శ్రీరామ్‌సాగర్‌ పర్యాటక ప్రదేశం వింతలు .. విశేషాలు..

23 Oct, 2021 11:51 IST|Sakshi

ఈ ఊరిపేరు పోచంపాడు. శ్రీరాముడు వనవాసకాలంలో ఇక్కడ సంచరించాడని స్థానికుల విశ్వాసం. అందుకే పోచంపాడులో నిర్మించిన ప్రాజెక్టు శ్రీరామ్‌సాగర్‌గా పేరు తెచ్చుకుంది. ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని శ్రీరామ్‌సాగర్‌... చక్కటి వీకెండ్‌ హాలిడే స్పాట్‌. పిల్లల కేరింతలు, పెద్దవాళ్ల తాదాత్మ్యతతో ఈ టూర్‌ పరిపూర్ణమవుతుంది. 

మహాగమనం
మహారాష్ట్రలో పుట్టిన గోదావరి గైక్వాడ్, విష్ణుపురి, బాబ్లీ ప్రాజెక్టులను దాటుకుని తెలంగాణలో అడుగుపెట్టి నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరామ్‌సాగర్‌ ప్రాజెక్టుతో వేగానికి కళ్లెం వేసుకుంటుంది. పర్యాటకులను అలరిస్తున్న ఈ ప్రాజెక్టు నిర్మల్, జగిత్యాల్, పెద్దపల్లి, కరీంనగర్, ఉమ్మడి వరంగల్‌ జిల్లాలకు తాగునీరు, సాగునీటికి ప్రధాన ఆధారం.

పుష్కర సాగర్‌
పోచంపాడు గోదావరి నది పుష్కరాలకు కూడా ప్రసిద్ధి. గడచిన పుష్కరాలలో రోజుకు ఐదు నుంచి ఎనిమిది లక్షల మంది నదిలో స్నానమాచరించారు. పుష్కరాలతో ప్రమేయం లేకుండా నదిస్నానం కోసం పర్యాటకులు ప్రతి శుక్రవారం, ఇతర సెలవు దినాల్లో ఎక్కువగా వస్తారు.

భవిష్యత్తులో బోటు షికారు
శ్రీరామ్‌సాగర్‌ ప్రాజెక్టులో బోటింగ్‌ పాయింట్‌ను ఏర్పాటు చేసి బాసర వరకు బోట్లు నడపాలని తెలంగాణ టూరిజం నిర్ణయించింది. శ్రీరామ్‌సాగర్‌ ప్రాజెక్టు నుంచి బాసరకు దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరం. ఇంతదూరం బోటు షికారు చేయడం పర్యాటకులకు అంతులేని ఆనందాన్నిస్తుందనడంలో సందేహం లేదు. టూరిజం కార్పొరేషన్‌ ఏర్పాట్లు చేస్తోంది.

త్యాగచరిత
1963 జూలై 26న అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ పోచంపాడ్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 1978కి ప్రాజెక్టు పూర్తయింది. నిజామాబాద్‌ జిల్లాలోని బాల్కొండ, నందిపేట్, నవీపేట్, ఆర్మూర్, నిర్మల్‌ జిల్లాలోని లోకేశ్వరం, దిలావర్‌పూర్, నిర్మల్‌ మండలాల్లోని పలు గ్రామాల ప్రజలు వ్యవసాయ భూములు, ఇళ్లను త్యాగం చేయడంతో శ్రీరామ్‌సాగర్‌ ప్రాజెక్టు జీవం పోసుకుంది. 

ఎంతెంత దూరం! ఎలా వెళ్లాలి!
శ్రీరామ్‌ సాగర్‌ ప్రాజెక్టు జాతీయ రహదారి 44కు మూడు కి.మీ దూరంలో ఉంది. నిజామాబాద్‌ నుంచి నిర్మల్‌ వెళ్లే బస్సులు పోచంపాడు∙మీదుగా వెళ్తాయి. ఆదిలాబాద్, నిర్మల్‌ నుంచి నిజామాబాద్, హైదరాబాద్‌కు వెళ్లే బస్సులన్నీ పోచంపాడు మీదుగానే ప్రయాణిస్తాయి. పోచంపాడు... హైదరాబాద్‌ నుంచి 200 కిలోమీటర్ల దూరంలో, నిజామాబాద్‌కు 50 కిలోమీటర్లలో, నిర్మల్‌ జిల్లా కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. 

– చంద్రశేఖర్, భద్రారెడ్డి, సాక్షి, నిజామాబాద్‌

చదవండి: Wonder of Science: బాప్‌రే.. ఒక్క చెట్టుకే 40 రకాల పండ్లా..!!

మరిన్ని వార్తలు