టైమొచ్చింది ఫ్రెండ్స్‌... తిరిగి ఇచ్చేద్దాం!

29 Apr, 2021 23:39 IST|Sakshi
స్నేహా రాఘవన్, శ్లోక అశోక్‌ 

‘ఊరు మనకెంతో చేసింది.. తిరిగిచ్చేద్దాం లేదంటే లావైపోతాం’ అనే శ్రీమంతుడు సినిమా డైలాగ్‌ రియల్‌ లైఫ్‌లో కూడా ఎంతోమందిని కదిలించింది. అచ్చం ఇటువంటి డైలాగునే కాస్త మార్చి చెబుతున్నారు బెంగుళూరుకు చెందిన ఇద్దరమ్మాయిలు. ‘‘సమాజం మనకు చేసిన దాంట్లో కొంతైనా తిరిగిచ్చేద్దాం! అందుకు ఇదే సరైన సమయం’’ అంటూ తమవంతు సాయంగా నిరుపేదలకు రెండువందల పల్స్‌ ఆక్సిమీటర్లు ఉచితంగా పంపిణీచేస్తున్నారు బెంగళూరుకు చెందిన స్నేహా రాఘవన్, శ్లోకా అశోక్‌లు. ఈ ఇద్దరు కలిసి విరాళాల రూపంలో నిధులు సేకరించి ఎన్జీవో సంస్థ ద్వారా ఆక్సీమీటర్లు అందిస్తున్నారు. 

 బెంగళూరులోని సరజ్‌పూర్‌కు చెందిన స్నేహా రాఘవన్, శ్లోకా అశోక్‌లు ‘గ్రీన్‌వుడ్‌ హై ఇంటర్నేషనల్‌ స్కూల్‌’లో పదో తరగతి చదువుతున్నారు.‘‘ప్రస్తుతం మనదేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చి విరుచుకుపడుతోంది. దీంతో పిల్లల నుంచి పెద్దవారి వరకు అంతా ఏదోరకంగా తమకు తోచిన సాయం చేస్తున్నారు. ఇది చూసిన స్నేహా, శ్లోకలు ...‘తాము కూడా ఏదోక సాయం చేయాలని అనుకున్నారు’ ఎలా సాయం చేయాలి? అనుకుంటున్న సమయంలో సామాజిక కార్యకర్త అనుపమ పరేఖ్‌ వారిని కలవడంతో తమ మనసులోని మాటను ఆమెకు చెప్పారు. ‘‘ప్రస్తుతం కరోనా పాజిటివ్‌ వచ్చినవారు ఎప్పటికప్పుడు ఆక్సిజన్‌ లెవల్స్‌ను చెక్‌చేసుకోవాలి. అందువల్ల ప్రతిఒక్కరి దగ్గర పల్స్‌ ఆక్సిమీటర్లు తప్పనిసరిగా ఉండాలి.

ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నవారు వీటిని కొనలేరు కాబట్టి, అటువంటివారికి ఆక్సిమీటర్లు అందిస్తే బావుంటుంది’’ అని అనుపమ చెప్పడంతో.. నిరుపేదలకు ఆక్సీమీటర్లు ఇవ్వాలని స్నేహ శ్లోకాలు నిర్ణయించుకున్నారు. వెంటనే ఆక్సీమీటర్ల ప్రాజెక్టుకు నిధులు సేకరించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈక్రమంలోనే ‘గివ్‌ ఇండియా’ పేరుతో వెబ్‌సైట్‌ను క్రియేట్‌ చేసి దానిలో ‘‘నిరుపేదలకు ఆక్సీమీటర్లు ఇచ్చేందుకు నగదు సాయం కావాలి’’అని కోరారు. అంతేగాకుండా ఇదే విషయాన్ని పోస్టర్లపై ప్రింట్‌ చేసి జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో అతికించారు. వీరు ప్రచారం మొదలు పెట్టిన కొద్ది సమయంలోనే మంచి స్పందన లభించి, ఒక్కరోజులోనే రెండు లక్షల రూపాయలు విరాళంగా వచ్చాయి. దీంతో నగదుతో పల్స్‌ ఆక్సీమీటర్లు కొనుగోలు చేసి ఎన్జీవో ‘సంపర్క్‌’ ద్వారా  ఉత్తర బెంగళూరులోని గ్రామాల్లోని పేద కుటుంబాలకు, మురికివాడల్లో నివసించే నిరుపేదలకు పంచుతున్నారు.

‘‘ప్రస్తుతం మన దేశం కరోనా వైరస్‌ అనే మహమ్మారితో తీవ్రంగా పోరాడుతోంది. ఈ సమయంలో సమాజానికి తమ వంతు సాయం చేయాలనుకున్నాం. ఒకపక్క మా బోర్డు పరీక్షలు రద్దవడంతో మాకు కాస్త సమయం దొరికింది. ఇప్పటిదాక సమాజం నుంచి ఎంతో లబ్ధి పొందాం. దాన్ని తిరిగి ఇవ్వాల్సిన సమయం వచ్చింది. అందుకే ఇప్పుడే ఏదైనా చేయాలనుకున్నాం. మా ఆలోచనకు అనుపమ పరేఖ్‌ తోడవడంతో ఈ ఆక్సీమీటర్ల ప్రాజెక్టులో పాల్గొనగలిగాము. ప్రస్తుతం ఉత్తర బెంగళూరులోని మురికివాడలు, గ్రామాల్లోని నిరుపేదలకు ఆక్సిమీటర్లు పంపిణీ చేస్తున్నాము. మా స్కూల్లో ఏర్పాటు చేసిన వివిధ సామాజిక కార్యక్రమాలు మాకు ప్రేరణ ఇవ్వడంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయగలిగాము. మాలాగే మరింతమంది విద్యార్థులు సమాజం కోసం తమవంతు సాయం చేయాలని కోరుకుంటున్నాం. మన తోటి భారతీయులకు సహాయం చేయడానికి ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేస్తే, ఈ విపత్కర పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు’’ అని స్నేహ, శ్లోకలు చెప్పారు.  

మరిన్ని వార్తలు