రోజుకు ఎన్ని వేల లీటర్ల గాలిని పీల్చుకొని వదులుతామో తెలుసా?

26 Jan, 2022 14:37 IST|Sakshi

అధికంగా వాయు కాలుష్యం ఉండే ప్రాంతాల్లోని వారు వేగవంతమైన శ్వాస వ్యాయామాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఒక శ్వాస ద్వారా ఎక్కువ మొత్తంలో గాలి పీల్చుకుంటే.. ఆ గాలితోపాటు కాలుష్యాన్నీ ఎక్కువగా పీల్చుకున్నట్టవుతుంది. అందుకే ఈ ప్రాంతవాసులు అలాంటి శ్వాస సంబంధమైన వ్యాయామాల జోలికి వెళ్లకపోవడమే మంచిది. 

నిజానికి ఆరుబయట కన్నా ఇంట్లోనే వాయు కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. వంట, మరుగుదొడ్ల వినియోగం, పరిసరాల శుభ్రత కోసం వాడే రసాయనాలు, బొద్దింకలు, చెదలకు వాడే పురుగుమందులు, పెంపుడు జంతువులు వంటి వాటివల్ల గాలి బయటకన్నా ఇంట్లోనే ఎక్కువ కలుషితమవుతుంది. ఒకే ఒక్క మేలు ఏంటంటే బయట గాలిలో ఉండే దుమ్ము ఇంట్లో కొంచెం తక్కువగా ఉంటుంది. 

తలుపులు వేసుకొని ఒక గదిలోపల శ్వాస వ్యాయామం చేస్తున్న వ్యక్తి నిజానికి 2.5, పది మైక్రోమిలియన్ల సైజులోని అతి సూక్ష్మ కాలుష్య కణాలను కూడా పీల్చుకుంటాడు.  ఆ కాలుష్యాలను ఊపిరితిత్తులు ఫిల్టర్‌ చేస్తాయి. ఈ క్రమంలో ఆ కాలుష్యం  కొంత ఊపిరితిత్తుల్లో ఉండిపోతుంది. పర్యవసానంగా శ్వాసకోశ సంబంధ వ్యాధులు, గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్‌ వంటి వ్యాధులు రావచ్చు. మన దేశంలో గాలి కాలుష్యం వల్ల మనిషి ఆయుష్షు అయిదు సంవత్సరాలు తగ్గిపోతోంది.  

ధూమపానాన్ని నిషేధించినట్లే అధిక కాలుష్యం ఉన్న ప్రాంతాల్లో శ్వాస వ్యాయామాలు చేయడంపై కూడా ఆంక్షలు పెట్టడం మంచిది. ఎత్తయిన అంతస్తుల్లో నివసించే వ్యక్తి సాపేక్షంగా స్వచ్ఛమైన గాలిని పొందుతాడు.. ముఖ్యంగా చలికాలంలో.  నేల నుంచి తక్కువ ఎత్తులోని గాలిలో కాలుష్య కారకాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇంటిపై అంతస్తుల్లో వ్యాయామం చేయడం మంచిది. 

వాయు కాలుష్యాన్ని ఫిల్టర్‌ చేయడంలో ముక్కు పాత్ర కీలకమైనది. అతి సన్నని ధూళి కణాలు ముక్కు రంధ్రాల ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. 10 మైక్రోమీటర్ల (మైక్రోమీటర్‌ అంటే మీటర్‌లో పది లక్షల వంతు) కంటే పెద్ద కణాలను మాత్రమే ముక్కు వడపోయగలదు. ఈ క్రమంలో 2.5 మైక్రోమీటర్ల కంటే సూక్ష్మమైన కణాలు ఈ ఫిల్టర్‌కు చిక్కకుండా  నేరుగా శరీరం లోపలికి వెళ్లిపోతాయి. 

సాధారణ శ్వాస సమయంలో మనం ప్రతి శ్వాసతో  500 మి.లీ. గాలిని పీల్చుకుంటాం. నిమిషానికి సుమారు 12 శ్వాసలు తీసుకుంటామనుకుంటే నిమిషానికి 6 లీటర్ల గాలిని పీల్చుకుంటామన్నమాట. అంటే రోజుకు దాదాపు పది వేల లీటర్ల గాలిని ప్రతి ఒక్కరూ పీల్చుకొని వదులుతూ ఉంటాం. 
ఒక క్రీడాకారుడు సాధారణ వ్యక్తి కంటే 2.5 రెట్లు ఎక్కువగా ఊపిరి పీల్చుకుంటాడు. 
మన శరీరాలు సాధారణంగా నిమిషానికి 250 మిల్లీ లీటర్ల ప్రాణవాయువును ఉపయోగిస్తాయి. 
2013లో ధూమపానం చేయని వారిపై జరిపిన ఒక అధ్యయనంలో.. యూరోపియన్లతో పోలిస్తే భారతీయుల ఊపిరితిత్తుల పనితీరు 30 శాతం తక్కువగా ఉందని తేలింది. 
శ్వాస ఆధారిత ధ్యానం లేదా ప్రాణాయామం వంటి శ్వాస వ్యాయామాలు ముఖ్యంగా ఎక్కడ, ఎప్పుడు చేయాలో నేర్పించాలి.  ఊపిరితిత్తులు ఎక్కువ శ్వాస సామర్థ్యంతో ఎంత ఆరోగ్యంగా ఉంటే కోవిడ్‌తో మనం అంత సమర్థవంతంగా పోరాడగలుగుతాం.

మరిన్ని వార్తలు