Mosquitoes: బోదకాలు, చికున్‌ గున్యా, కాలా అజర్‌.. ఇంకా

3 Sep, 2021 10:27 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

వానాకాలం వచ్చిందంటే వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. కానీ ఇదే సమయంలో మనిషికి ప్రమాదకరమైన దోమల్లాంటి కీటకాల విజృంభణ పెరుగుతుంది. అనాది కాలంగా దోమకాటు మనిషికి ప్రాణాంతకంగా ఉంటోంది. ఆధునిక యుగంలో వైద్య విజ్ఞానం పెరిగిన తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. అందుకే దోమలే కదా, అని తీసిపారేయకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

భారత్‌ లాంటి ఉష్ణమండల దేశాల్లో, జనాభా అధికంగా ఉండే దేశాల్లో దోమలు పలురకాలుగా చెలరేగుతుంటాయి. వీటివల్ల రకరకాల వ్యాధులు సంభవించడమే కాకుండా, వీటిలో కొన్ని వ్యాధులు ప్రాణాంతకాలు కూడా! ప్రపంచ ఆరోగ్యసంస్థ లెక్కల ప్రకారం దోమకాటుకు భారత్‌తో సహా దక్షిణాసియాలో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. సో.. అజాగ్రత్త అస్సలు పనికిరాదు.


దోమలు.. వ్యాధులు
మనిషి రక్తాన్ని నేరుగా పీల్చే దోమలు అదే రక్తంలోకి పలురకాల సూక్ష్మ క్రిములను ప్రవేశపెడతాయి. దీంతో మనిషిలో పలు రకాల వ్యాధులు ప్రబలుతుంటాయి. భారత్‌లో దోమల ద్వారా వ్యాపించే కొన్ని ప్రమాదకరవ్యాధుల వివరాలు ఇలా ఉన్నాయి..

మలేరియా
ప్లాస్మోడియం అనే పరాన్నజీవి వల్ల వ్యాపిస్తుంది. ఉదయం, సాయంత్ర వేళ్లలో అనాఫిలస్‌ దోమకాటు వల్ల ప్లాస్మోడియం సోకుతుంటుంది. సోకిన తర్వాత అధిక జ్వరం, విపరీతమైన చలి, తలనొప్పి, విపరీతమైన చెమటలు, కండరాల నొప్పి లాంటి లక్షణాలు బయటపడతాయి. పిల్లలు, గర్భిణులు, ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవారు, తరచూ ప్రయాణాలు చేసేవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని దశాబ్దాల క్రితం అతం్యంత ప్రాణాంతక వ్యాధిగా పరిగణించేవారు. ప్రస్తుతం చికిత్స అందుబాటులో ఉంది. తగ్గడానికి క్లోరోక్వినాన్‌ మందును వాడతారు. 

బోదకాలు
ఒకప్పుడు భారత్‌లో పలు ప్రాంతాల్లో విపరీతంగా కనిపించేది. వుచరేరియా అనే పరాన్నజీవి వల్ల, క్యూలెక్స్‌ దోమ కాటుతో సంక్రమిస్తుంది. మనిషి లింఫాటిక్‌ వ్యవస్థలో పరాన్న జీవి చేరుకొని రక్తం నిండా దాని లార్వాని కోట్ల సంఖ్యలో విడుదల చేస్తుంది. దీనివల్ల లింఫ్‌ వ్యవస్థ దెబ్బతిని కణజాలాలు వాయడం, చర్మం బిరుసెక్కడం, అవయవాల్లో అనవసర ద్రవాలు చేరడం సంభవిస్తుంది. దీనివల్ల క్రమంగా వైకల్యం వస్తుంది. 

చికున్‌ గున్యా
ఇది కూడా వైరస్‌ ద్వారా సోకుతుంది. ఏడిస్‌ దోమ కాటుతో సంక్రమిస్తుంది. తలనొప్పి, కీళ్లనొప్పులు, వెన్నునొప్పి, దద్దుర్లు కనిపిస్తాయి. లక్షణాలు వారం పాటు ఉండి తగ్గినా, నొప్పులు మాత్రం నెలల పాటు కొనసాగుతాయి. డెంగ్యూతో ఈ వ్యాధి లక్షణాలకు పోలిక ఉంటుంది. రక్తపరీక్షద్వారా నిర్ధారిస్తారు.

కాలా అజర్‌
లెస్మోనియాసిస్‌ పరాన్నజీవి వల్ల సాండ్‌ఫ్లై కాటుతో సంక్రమిస్తుంది. వారాల పాటు తగ్గని జ్వరం, ప్లీహం ఉబ్బడం, రక్తహీనత, బరువు తగ్గడం వంటి లక్షణాలుంటాయి. తొందరగా చికిత్స అందకపోతే రెండేళ్లలో మరణించే ప్రమాదం ఉంటుంది. ఈ జ్వరం తగ్గిన తర్వాత చర్మం మీద దద్దుర్లు వస్తుంటాయి. 

జపనీస్‌ ఎన్‌సెఫలైటిస్‌
ఇది వైరస్‌ ద్వారా క్యూలెక్స్‌ దోమ కాటు వల్ల వస్తుంది. జ్వరం, వాంతులు వస్తాయి. ముదిరినప్పుడు మెదడుపై ప్రభావం చూపుతుంది. దీంతో మూర్చరోగం కూడా రావచ్చు. చిన్నపిల్లల్లో ప్రాణాంతకంగా మారుతుంది. 

డెంగ్యూ
దోమల ద్వారా వ్యాపించే ప్రాణాంతక వ్యాధుల్లో ఒకటి. డెంగ్యూ వైరస్‌ ద్వారా సోకుతుంది. సోకిన 3–14 రోజుల్లో అధిక జ్వరం, వాంతులు, కీళ్లనొప్పులు, దద్దుర్లు లాంటి లక్షణాలు బయటపడతాయి. తగ్గడానికి నిర్దిష్టమైన మందులు లేవు. లక్షణాలను బట్టి మందులు వాడతారు. దాదాపు వారంలో తగ్గుతుంది. కానీ ఒక్కోసారి జ్వరం చాలా ఎక్కువైతే చర్మం కింద రక్తనాళాలు చిట్లడం లాంటి ప్రమాదాలు జరుగుతాయి. ఇలాంటప్పుడు ఆస్పత్రిలో చేరాల్సిఉంటుంది. 

దోమల ద్వారా వచ్చే వ్యాధులను తేలిగ్గా తీసుకోకూడదు. ఉదాహరణకు మలేరియా దాదాపు 90కిపైగా దేశాల్లో కనిపిస్తుంది. ఏటా దాదాపు 50 కోట్లమంది దీని బారిన పడుతుంటే, వీరిలో 27 లక్షల మంది మరణిస్తుంటారు. దోమల ద్వారా ఏటా 250 కోట్ల మంది పలు వ్యాధులబారిన పడుతున్నట్లు అంచనా. అందువల్ల ఇవి సోకిన తర్వాత చికిత్స కన్నా నివారణే మంచి మార్గమని నిపుణుల సలహా.

చదవండి: National Nutrition Week: ఆరోగ్యానికి 5 చిట్కాలు.. అన్నీ తెలిసినవే!

మరిన్ని వార్తలు