మలేరియాకు ర్యాడికల్‌ చికిత్స! 

3 Oct, 2021 05:15 IST|Sakshi

మళ్లీ మళ్లీ జ్వరం వస్తుండటం ఎందుకంటే...
మలేరియా అనేది ప్రోటోజోవా అనే విభాగానికి చెందిన ఏకకణ జీవి అయిన ‘ప్లాస్మోడియమ్‌’ కారణంగా వస్తుంది. మళ్లీ ఇందులోనూ కొన్ని రకాలు ఉంటాయి. ఉదాహరణకు ప్లాస్మోడియమ్‌ వైవాక్స్, ప్లాస్మోడియమ్‌ ఓవ్యూల్‌. మిగతా రకాలు ఎలా ఉన్నా... ఇవి మాత్రం చికిత్స తర్వాత... మందులకు దొరికి నశించిపోకుండా ఉండేందుకు వెళ్లి కాలేయంలో దాక్కుంటాయి. ఒకవేళ ఇవి అక్కడ దాక్కుని ఉంటే... చికిత్స తర్వాత కొన్ని రోజులకూ లేదా కొన్ని నెలలకు సైతం మళ్లీ మళ్లీ జ్వరం తిరగబెడుతూ ఉంటుందన్నమాట. అందుకే దాన్ని పూర్తిగా తొలగించేలా చేయడానికే ఈ ‘ర్యాడికల్‌ చికిత్స’ అవసరమన్నమాట. 

మలేరియా వచ్చినప్పుడు కొంతమంది ప్రాథమికంగా చికిత్స తీసుకుని తగ్గగానే దాని గురించి మరచిపోతారు. నిజానికి మలేరియా తగ్గాక కూడా ఆ జ్వరానికి ‘ర్యాడికల్‌ ట్రీట్‌మెంట్‌’ అనే చికిత్స తీసుకోవాలి. అంటే శరీరంలోని మలేరియల్‌ ఇన్ఫెక్షన్‌ను పూర్తి స్థాయిలో తీసివేయడమన్నమాట. సాధారణంగా మలేరియా జ్వరం తగ్గిన రెండు వారాల పాటు ఈ చికిత్సను కొనసాగించాల్సి ఉంటుంది. లేకపోతే మలేరియా జ్వరం మళ్లీ రావచ్చు. 

మరప్పుడు ఏం చేయాలి? 
మలేరియా వచ్చాక అది ప్లాస్మోడియమ్‌ వైవాక్స్, ప్లాస్మోడియమ్‌ ఓవ్యూల్‌ రకానికి చెందిందా కాదా అని తెలుసుకోవడం కోసం ‘బ్లడ్‌ స్మియర్‌’ను మైక్రోస్కోప్‌ కింద పరీక్షించాల్సి ఉంటుంది. బాధితుడికి ప్లాస్మోడియమ్‌ వైవాక్స్‌ ఉందని తెలిశాక, వాస్తవానికి అతడికి ‘ప్రైమాక్విన్‌’ అనే మందును 14 రోజుల పాటు ఇవ్వాలి. అయితే వాళ్లలో ‘జీ6పీడీ’లోపం ఉంటే అలాంటివాళ్లకు ప్రైమాక్విన్‌ మందు ఇవ్వకూడదు. ఆ లోపం ఉందా లేదా అని తెలుసుకునేందుకు ‘జీ6పీడీ’ అనే పరీక్ష నిర్వహించి, లోపం లేనివాళ్లకు మాత్రమే ప్రైమాక్విన్‌ మందు ఇవ్వాల్సి ఉంటుంది. అలా మందును నిర్ణీత కాలంపాటు బాధితుడికి ఇచ్చి... అతడిలోనుంచి మలేరియాను సమూలంగా తొలగిపోయేలా చేయాలి. దీన్నే ‘ర్యాడికల్‌ ట్రీట్‌మెంట్‌’ అంటారు. 
డాక్టర్‌ జి. నవోదయ సీనియర్‌ ఫిజీషియన్, జనరల్‌ మెడిసిన్‌ 

మరిన్ని వార్తలు