సండే సిరీస్‌..: ఏది నేరం? ఏది పాపం?

17 Apr, 2022 04:31 IST|Sakshi

పాపం చేస్తే  అంతర్లోకం కల్లోలం అవుతుంది. నేరం చేస్తే చట్టం వెంటబడి జీవితం బందీ అవుతుంది. అన్నీ బాగుంటే నేరం ఎందుకు చేస్తారు? అన్నీ బాగున్నా పాపం ఎందుకు చేస్తారు?
మనిషి  వీలైనంత వరకు నేరం, పాపం చేయకుండా ఉండటానికే ప్రయత్నిస్తాడు. కాని నేరమో, పాపమో చేసే పరిస్థితులు వస్తే?
జీ ఫైవ్‌లో తాజాగా విడుదలైన 7 ఎపిసోడ్ల ‘గాలివాన’ జీవితంలో ఎదురయ్యే అనూహ్య ప్రహేళికలను ఆసక్తికరంగా చూపిస్తుంది. నేరం చేస్తే చట్టం శిక్షిస్తుంది. పాపం చేస్తే అంతరాత్మ శిక్షిస్తుంది. కాని పాపాన్ని ఆపబోయి నేరం చేస్తే? ‘గాలివాన’ కథ ఇదే.

జీవితంలో కొన్ని ఎప్పటికీ జరక్కూడదు. కాని జరిగినప్పుడు వాటిని ఆచితూచి ఎదుర్కొనాలి. ఆ నష్టాన్ని నివారించాలి తప్ప ఆ నష్టానికి విరుగుడుగా మరిన్ని నష్టాలు తెచ్చే పని చేయకూడదు. ఉద్వేగాలు చాలా ప్రమాదకరమైనవి. అందుకే ఏ నిర్ణయమైనా స్థిమితంగా, ఆలోచనతో, వాస్తవిక అవగాహనతో చేయాలి. లేకుంటే చాలా ప్రమాదం. అవును... చాలా ప్రమాదం.

జీ 5లో ప్లే అవుతున్న వెబ్‌ సిరీస్‌ ‘గాలివాన’ కథ ఏమిటి?
ఒక గాలివాన రోజు. రాకపోకలకు వీలు లేని రాజోలు దగ్గర ఉన్న ఒక లంక దీవి. రెండు పెద్ద పెద్ద ఇళ్లు. ఆ ఇళ్లలోని ఒక ఇంటి అమ్మాయి, మరో ఇంటి అబ్బాయికి కొత్తగా పెళ్లయ్యింది. తర్వాత వాళ్లు హనీమూన్‌కు వైజాగ్‌ వెళ్లారు. వాన కురుస్తున్న రోజు అది. వైజాగ్‌లో అమ్మాయి, అబ్బాయి ఆ రాత్రికి హనీమూన్‌ జరుపుకోవాలి. ఇక్కడ అబ్బాయి ఇంటి వాళ్లు, అమ్మాయి ఇంటి వాళ్లు రొటీన్‌ పనుల్లో మునిగి ఉంటారు. కాని హటాత్తుగా వైజాగ్‌లో ఉన్న కొత్త జంటను ఒక దుండగుడు దారుణంగా హత్య చేస్తాడు. వధువు ఒంటి మీదున్న నగలను దొంగిలిస్తాడు. వాటిని అమ్మి దారిన పోయే కారును దొంగిలించి ఆ వానలో అదే లంక దీవి వైపు వస్తూ యాక్సిడెంట్‌ అయ్యి అబ్బాయి ఇంటి ముందు కారుతో సహా బోర్లా పడతాడు.

అప్పటికే దుర్వార్త ఆ రెండు ఇళ్లకు చేరింది. వధూవరులు హత్యకు గురయ్యారు. వాళ్లను చంపిన హంతకుణ్ణి టీవీలో చూపిస్తున్నారు. ఆ శోకంలో ఉన్న అబ్బాయి కుటుంబం వారు తమ ఇంటి బయట యాక్సిడెంట్‌కు గురైన కారు దగ్గరకు వస్తారు. తమ వాళ్లను హత్య చేసింది ఆ కారు నడుపుతున్నవాడే అని తెలియక ఇంట్లోకి తెచ్చి వైద్యం చేస్తారు. అమ్మాయి ఇంటి వారు కూడా హెల్ప్‌ చేయడానికి వస్తారు. అప్పుడే ఆ ఆగంతకుడే హంతకుడు అని తెలుస్తుంది. అంటే తమ ఇంటి ముక్కుపచ్చలారని జంటను చంపింది ఇతడేనన్న మాట. వీణ్ణి కాపాడాలా? చంపేయాలా? అందరి భావోద్వేగాలు అదుపు తప్పుతాయి. ఏం చేయాలన్న నిర్ణయాన్ని పోస్ట్‌పోన్‌ చేసి హంతకుణ్ణి గొడ్ల చావిడిలో పెడతారు. రాత్రి సమయం అది. గాలివాన. కాని తెల్లారే సరికి హంతకుడు చచ్చిపడి ఉంటాడు. ఎవరో అతణ్ణి చంపేసి ఉంటారు. ఆ చంపింది ఎవరు? అమ్మాయి తరఫు కుటుంబ సభ్యుల్లోని ఒకరా? అబ్బాయి తరపు కుటుంబ సభ్యుల్లోని ఒకరా?
ఎవరు చంపారు? కాని అసలు ప్రశ్న తర్వాత వస్తుంది. అది– ఎందుకు చంపారు?

బిబిసి వారు 2016లో తీయగా విపరీతమైన జనాదరణ పొందిన వెబ్‌ సిరీస్‌ ‘ఒన్‌ ఆఫ్‌ అజ్‌’కు తెలుగు రూపాంతరం ఈ సిరీస్‌. స్కాట్‌లాండ్‌లోని పర్వత ప్రాంతంలో జరిగినట్టుగా ఉండే ఒరిజినల్‌ కథను మన లంక దీవికి మార్చి తీశారు. హత్యకు గురైన వరుడి తల్లిగా రాధిక, వధువు తండ్రిగా సాయి కుమార్‌ కీలకమైన పాత్రలు. మిగిలిన పాత్రల్లో చాందినీ, చైతన్య కృష్ణ, నందిని రాయ్, తాగుబోతు రమేష్‌ తదితరులు నటించారు. బిబిసి, జీ 5 కలిసి ఈ నిర్మాణం చేశాయి. రచన చంద్ర పెమ్మరాజు. దర్శకుడు శరణ్‌ కొప్పిశెట్టి.

7 ఎపిసోడ్ల ‘గాలివాన’ దాదాపు మూడున్నర గంటల నిడివి ఉంది. మర్డర్‌ మిస్టరీ కనుక ఆసక్తి సహజం. అందులో ఉప కథలు కూడా ఉండటంతో  వేదికలు మారుతూ కథ ముందుకు కదులుతుంది. హంతకుణ్ణి చంపాక తమలో ఎవరో ఒకరు చంపారు అని అందరికీ తెలుసు. కాని అందరూ అందరినీ కాపాడుకోవాలనే చూస్తారు. కాని వ్యక్తులు నిస్సహాయ స్థితిలో ఉన్న సమయంలో కూడా వారిని పీక్కు తిని లబ్ధి పొందాలని చూసే వారుంటారు. బ్లాక్‌మెయిల్‌ చేసి ఇంకా టెన్షన్‌ ఇస్తారు. అలా టెన్షన్‌ పెట్టే పాత్రలు కూడా ఉన్నాయి. అంటే పరిస్థితులను బట్టి మనిషి నీచుడా, గొప్పవాడా అనేది తేలుతుంది.

అదే సమయంలో నేరం, పాపం అనే చర్యల చర్చ కూడా ఉంటుంది. మన కుటుంబ సభ్యులను చంపినవాడిని చంపడం నేరం ఎలా అవుతుంది? అని అందరూ అనుకుంటారు. కాని అలా చంపడం పాపం కదా. అలాగే తల్లిదండ్రులు చేసే తప్పులు, పాపాలు పిల్లలను ఎలా వెంటాడుతాయో ఈ కథలో ఉంటుంది. పెళ్లికి ముందు ప్రేమలు, పెళ్లి తర్వాత విడాకులు అవి ఎక్కడికీ పోవు. తర్వాతి తరాలకు శాపాలుగా మారే అవకాశం ఉంటుందని చూపుతారు. అసలు కథేమిటంటే వీరిలో ఒకరు ఆ హంతకుణ్ణి చంపారు. నిజానికి వీరిలో ఒకరు ఆ కొత్త వధువరులను చంపడానికి కూడా కారకులయ్యారు. ఆ ఒకరు ఎవరు అనేదే కథ.

ఖర్చుకు వెనుకాడకుండా రాధిక, సాయికుమార్‌ వంటి సీనియర్లను పెట్టి తీయడం వల్ల సిరీస్‌ నిలబడింది. కొడుకును కోల్పోయిన దుఃఖం, ఉన్నవారిని కాపాడుకోవాలనే తపన రాధికలో అలవోకగా పలికింది. సాయికుమార్‌ తన గొంతుతోనే సగం ఎఫెక్ట్‌ తీసుకు వచ్చాడు. సిరీస్‌కు మరో కీలకపాత్ర అయిన చాందిని తన శక్తికి మించి రక్తి కట్టించింది. నందిని రాయ్‌కు మంచి పాత్ర. కాని చివరి ఎపిసోడ్లు మరింత బాగుండాల్సింది.
నేరం జరిగినా, పాపం జరిగినా అందుకు బదులుగా చేసే పని ఏదైనా కావచ్చుగాని ప్రాణం తీసేది మాత్రం కాకూడదు. మనిషి ప్రాణం తీస్తే అది ఏక కాలంలో నేరం, పాపం. రోజూ పేపర్లలో ఎన్నో క్షణికావేశాల చర్యలు కనిపిస్తాయి. వాటి నుంచి బయటపడి జీవితాలను కాపాడుకోవాలని ఈ సిరీస్‌ చెప్పే ప్రయత్నం చేస్తుంది.
ఏప్రిల్‌ 14న విడుదలైంది. జీ5లో చూడండి.

మరిన్ని వార్తలు