సక్సెస్‌ఫుల్‌ సలాడ్‌!

22 Jul, 2021 00:23 IST|Sakshi
మేఘా బఫ్నా, ఇంట్లోనే సలాడ్లు తయారు చేయిస్తూ...

మొలకెత్తిన విత్తనాలు, క్యాప్సికమ్, టొమాటో, క్యారట్, బీట్‌ రూట్‌ వంటి కొన్ని రకాల పచ్చి కూరగాయల ముక్కలు సన్నగా కట్‌ చేసి,  ఉదయం పూట సలాడ్‌గా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదనే అవగాహన చాలామందిలో ఉంటుంది. కానీ, రోజూ అలా సలాడ్‌ తయారు చేసుకునే తీరిక అందరికీ ఉండదు. ముఖ్యంగా ఉద్యోగస్థులకు.‘సైడ్‌’ డిష్‌గా, మార్నింగ్‌ బ్రేక్‌ఫాస్ట్‌గా భావించే ఈ హెల్తీ సలాడ్‌ స్థిరమైన సంపాదనకు దారి చూపుతుందని భావించింది పూణెలో ఉంటున్న మేఘా బఫ్నా. ఐదేళ్ల క్రితం రూ.3500తో మొదలుపెట్టిన మేఘా హెల్తీ సలాడ్‌ వ్యాపారం ఇప్పుడు ఆమెకు నెలకు లక్షన్నర రూపాయల ఆదాయం తెచ్చిపెడుతోంది.

‘నా నైపుణ్యాల పట్ల నాకు చాలా నమ్మకం ఉంది. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో 15 ఏళ్ల పాటు ఉన్నాను. పనిలో ఎంత బిజీగా ఉన్నా బ్రేక్‌ఫాస్ట్‌ ్టగా నేను తీసుకున్న సలాడ్‌ నన్ను ఆరోగ్యంగా ఉంచింది. దీన్నే బిజినెస్‌గా మార్చుకుంటే..? అనే ఆలోచన వచ్చినప్పుడు సలాడ్‌ వ్యాపారి గా మారిపోయాను’ అంటారు మేఘా. అనారోగ్యం తెచ్చిన మార్పు తన జీవితంలో ఎంత ముఖ్యమైనదో వివరిస్తూ ‘9వ తరగతి చదువుతున్న సమయంలో అనారోగ్య కారణంగా ఆపరేషన్‌ వరకు వెళ్లాను. నా కాళ్లు నా స్వాధీనంలోకి రావడానికి ఏడాదిన్నర సమయం పట్టింది. పెద్దయ్యాక వచ్చే ఆరోగ్య సమస్యల గురించి డాక్టర్లు ముందే హెచ్చరించారు. దీంతో ఎప్పుడూ బయట ఆహారం తీసుకోలేదు. కాలేజీ స్థాయి నుంచి ఆఫీసు వరకు.. అన్ని రోజుల్లోనూ నాకు నేనుగా తయారు చేసుకున్న ప్రత్యేక భోజనం ఎప్పుడూ నాతోపాటు ఉంటుంది. మా కొలీగ్స్‌ కూడా నా సలాడ్‌ బాక్స్‌ను తిని, మెచ్చుకునేవారు. దీనినే మార్కెట్‌ చేయమని వారు చెబుతుండేవారు’ అని నాటి రోజులను గుర్తుకు తెచ్చుకుంటారు మేఘా.

తాజా తాజా సలాడ్స్‌
‘జంక్‌ ఫుడ్‌ ఎక్కడైనా సులభంగా లభిస్తుంది. కానీ, మంచి ఆరోగ్యకరమైన సలాడ్స్‌ మాత్రం అందుబాటులో లేవు. తాజా సలాడ్స్‌ లభించకపోవడం అనే సమస్యను నేను పరిష్కరించాలనుకున్నాను. అందుకు మా కుటుంబసభ్యులతోనూ చర్చించాను. అలా 2017లో సలాడ్‌ బిజినెస్‌ మొదలుపెట్టాను. ప్రచారం కోసం వాట్సప్, ఫేస్‌బుక్‌లను మాత్రమే ఉపయోగించాను’ అని వివరించే మేఘా మరెక్కడా ప్రమెషన్లు ఇవ్వలేదని, పూర్తిగా సేంద్రియ పదార్థాలతోనే సలాడ్స్‌ తయారుచేస్తానని చెబుతుంది.

కొత్త ఆర్డర్లు.. కొత్త సవాళ్లు
మొదటి రోజున 3,500 రూపాయలతో ఆరు ఆర్డర్ల ప్రారంభ పెట్టుబడితో మేఘా సలాడ్‌ వ్యాపారం మొదలైంది. వచ్చిన ప్రతీ కొత్త ఆర్డర్‌తో, కొత్త సవాళ్లు పెరుగుతూనే ఉన్నాయి. కార్పోరేట్‌ ఉద్యోగం చేస్తూనే అదనంగా సలాడ్‌ వ్యాపారం చేస్తూ వచ్చింది. అందుకు మేఘా రోజూ తెల్లవారుజామున 4 గంటలకు తన పనిని ప్రారంభిస్తుంది. ‘సలాడ్స్‌ కోసం రోజూ ధాన్యాలు నానబెట్టాలి, తాజా కూరగాయలు కావాలి. అందుకు రోజూ మార్కెట్‌కు వెళతాను. కూరగాయలను శుభ్రం చేసి, కట్‌ చేసి సలాడ్స్‌ సిద్ధం చేయాలి. నా కొడుకు స్కూల్‌కు వెళ్లేవరకు నాకు సాయంగా ఉంటాడు. సలాడ్స్‌ ప్యాక్‌ చేసి, పనికి బయల్దేరడం.. ఎలా ఉంటుందంటే రోలర్‌కోస్ట్‌ పై ప్రయాణం చేస్తున్నట్టుగా నా పని ఆనందంగా పూర్తిచేస్తాను’ అని మేఘా చెబుతుంది.

ప్రత్యేకమైన ప్యాకింగ్‌
ఇప్పుడు మేఘా ప్రతి నెల లక్షన్నర రూపాయలు సలాడ్స్‌ మీద సంపాదిస్తుంది. ‘ఇది అంత ఆషామాషీగా జరగలేదు. నాలుగేళ్లు సలాడ్‌ వ్యాపారంలో వచ్చిన అడ్డంకులను ఎదుర్కొన్నాను. కొన్నిసార్లు ఆర్డర్లు తగ్గిపోవడం, ప్లాస్టిక్‌ నిషేధం సమయంలో ప్యాకింగ్‌ విషయంలోనూ సమస్యలు వచ్చాయి. బీపీ, షుగర్‌ సమస్యలున్న కస్టమర్ల కోసం ప్రత్యేకమైన సలాడ్స్‌ తయారుచేయాల్సి ఉంటుంది. కార్పొరేట్‌ ఉద్యోగులకు మరో తరహాలో సలాడ్స్‌ ఇవ్వాల్సి ఉంటుంది’ అని ఈ వ్యాపారంలో ఎదురైన ఇబ్బందులు, వాటిని అధిగమిస్తున్న తీరు తెన్నుల గురించి తెలియజేస్తుంది మేఘా.

‘‘ఇప్పుడు పది మందికి పైగా మహిళలను సలాడ్‌ తయారీలో ఉద్యోగినులుగా నియమించుకోవడంతో వారాంతాలు కుటుంబంతో గడపడం, ఉదయం కాస్త లేటుగా నిద్రలేవడం వంటివి చేస్తున్నాను’’ అని చిరునవ్వుతో చెబుతుంది మేఘా. వారానికి రూ.620లతో మేఘా దగ్గర సలాడ్‌ ఆర్డర్‌ చేసుకోవచ్చు.

మరిన్ని వార్తలు