వైరల్‌: చదరంగ స్థలం

2 Aug, 2022 00:45 IST|Sakshi
పుదుకొటై్ట కలెక్టర్‌ కవితారాము

చదరంగం చదరపు బల్ల రంగస్థలం అయితే... రాజు, రాణి, సిపాయిలకు ప్రాణం వస్తే... ‘అహో!’ అనిపించే దృశ్యం కనువిందు చేస్తే... ‘అద్భుతం’ అనిపిస్తుంది. ‘చతురంగం’  వీడియో ద్వారా ఆ అద్భుతాన్ని ప్రపంచానికి చేరువ చేశారు కలెక్టర్‌ కవితారాము...

ప్రపంచంలోని చదరంగ ప్రేమికుల దృష్టి ఇప్పుడు చెన్నైపై ఉంది. అక్కడ జరుగుతున్న ఆటల గురించి తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే, సాంస్కృతిక కళారూపాలు మరో ఎత్తు. ‘చెస్‌ ఒలింపియాడ్‌–2022’ ప్రమోషన్‌లో భాగంగా వచ్చిన ‘చతురంగం’ అనే వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.

‘దృష్టి మరల్చనివ్వని అద్భుతదృశ్యాలు’ అని వేనోళ్లా పొగుడుతున్నారు నెటిజనులు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఈ వీడియో గురించి ట్విట్టర్‌ వేదికగా ప్రశంసించారు. పుదుకొటై్ట కలెక్టర్‌ కవితారాము ఈ ‘చతురంగం’ నృత్యరూప కాన్సెప్ట్‌ను డిజైన్‌ చేయడంతో పాటు కొరియోగ్రఫీ చేయడం విశేషం. కవితారాము స్వయంగా శాస్త్రీయ నృత్యకారిణి. ఎన్నో నృత్యప్రదర్శనలు ఇచ్చారు.

‘నృత్యంతో పాతికసంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. చెస్‌ ఒలింపియాడ్‌ను ప్రమోట్‌ చేయడానికి ఒక వీడియో రూపొందించాలనే ప్రతిపాదన వచ్చినప్పుడు కాన్సెప్ట్‌ కొత్తగా ఉండాలి, దృశ్యపరంగా అద్భుతం అనిపించాలి అనుకున్నాను. అందులో భాగంగానే ఆటకు, నృత్యాన్ని జత చేసి చతురంగంకు రూపకల్పన చేశాము’ అంటుంది కలెక్టర్‌ కవితారాము.

ఈ వీడియోలో క్లాసిక్, ఫోక్, మార్షల్‌ ఆర్ట్స్‌ ఫామ్స్‌ను ఉపయోగించారు. నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. సందర్భాన్ని బట్టి పసుపు, నీలిరంగు లైటింగ్‌ను వాడుకోవడం బాగుంది. పుదుకొటై్ట సంగీత కళాశాలకు చెందిన ప్రియదర్శిని నలుపువర్ణ రాణి, చెన్నై అడయార్‌ మ్యూజిక్‌ కాలేజికి చెందిన సహన శ్వేతవర్ణ రాణి వేషాలలో వెలిగిపోయారు.
‘మహిళాదినోత్సవం సందర్భంగా ప్రియదర్శిని నృత్యాన్ని చూశాను. చతురంగం వీడియో గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆమె గుర్తుకువచ్చింది.

ఇక సహన నృత్యం గురించి నాకు తెలుసు. ఎప్పటి నుంచో ఆమెతో పరిచయం ఉంది. ఇద్దరూ తమదైన నృత్యప్రతిభతో  చతురంగంకు వన్నె తెచ్చారు’ అంటోంది కవితారాము. చదరంగంపై పావుల సహజ కదలికలను దృష్టిలో పెట్టుకొని మొదట్లో నృత్యాన్ని రూపొందించాలనుకున్నారు. అయితే దీని గురించి చర్చ జరిగింది. క్రియేటివ్‌ లిబర్టీ తీసుకుంటూనే బాగుంటుంది అనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు ఎక్కువమంది కళాకారులు. దీంతో నృత్యరీతులకు సృజనాత్మకతను జోడించారు.

నలుపువర్ణ రాణి, శ్వేతవర్ణ రాజును ఓడించడంతో వీడియో ముగుస్తుంది. ఇది యాదృచ్ఛిక దృశ్యమా? ప్రతీకాత్మక దృశ్యమా? అనే సందేహానికి కలెక్టర్‌ కవితారాము జవాబు... ‘కావాలనే అలా డిజైన్‌ చేశాం. అంతర్లీనంగా ఈ దృశ్యంలో ఒక సందేశం వినిపిస్తుంది. తెలుపు మాత్రమే ఆకర్షణీయం, అందం అనే భావనను ఖండించడానికి ఉపకరించే ప్రతీకాత్మక దృశ్యం ఇది. దీనిలో జెండర్‌ కోణం కూడా దాగి ఉంది.’

మరిన్ని వార్తలు