి.ఎస్‌. అధికారులు, కళాకారులు, సినీ హీరోల చేత చెప్పించింది. హైదరాబాద్‌లోని రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో ఇటీవల ఈ కార్యక్రమం జరిగింది.
∙∙ 
మూడో ఎడిషన్‌లో
ధరిత్రిని కాపాడుకోవాలి, భూమిని కాలుష్య కాసారం కానీయకుండా భవిష్యత్తరాలకు అందించాలి అనే లక్ష్యంతో సాక్షి మీడియా గ్రూపు చేపట్టిన ప్రచారోద్యమమే ‘పుడమి సాక్షిగా..’ ఇప్పటివరకు రెండు ఎడిషన్‌లను పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం మొదటి ఎడిషన్‌లో... ప్రమాదం అంచుకు ఎలా చేరాం? పుడమికి మనం ఏం తిరిగి ఇవ్వాలి? పర్యావరణానికి ఏం అవసరం? అనే అంశాలకు ప్రాధాన్యం ఇచ్చింది.

రెండో ఎడిషన్‌లో స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన నీరు, సకల ప్రాణులకూ ఆవాసంగా నేల, తక్కువ కాలుష్యంతో విద్యుత్‌ ఉత్పాదన అనే అంశాలను ప్రధానంగా చర్చించింది. ఈ మూడో ఎడిషన్‌లో ‘రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్‌’ అనే థీమ్‌ను ఎంపిక చేసుకుంది. ప్రముఖుల సూచనలను, సలహాలను స్వీకరించింది. సాక్షి 
‘ఫన్‌ డే’ ద్వారా వాటిని పాఠకులకు అందించింది. సాక్షి టీవీ ద్వారా గురువారం వీక్షకులకు అందిస్తోంది. 

నాకు నచ్చిన ప్రోగ్రాం 
సామాజిక బాధ్యతను కర్తవ్యంగా తీసుకుని సాక్షి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది, అందులో నాకు బాగా నచ్చిన ప్రోగ్రామ్‌.. పుడమి సాక్షిగా. భగవంతుడు మనకిచ్చిన వరం పర్యావరణం. ఈ వరాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మానవాళి అందరిదీ. నేటి తరాలు బాధ్యతగా జీవిస్తేనే భావితరాలకూ ఈ వరం అందుతుంది. – రోజా, పర్యాటక, యువజనాభివృద్ధి శాఖ మంత్రి, ఏపీ

బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉంది 
సాక్షి తీసుకున్న ‘పుడమి సాక్షిగా..’ అనే ఈ గొప్ప ఇనీషియేటివ్‌లో అందరం భాగస్వాములం కావాలి. పుడమి అంటే తల్లి. తల్లిని కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి మనిషిదీ. ఏపీ ప్రభుత్వం ఇటీవలే ‘పార్లే ఫర్‌ ది ఓషన్స్‌’ అనే అమెరికన్‌  ఎన్జీవోతో ఎం.ఓ.యు. కుదుర్చుకుని విశాఖ బీచ్‌లో పోగయ్యే ప్లాస్టిక్‌ని రీయూజ్‌ చేయిస్తూ గొప్ప సంస్కరణకు నాంది పలికింది. పుడమి సంరక్షణకు ప్రజల్ని చైతన్యం చేస్తోంది. – గుడివాడ అమర్‌నాథ్, పరిశ్రమల శాఖ మంత్రి, ఏపీ

రైతు.. భూమి.. పుడమి 
సాక్షి మీడియా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతను గుర్తుచేస్తోంది. వ్యవసాయం విషయానికి వస్తే.. ప్రకృతి సాగు విధానాల వల్ల పుడమి కి ఎంతో మేలు జరుగుతోంది. ఏపీలో రైతు భరోసా కేంద్రాలు, రైతు సాధికార సంస్థల ఏర్పాటుతో రైతుకు, భూమికి, పుడమికి ప్రయోజనకరమైన ఫలితాలను సాధిస్తున్నాం. – కాకాని గోవర్ధన్, వ్యవసాయశాఖ మంత్రి, ఏపీ

గ్రీన్‌  వెజిటేషన్‌కు ప్రాధాన్యం 
సాక్షి చేపట్టిన ‘పుడమి సాక్షిగా..’ ఒక మంచి ప్రయత్నం. ప్రపంచ వ్యాప్తంగా నేడు కలవరం కలిగిస్తున్న ప్రధాన సమస్య పర్యావరణ కాలుష్యం. అందుకు అనుగుణంగానే తెలంగాణ ప్రభుత్వం పలు ప్రత్యేకమైన పర్యావరణ హితమైన కార్యక్రమాలు చేపట్టి పచ్చదనాన్ని పెంపొందిస్తోంది. కోటీ యాభై ఎకరాల వ్యవసాయ భూమి సాగు అయ్యేలా నీటి అందించి, గ్రీన్‌  వెజిటేషన్‌ని సాధిస్తోంది. – నిరంజన్‌ రెడ్డి,  సహకార శాఖ మంత్రి, తెలంగాణ

పాఠశాల స్థాయి నుంచే  
కలెక్టివ్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ లేకపోవడం వల్ల మనం పర్యావరణాన్ని పరిరక్షించుకోలేకపోతున్నాం. ఇది ఏ ఒక్కరి వల్లో సాధ్యం అయ్యేది కాదు. అందరూ బాధ్యత తీసుకుని సమాజాన్ని చైతన్యవంతం చేయాలి. పాఠశాల నుంచే పిల్లల్లో పర్యావరణ స్పృహ కలిగించడానికి ఇన్సెంటివ్‌ బేస్డ్‌ ఎడ్యుకేషన్‌ ఉంటే బాగుంటుంది. ఉదా.. క్లాస్‌ రూమ్‌ని శుభ్రంగా ఉంచిన వారికి ప్రోత్సాహకాలు ఇవ్వడం వంటివి. ఇప్పుడు మనం ప్రకృతి పట్ల శ్రద్ధ వహిస్తేనే భవిష్యత్‌ తరాలు పచ్చగా ఉంటాయి. – అడివి శేష్, సినీ హీరో

ఎకో–ఫ్రెండ్లీ స్కూల్‌ క్యాంపస్‌ 
‘పుడమిసాక్షిగా..’ టాకథాన్‌కు నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. వాతావరణ మార్పులు భూతాపానికి కారణం అవుతున్నాయనే అంశంపై హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ తరఫున ఈజిప్ట్‌లో జరిగిన కాప్‌ 27 సదస్సుకు హాజరై అధ్యయన పత్రం సమర్పించాను. మా స్కూల్‌ క్యాంపస్‌ లో కూడా ఎన్విరాన్‌మెంట్‌ పిట్స్, సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేసుకున్నాం. ప్లాస్టిక్‌ వినియోగం కూడా తగ్గించుకున్నాం. – అంకిత్‌ సుహాస్, కాప్‌–27 డెలిగేట్‌

వస్తు వినియమం బాగా తగ్గాలి 
గత దశాబ్దంగా మన దగ్గర ఉన్న గణాంకాలని బట్టి చూస్తే అర్బన్‌కి, రూరల్‌కు మధ్య వస్తు వినియోగ సంస్కృతిలో ఏ విధమైన తేడా కనిపించని పరిస్థితి. గ్రామ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు రెండిటినీ స్వచ్ఛాంద్ర కార్పోరేషన్‌  హ్యాండిల్‌ చేస్తోంది. వీటిని కంపేర్‌ చేసినప్పుడు.. కొనే రాశిలో తేడా ఉందేమో కానీ, ఇంటింటి నుంచీ వచ్చే రోజువారీ వ్యర్థాలు దాదాపు ఒకే మొత్తంలో ఉంటున్నాయి. వ్యర్థాలు ఎక్కువైతే పుడమికి ముప్పు కనుక రెడ్యూస్, రీయూస్, రీసైకిల్‌ మన తక్షణ అవసరం. – సంపత్‌ కుమార్, ఐ.ఎ.ఎస్‌. స్వచ్ఛాంధ్ర ఎండీ

పిల్లలకు క్లీన్‌లీనెస్‌ నేర్పాలి 
తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా..  ఇదే తెలుసు మనోళ్లకి. కానీ, రాబోయే తరానికి మనం ఏం ఇస్తున్నాం అనేది ఒక్కసారి మన మనస్సాక్షిని అడగాలి. పుడమిసాక్షిగా.. నేను ప్రతి మనిషికీ చెప్పేది ఒకటే.. మనం ఇవ్వాల్సింది మన పిల్లలకి విద్య. నేర్పాల్సింది క్లీన్లీనెస్‌. పర్యావరణాన్ని మనం శుభ్రంగా ఉంచితే మన రాష్ట్రం శుభ్రంగా ఉంటుంది. మన దేశం శుభ్రంగా ఉంటుంది. మనం అందరికీ ఇన్సిపిరేషన్‌  అవుతాం. – అలీ, మీడియా అడ్వైజర్, ఏపీ

మెటీరియలిజం వల్లే ఇదంతా..! 
మన జీవన విధానం ఎకో ఫ్రెండ్లీగా ఉండాలి. పుడమికి హితంగా మన అలవాట్లు మార్చుకోవాలి. ఆర్టీసీలో మేము రీయూజ్‌ అనే కాన్సెప్ట్‌ని అవలంబిస్తున్నాం. మెటీరియలిజంకి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకు రావడం కోసం సాక్షి మీడియా గత మూడేళ్లుగా ‘పుడమి సాక్షిగా..’ అనే ప్రచారోద్యమాన్ని కొనసాగిస్తూ, టాకథా¯Œ ని నిర్వహించడం అభినందనీయం. – వి.సి.సజ్జనార్, ఐపీఎస్, టి.ఎస్‌.ఆర్టీసీ ఎండీ

త్రిబుల్‌ ‘ఆర్‌’ ప్రస్తుతావసరం 
ఇటువంటి ముఖ్య అంశంపై డిబేట్‌ ఏర్పాటు చేసిన సాక్షికి ధన్యవాదాలు. 25 ఏళ్ల క్రితం గూంజ్‌ సంస్థ ప్రారంభమైంది. తిండి, బట్ట, నివాసం అనే కనీస అవసరాలలో మేము దుస్తులపై దృష్టి పెట్టాం. దుస్తులను విరాళంగా సేకరించి దేశవ్యాప్తంగా ఉన్న నిరుపేదలకు అందిస్తున్నాం. ఆ విధంగా సంపన్నుల దగ్గరి వేస్టేజ్‌ని రీయూజ్‌కు అందిస్తున్నాం. సంపన్నులను పరోక్షంగా రెడ్యూస్‌కు ప్రేరేపిస్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్‌ఆర్‌ ఆర్‌తోనే పుడమిని సంరక్షించుకోగలం. – మీనాక్షీ గుప్తా, ‘గూంజ్‌’ సంస్థ

చదవండి: ప్లాస్టిక్‌ కవర్లలో వేడి వేడి ఛాయ్‌! పొట్ట కింద ‘టైర్లు’!.. అలారం మోగుతోంది.. వినబడుతోందా?

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు