Social Star: పైజమా పాప్‌స్టార్‌ శిర్లే సెటియా.. ఆర్జే నుంచి సింగర్‌గా..  

29 Sep, 2021 10:04 IST|Sakshi

ప్రతిభ ఉంటే  ప్రపంచంలో ఏ మూలన ఉన్నా పాపులర్‌ కావొచ్చని నిరూపిస్తోంది శిర్లే సెటియా. ఇండియాలో పుట్టినప్పటికీ పెరిగింది, చదువుకుంది అంతా ఆక్లాండ్‌లోనే. అయినా భారత సినిమా పాటలను ఆలపిస్తూ లక్షలాది శ్రోతల్ని తన స్వరంతో అలరిస్తోంది. ఇండో–కివీస్‌ నటిగానేగాక, డ్యాన్సర్‌గా, రేడియో జాకీగా, గాయనిగా, యూ ట్యూబర్‌ గా రాణిస్తోంది.  

షోటైమ్‌ విత్‌ శిర్లే.. 
హరియాణాకు చెందిన రాజ్, ఫిరోజా సెటియా దంపతుల ముద్దుల కూతురు శిర్లే సెటియా. శిర్లే ఇండియాలోనే పుట్టినప్పటికీ.. రాజ్‌ సెటియా వ్యాపార రీత్యా ఆక్లాండ్‌లో స్థిరపడడంతో....శిర్లే ఆక్లాండ్‌లోనే అడుగు వేయడం నేర్చుకుంది. తనకి షానే సెటియా అనే తమ్ముడు ఉన్నాడు. స్కూలులో చురుకైన విద్యార్థిగా పేరున్న శిర్లే చిన్నప్పుడు వ్యోమగామి కావాలని కలలు కనేది. 

కానీ స్కూలు విద్య పూర్తయ్యాక మార్కెటింగ్‌ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌ సిస్టమ్‌లో బీకామ్‌ చేసింది. డిగ్రీ అయ్యాక ఆక్లాండ్‌లో హిందీ కంటెంట్‌ను ప్రసారం చేసే రేడియో టరానాలో పార్ట్‌టైమ్‌ ఉద్యోగం లో చేరి పాపులర్‌ షో ‘షోటైమ్‌ విత్‌ శిర్లే’కు ఆర్జేగా పనిచేసింది. 


   
ఆర్జే నుంచి సింగర్‌గా..  
తన గాత్రం మెరుగుపడ్డాక..2012లో శిర్లే సెటియా పేరుతో యూట్యూబ్‌ చానల్‌ను ప్రారంభించింది. తను అప్‌లోడ్‌ చేసే పాటలకు మంచి స్పందన వచ్చేది. చిన్నప్పటి నుంచి న్యూజిలాండ్‌లో ఉన్నప్పటికీ తల్లిదండ్రులు ఇద్దరూ హిందీలో మాట్లాడడం వల్ల భారతీయ సినిమా పాటలపై శిర్లేకు అవగాహన ఉంది. 

చిన్నప్పటి నుంచి బాలీవుడ్‌ పాటలు వింటూ పెరగడంతో.. భారతీయ సంగీతంపై పట్టు ఏర్పడింది. దాంతో బాలీవుడ్‌ సినిమా పాటలు పాడి వాటిని తన చానల్‌లో అప్‌లోడ్‌ చేసేది. ఏడాది తరువాత టీ సీరిస్‌ ఏర్పాటు చేసిన యూ ట్యూబ్‌ కాంపిటీషన్‌లో పాల్గొంది. ఆషికీ –2లో అర్జిత్‌ సింగ్‌ పాడిన ‘‘హమ్‌ తేరే బిన్‌ అబ్‌ రహనహి సక్‌తే’’ కవర్‌ సాంగ్‌ వీడియోను రికార్డు చేసి తన చానల్‌లో అప్‌లోడ్‌ చేసింది. ఈ పాట బాగా వైరల్‌ అవడంతో టీ సీరిస్‌ పోటీలో  విజేతగా నిలిచి, అధిక సంఖ్యలో వ్యూస్‌ను సంపాదించుకుంది. 

 పైజమా పాప్‌స్టార్‌..  
పాపులారిటీ తెచ్చిన హమ్‌ తేరే పాట వీడియో రూపొందించేటప్పుడు శిర్లే.. పైజమా ఉన్న డ్రెస్‌ ధరించి పాడింది. ఆ పాటతో బాగా పాపులర్‌ అవడంతో.. న్యూజిలాండ్‌ హెరాల్డ్‌ ‘పైజమా పాప్‌స్టార్‌’గా శిర్లేను వర్ణించింది. అప్పటినుంచి శిర్లే పైజమా స్టార్‌గా పాపులర్‌ అయ్యింది.  దాంతో సబ్‌స్కైబ్రర్స్‌ సంఖ్య కూడా బాగా పెరిగింది. 

కోయ్‌ వి నహీ... 
రవిసింఘాల్‌తో కలిసి 2016లో తన తొలి కొయ్‌ షోర్‌ పాటను విడుదల చేసింది. మరుసటి ఏడాది బాలీవుడ్‌ సినిమా ‘ఏ జెంటిల్‌మెన్‌’లో ‘‘డిస్కో డిస్కో’’ పాడింది. ఈ పాటకు 54 మిలియన్ల వ్యూస్‌ వచ్చాయి. ఇదే ఏడాది తన సొంత పాటలు పాడాలని నిర్ణయించుకుని టీమ్‌తో కలిసి పంజాబీ ట్రాక్‌ ‘కోయ్‌ వి నహీ’ సాంగ్‌ను విడుదల చేసింది. ఇది యూట్యూబ్‌లో రికార్డులను బద్దలు కొట్టింది. అలా యూఎస్, యూకే, ఇండియా, కెనడాలలోని యూ ట్యూబ్‌ ఆరి్టస్టులతో కలిసి పాటలు పాడేది. 

పంజాబీ పాపులర్‌ సింగర్‌ గుర్‌నజర్‌తో కలిసి ఆమె విడుదల చేసిన ‘కోయ్‌ వీ నహీ’ పాటకు యూ ట్యూబ్‌లో180 మిలియన్ల వ్యూస్‌ వచ్చాయి. దీనితోపాటు జబ్‌ కోయి బాత్, తు జో మిలా, బోల్‌ డో నా జరా, కుచ్‌ నా కహో, బారీష్‌ కవర్‌ సాంగ్‌లకు గుర్తింపు వచ్చింది. 

‘మస్కా’ ‘నిక్‌ నేమ్‌’ వంటి సినిమాల్లో శిర్లే నటించినప్పటికీ గాయనిగానే తనకి మంచి గుర్తింపు వచ్చింది. అంతేగాక బాలీవుడ్‌ నెక్ట్స్‌ బిగ్‌ సింగింగ్‌ సెన్సేషన్‌గా ఫోర్బ్స్‌ మ్యాగజీన్‌ గుర్తించడం, మ్యూజిక్‌ సెన్సేషన్‌ ఇన్‌ సోషల్‌ మీడియా, న్యూజిలాండ్‌ సోషల్‌ మీడియా అవార్డులలో ‘బెస్ట్‌ ఇన్‌ మ్యూజిక్‌ అవార్డు, లాయిడ్‌ అండ్‌ అవుట్‌లుక్‌ ఇండియా సోషల్‌ మీడియా అవార్డులను అందుకుంది. ప్రస్తుతం శిర్లే యూ ట్యూబ్‌ చానల్‌కు దాదాపు నలభైలక్షల మంది సబ్‌స్క్రైబర్స్‌ ఉండగా, ఇన్‌స్టాగామ్‌ ఫాలోవర్స్‌ డెబ్భై లక్షలకు పైగా ఉన్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: Vajrasana Benefits: మానసిక ఒత్తిడి, వెన్నునొప్పి, ఎసిడిటీ నివారణకు.. యోగా మంత్రమిదే!

మరిన్ని వార్తలు