ఫిట్‌నెస్‌ క్వీన్‌ @ 55

21 Apr, 2022 00:16 IST|Sakshi
నిశ్రీన్‌ పారిఖ్‌

కొంతమంది మధ్యవయసులోనూ కెరీర్‌ ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టి దూసుకుపోతుంటారు. నిస్రీన్‌ పారిఖ్‌ మాత్రం యాభైఏళ్లకు పైబడ్డ వయసులోనూ చక్కటి ఫిట్‌నెస్‌తో అబ్బుర పరుస్తోంది. ‘‘ఆరోగ్యకరమైన, క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అనుసరిస్తే వయసుతో సంబంధం లేకుండా అసాధ్యాలను సుసాధ్యం చేయవచ్చు’’ అని నిరూపించి చూపిస్తోంది  నిస్రీన్‌ పారిఖ్‌.

ముంబైలో పుట్టిన పెరిగిన నిస్రీన్‌ పారిఖ్‌కు చిన్నప్పటి నుంచి ఆటలాడడం అంటే ఎంతో ఇష్టం. పదిహేనేళ్లకే కరాటే నేర్చుకుంది. ఆల్‌ ఇండియా కరాటే ఫెడరేషన్, నేషనల్‌ కరాటే ఛాంపియన్‌షిప్‌లో పతకాలను కూడా సాధించింది. నిస్రీన్‌కు 1989లో పెళ్లయి పిల్లలు పుట్టడంతో..వారిని చూసుకోవడంలోనే సమయం గడిచిపోయేది. అయినా రోజువారి ఫిట్‌నెస్‌ వ్యాయామాలు చేయడం మాత్రం మర్చిపోలేదు.  

 బెస్ట్‌ పర్సనల్‌ ట్రెయినర్‌... ఇంటి బాధ్యతల్లో నిమగ్నమైనప్పటికీ కాస్త వెసులుబాటు చేసుకుని ముంబై యూనివర్సిటీలో సైకాలజీ, సోఫియా కాలేజీలో డైట్‌ అండ్‌ న్యూట్రిషన్‌లో మాస్టర్స్‌ చేసింది. తరువాత ఎయిర్‌ ఇండియాలో ఉద్యోగులకు పర్సనల్‌ ట్రెయినర్‌గా పాఠాలు చెప్పేది. నిస్రీన్‌ క్లాసులకు మంచి ఆదరణ లభించడంతో 2015లో ఏటీపీ ఎక్స్‌లెన్స్‌ అవార్డుల కార్యక్రమంలో ‘బెస్ట్‌ పర్సనల్‌ ట్రెయినర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’గా నిలిచింది.

ఈ ఉత్సాహంతో స్కూల్‌ స్థాయి విద్యార్థులకు ఫిట్‌నెస్‌ ట్రెయినర్‌గా చేరింది. పిల్లలిద్దరూ బోర్డింగ్‌ స్కూల్లో చేరడంతో నిస్రీన్‌కు సమయం దొరికింది. దీంతో యోగాలో పీజీ డిప్లొమా చేస్తూనే ఇంటి దగ్గర సాధన చేస్తుండేది. తర్వాత విద్యార్థులకు, ఫిట్‌నెస్‌ ఔత్సాహికులకు యోగా పాఠాలు చెప్పడం మొదలు పెట్టింది. ఇలా గత పద్దెనిమిదేళ్లుగా యోగా పాఠాలు చెబుతూ ఎంతోమందిని ఫిట్‌గా ఉంచడంతోపాటు తను కూడా ఫిట్‌గా తయారైంది నిస్రీన్‌.

ఆ ఆపరేషన్‌తో బాడీ బిల్డర్‌గా... నిస్రీన్‌కు 48 ఏళ్లు ఉన్నప్పుడు గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్‌ వల్ల ఇబ్బందులు ఏర్పడడంతో గర్భసంచినే తొలగించారు. సర్జరీ సమయం లో కాస్త బలహీన పడిన నిస్రీన్‌.. తన ఫిట్‌నెస్‌పై మరింత దృష్టి పెట్టింది. రెండేళ్ల తరువాత పూర్తి ఫిట్‌నెస్‌ వచ్చిన నిస్రీన్‌ తన పిల్లల ప్రోత్సాహంతో 50 ఏళ్ల వయసులో తొలిసారిగా 2016లో ‘ముంబై బాడీబిల్డింగ్‌ కాంపిటీషన్‌లో పాల్గొంది.

అలా పాల్గొన్న ప్రతి పోటీలో మెడల్‌ గెలుచుకుంటూ లేటు వయసు బాడీబిల్డర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. గ్లాడ్రాగ్స్‌ మిసెస్‌ ఇండియా, ఏషియన్‌ ఛాంపియన్‌షిప్స్‌లో పాల్గొని ‘మోడల్‌ ఫిజిక్‌ అథ్లెట్‌’గా పాపులారిటీ సంపాదించుకుంది. థాయ్‌లో జరిగిన ‘వరల్డ్‌ బాడీబిల్డింగ్‌ అండ్‌ ఫిజిక్‌ ఫెడరేషన్‌ ఛాంపియన్‌షిప్‌’లో నాలుగోస్థానంలో నిలిచి అంతర్జాతీయ గుర్తింపు పొందింది.

కలలు నిజం చేసుకునేందుకు ద్వారాలెప్పుడూ తెరిచే ఉంటాయి. మనముందున్న సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగితే కలలను నిజం చేసుకోవడం పెద్ద కష్టం కాదు. ఉదయాన్నే ప్రోటీన్‌ షేక్, తరువాత వర్క్‌ అవుట్స్‌తో రోజు ప్రారంభం అవుతుంది. అడ్వర్టైజ్‌మెంట్స్‌ షూట్స్, బాలీవుడ్‌ సెలబ్రెటీలను కలుస్తూనే, రోజూ ఫిట్‌నెస్‌ తరగతులు నిర్వహిస్తున్నాను. లాక్‌డౌన్‌ సమయంలో వర్చువల్‌ తరగతులను నడిపాను. కొన్ని ఫిట్‌నెస్‌ సప్లిమెంట్స్‌కు అంబాసిడర్‌గా పనిచేస్తూ ఎప్పూడూ బిజీగా ఉంటున్నప్పటికీ, నా కుటుంబ సహకారం వల్లే నేనెప్పుడూ ఎనర్జిటిక్‌గా, ఫిట్‌గా ఉండగలుగుతున్నాను.
– నిస్రీన్‌

మరిన్ని వార్తలు