క్షమాగుణం సఫల జీవితానికి చుక్కాని

12 Jul, 2021 07:16 IST|Sakshi

తప్పొప్పులనేవి  జరుగుతూనే ఉంటాయి. అది సహజం. ఎవరైనా చేయొచ్చు.ఎవరి వలన తప్పు జరిగినా రెండవవారు పెద్ద మనసుతో క్షమించగలిన గుణం కలిగి వుండాలి. క్షమించటం అనేది విజయమే కానీ ఓటమి కాదు. క్షమించటం వల్ల పాడైపోయిన సంబంధాల పునరుద్ధరణ జరగడంతోబాటు మనలో వున్న కోపం, కసి అనేవి మాయమైపోతాయి. అంటే మనలో వున్న మానసిక ఒత్తిడిని దూరం చేసుకున్నామన్న మాట.

మనిషి అనగానే  కొన్ని బంధాలకు అనుబంధాలకు లోబడి వుంటాడన్నది నిజం. అందులో తన కుటుంబీకులే గాకుండా బంధువులు, స్నేహితులు, సన్నిహితులు కూడా వుంటారు.  అయితే ఈ  అనుబంధాలు ఎల్లవేళలా ఒకేలా వుండవు.  ఏదో ఒక సమయంలో ఏదో ఒక చిన్న తేడా రావొచ్చు. దాంతో  మన మనసుకు కొంచెం ఇబ్బంది కలగవచ్చు. ప్రస్తుత కాలంలో ఆ సంబంధాలు చెడిపోయినా, ఒకప్పుడు అవి ఆనందాన్ని, ప్రేమను, తృప్తిని ఇచ్చినవే. అసలు ఈ సంబంధాలు ఎలా ఏర్పడినాయని ఆలోచిస్తే, కొన్ని మేధోపరమైనవి, కొన్ని ఆర్థికపరమైనవి కాగా, కొన్ని వారి ఆలోచనలు, భావాలు కలిస్తే వచ్చినవి అయి ఉంటాయి. ఇష్టాయిష్టాలు ఒకటి కావటంతో కూడా కొన్ని బంధాలు ఎంతోకాలం నిలిచే వీలుంది. భౌతిక రూపానికి కూడా కొందరు ఇష్టపడతారు.

అలా దగ్గరవుతారు. ఎంతో గొప్పగా సాగుతాయి ఈ సంబంధాలు. కానీ ఎక్కడో చిన్న తేడా వస్తుంది. అక్కడే వచ్చిన చిక్కల్లా.  కొందరు వెంటనే సరిదిద్దుకోగలుగుతారు. మరికొందరికి అది కుదరకపోవచ్చు. ఆ చిన్న తేడా వలన గతంలో వున్న  అనుబంధంలో తేడా వస్తుంది.  అది ఒకోసారి పలకరింపులు కూడా లేని స్థితికి  తీసుకువెళుతుంది. అసలు బంధమే  చెడిపోయే స్థితికి పడిపోవచ్చు లేదా అసలు బంధమే  తెగిపోయి, ఎడముఖం పెడముఖంగా మారిపోవచ్చు. కానీ తర్వాతి కాలంలో ఎప్పుడో మనకు అనిపించవొచ్చు... అయ్యో ఇదేమిటీ ఇలా  చేసుకున్నాము అని. అటువంటి పరిస్థితి రాకుండా వుంటే బాగుండేది అనిపించవొచ్చు. ఇలాంటి భావన తర్వాతి కాలంలో కలుగవొచ్చు. కొన్ని సందర్భాలలో సంబంధాలను మెరుగుపరచుకోవాలన్నా కుదరని మానసిక స్థితి వెంటాడుతుంది కూడా.

ఇలా చెడిపోవడానికి కారణం అవతలి వారిది అయినా కూడా తప్పు అర్ధం అయినా , తిరిగి సంబంధాలు తిరిగి కావాలని అనుకుంటే క్షమాగుణం కలిగి ఉండాలి. క్షమా  గుణాన్ని ప్రదర్శించటం అంటే కొందరు తమ వ్యక్తిత్వం దెబ్బతింటుందేమో అని అనుకుంటారు. కానీ అది వ్యక్తిత్వాన్ని పెంచేదేకాని తగ్గించేది మాత్రం కాదు. ప్రతి ఇద్దరి మధ్య ఎన్నో మంచి చెడులు వారికి మాత్రమే తెలిసినవి ఉండొచ్చు. అవతలివారు చాలాసార్లు మనకు ఎన్నో మంచి చేసిన సందర్భాలు వుండి వుండొచ్చు. ఆ మంచిని మర్చిపోయి, మధ్యలో చేసిన తప్పును పట్టుకుని సంబంధాలను చెడకొట్టుకోవడం మంచిది కాదు. అది సరి అయిన పద్ధతి కాదు. తప్పొప్పులనేవి  జరుగుతూనే ఉంటాయి. అది సహజం. ఎవరైనా చేయొచ్చు. ఎవరివలన తప్పు జరిగినా రెండవవారు పెద్ద మనసుతో క్షమించగలిన గుణం కలిగి వుండాలి.

క్షమించటం అనేది విజయమే కానీ ఓటమి కాదు. క్షమించటం వల్ల పాడైపోయిన సంబంధాలను పున రుద్ధరించుకోవటం, మనలో వున్న కోపం, కసి అనేవి మాయమైపోతాయి. అంటే మనలో వున్న మానసిక ఒత్తిడి దూరం అవుతుంది. మనసులోని బరువు ఒక్కసారిగా దిగిపోయినట్లవుతుంది. ఇది ఒక కొత్త అనుభూతిని కలుగ చేస్తుంది. మనుష్యులకు దగ్గర అయ్యే కొత్త ప్రయత్నం మొదలవుతున్నట్లే కదా. ఇక్కడ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. అర్థం లేని ఆలోచనలన్నింటినీ  పక్కన పెట్టాలి. అసలు ఆ బంధం తెగకుండా వుంటే బాగుండేదన్న ఆలోచన రాగానే, తిరిగి మనలను గతంలోకి తీసుకువెళుతుంది.

కొందరు ఇదంతా కర్మ ఫలం అంటారు. అయితే ఇక్కడ ఆ కోణంలో కూడా ఆలోచిస్తే, ఇతరుల వలన మనం పడిన కష్టాల ఆలోచన వదిలి, మనం ఇతరులకు చేసిన, కలిగించిన ఇబ్బందుల గురించిన ఆలోచన మొదలవుతుంది. గతంలో మన వలన చెడిపోయిన సంబంధాల ఆలోచన చేస్తే మన తప్పు ఉందన్న విషయం అర్ధమవుతుంది. సొంత తప్పులను ఒప్పుకోవటం అంటే ఒక మెట్టు దిగడం కాదు. వాస్తవాన్ని అంగీకరించడం. ఆ తప్పు ఒప్పుకుంటే అది మనలోని అహాన్ని హరిస్తుంది. ఆ తర్వాత ఇక ఇతరుల తప్పులను క్షమించడం అంత  కష్టం కాదు. సులభంగా క్షమించ గలుగుతారు.

మనుషులన్న తర్వాత, ఈ నవనాగరిక లోకంలో, ఈ యాంత్రిక ప్రపంచంలో తప్పులు చేయకుండా వుండరు. అసలు  మనకు ఎవరైనా ఎందుకు ఈ  విధంగా చేశారు అనే ఆలోచన వస్తే పలురకాల సమాధానాలు కనిపిస్తాయి. వాటిని వదిలించుకునే ప్రయత్నం చేయాలి. నిజానికి మానసిక ప్రశాంతత అనేది ఎవరికి వారు సంపాదించుకోవాల్సిందే. ఇక మనం తృప్తి, అశాంతి, ఈ రెండింటిలో ఏది కావాలో ఎంచుకోవాలి. కసి, కోపం, ద్వేషంతో అశాంతిని మూటకట్టుకోవాలా లేక క్షమించి కొత్త జీవితం ప్రారంభించాలా? ఈ నిర్ణయం మన చేతుల్లోనే వుంది.

క్షమాగుణానికి సుఖ శాంతులను చేకూర్చే మహత్తరమైన గుణం ఇమిడి వుంది. అది తెలుసుకుంటే జీవితమే మారిపోయి ఆనందంగా వుండే అవకాశం ఉంటుంది.  క్షమ సఫల జీవితానికి చుక్కాని. క్షమ ఒక ఆయుధం, దాన్ని ధరించితే దుర్జనుడేమీ చేయలేడు. ప్రతీకారేచ్ఛ లేకపోవడమే సహనం. ఓరిమిని కూర్చిన సద్గుణం మరొకటిలేదు. ఇక క్షమించడం మనందరం నేర్చుకుందాము. హాయిగా జీవిద్దాం.  
– డా. పులివర్తి కృష్ణమూర్తి 

మరిన్ని వార్తలు