సోలో ట్రావెల్‌

8 Mar, 2021 08:09 IST|Sakshi
కెనడాలోని పీటోలేక్‌ దగ్గర పర్యాటకురాలు రజని లక్కా

ఎప్పుడూ ఎవరో ఒకరు తోడుండాల్సిందేనా?! మనకు మనంగా ఎక్కడికీ వెళ్లలేమా! వెళ్లిరాలేమా! మనకోసం ఒకరు తోడు ఉండటం మంచిదే. స్కూల్‌కి అక్క తోడు. కాలేజ్‌కి అన్న తోడు. పెళ్లయ్యాక భర్త తోడు.
ఎప్పుడైనా మనసు ‘సోలో’గా వెళ్లానుకుంటే? తోడు రావడానికి సిద్ధంగా ఉండాల్సింది మనకు మనమేగా!!

బళ్ళారి నివాసి రజని లక్కా ట్రావెల్‌ అనుభవాలు.. ఆమె మాటల్లో...
నా ప్రధానమైన ఇష్టాల్లో ఒకటి స్మిమ్మింగ్, మరొకటి టూర్‌. అయితే సోలో ట్రావెలర్‌ని కాదు. ఎప్పుడూ బంధువులు, స్నేహితులతో కలిసి వెళ్లేదాన్ని. కానీ 2014 ఆగస్టులో కెనడాకి ఒక్కదాన్నే వెళ్లాను. ఒంటరిగా ప్రయాణించడం అదే తొలిసారి, కెనడాకు వెళ్లడమూ మొదటిసారే. అప్పుడు మాంట్రియెల్‌లో ‘ఫినా మాస్టర్స్‌ స్విమ్మింగ్‌ వరల్డ్‌ కప్‌ చాంపియన్‌షిప్‌ జరిగింది. ఆ పోటీల కోసం కెనడాలో అడుగుపెట్టాను. పోటీలు పది రోజులు, కానీ మరో ఇరవై రోజులు దేశంలో పర్యాటక ప్రదేశాలను చూడడానికే ఉండిపోయాను. 

వెనక్కి చూసుకుంటూ వెళ్లాను
మాంట్రియెల్‌లో యాక్సెసరీ కార్డు తీసుకున్నాను. ఆ కార్డు ఉంటే నగరంలో బస్సులు, మెట్రో రైళ్లు అన్నింటిలోనూ ప్రయాణించవచ్చు. చూడాలనిపించిన పర్యాటక ప్రదేశానికి ఏ రూట్‌లో వెళ్లాలో మ్యాప్‌ చూసి తెలుసుకోవడం, ఆ రూట్‌ రైలు, బస్సు ఎక్కి వెళ్లిపోవడమే. అక్కడ రైల్వే లైన్‌ అండర్‌ గ్రౌండ్‌లో ఉంటుంది. రైళ్లు పైకి కనిపించవు. రైల్వే స్టేషన్‌ నుంచి బయటపడడం అంటే ఆ స్టేషన్‌తో కలిసి ఉన్న మాల్‌లోకి వెళ్లడమే. మాల్‌ నుంచి రోడ్డు మీదకు రావాలి. నేను మాంట్రియెల్‌లో మా ఫ్యామిలీ ఫ్రెండ్స్‌ ఇంట్లో ఉన్నప్పుడు బస్‌ పాయింట్‌ నుంచి వాళ్ల ఇంటి వరకు దాదాపు ఒకటిన్నర కిలోమీటరు నడిచి వెళ్లాను. నడిచినంత సేపూ భయం, నేను ఒంటరిగా ఉండడంతో ఎవరైనా ఫాలో అవుతారేమోననే బెరుకుతో పది అడుగులకోసారి వెనక్కి చూసుకున్నాను. నేను భయపడినట్లు ఎవరూ ఫాలో కాలేదు. అక్కడ సిస్టమ్‌ చాలా సెక్యూర్డ్‌గా ఉంది. ఇండియాలో కూడా అంత ధైర్యంగా ఒంటరిగా తిరగలేమేమో అనిపించింది. 

రెండు గంటల ఆలస్యం... అంతే!
ఒకరోజు స్విమ్మింగ్‌ చాంపియన్‌ షిప్‌ ఓపెనింగ్‌ సెరిమనీ పూర్తయిన తర్వాత మెట్రో రైల్లో ఇంటికి రావాలి. ఆ రోజు అక్కడ పబ్లిక్‌ హాలిడే అనుకుంటాను. ఆ రష్‌ చూస్తే జనం అంతా రోడ్లమీదనే ఉన్నారా అనిపించింది. ఆ రష్‌లో రైలు ఎక్కలేక కొంచెం ఖాళీగా ఉన్న రైలు కోసం ఎదురుచూస్తూ ఉండిపోయాను. తీరా మా ఫ్రెండ్స్‌ ఇంటికి చేరేసరికి రెండు గంటలు ఆలస్యం అయింది. ఈ లోపు నేనింకా ఇంటికి రాలేదని మా ఫ్రెండ్స్‌ పోలీస్‌ కంప్లయింట్‌ ఇవ్వడం, పోలీసులు వచ్చి ఆ ఇంట్లో నా గది, బ్యాగ్‌ తనిఖీ చేయడం జరిగిపోయాయి. ఆ తర్వాత కూడా నేను ఇల్లు చేరినట్లు నిర్ధారణ అయ్యే వరకు ఫోన్‌లో ఫాలో అప్‌ చేశారు. ట్రైన్‌ రష్‌ కారణంగా ఆలస్యం అవుతోందని ఇంట్లో వాళ్లకు తెలియచేయడానికి నా దగ్గర ఫోన్‌ లేదు. కెనడా సిమ్‌ అప్పటికింకా రాకపోవడంతో నా దగ్గర మొబైల్‌ ఫోన్‌ లేకపోయింది. ఆ మరుసటి రోజు ఫ్రెండ్స్‌ వాళ్ల సిమ్‌ ఒకటి ఇవ్వడంతో ఒక సమస్య తీరింది.

నయాగరా వీక్షణం
మాంట్రియెల్‌ నుంచి టొరంటోలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లాను. అదొక అనుభవం. మాంట్రియెల్‌లో ఫ్రెండ్స్‌ ఇచ్చిన మొబైల్‌ సిమ్‌ వాళ్లకు ఇచ్చేసి టొరంటోకెళ్లాను. అక్కడ దిగగానే పబ్లిక్‌ ఫోన్‌ నుంచి బంధువులకు ఫోన్‌ చేసి నగరంలో దిగినట్లు చెప్పి, నయాగరా వాటర్‌ ఫాల్స్‌ చూసుకుని సాయంత్రానికి ఇంటికి వస్తానని సమాచారం ఇచ్చాను. నయాగరా నుంచి మా బంధువులుండే ఏరియా వరకు బస్‌లో వచ్చేశాను. పబ్లిక్‌ బూత్‌ నుంచి ఫోన్‌ చేశాను. వాళ్లు ఫోన్‌ తీయలేదు. ఏం చేయాలో తోచలేదు. దగ్గరలో ఒక కల్చరల్‌ ప్రోగ్రామ్‌ జరుగుతుంటే చూస్తూ ఓ గంట సేపు గడిపాను. మళ్లీ ఫోన్‌ చేసినప్పుడు వాళ్లు ఫోన్‌ తీశారు. ఇంటికి అడ్రస్, డైరెక్షన్‌ చెప్పారు. టొరంటో తర్వాత మా అన్న కూతురు ఉండే కాల్‌గరీలో పదిహేను రోజులున్నాను. కాల్‌గరీ గ్లేసియర్‌లు, లేక్‌లకు ప్రసిద్ధి. బాగా ఎంజాయ్‌ చేశాను. తిరిగి మాంట్రెయల్‌కు వచ్చి ఇండియాకి వచ్చే విమానం ఎక్కాను. నెలరోజుల కెనడా ట్రిప్‌ అలా జరిగింది. నేను చెప్పేదొక్కటే భయపడితే సాధించేదేమీ ఉండదు. ధైర్యం ఉంటే వయసు కూడా అడ్డంకి కాదు. సోలో ట్రిప్‌కెళ్లినప్పుడు నా వయసు 54.        

టూర్‌ బస్సులో తొమ్మిది దేశాలు
ఒక రోజు టూరిస్టు బస్‌లో క్యూబెక్‌ సిటీ టూర్‌కెళ్లాను. మాంట్రియెల్‌లో పికప్‌ చేసుకుని టూర్‌ పూర్తయ్యాక మాంట్రియెల్‌లో దించింది. అప్పుడు ఆ బస్సులో ప్రయాణించింది పదిహేను మందిమి మాత్రమే. వాళ్లలో తొమ్మిది దేశాల వాళ్లం కలిసి ప్రయాణించాం.

మరిన్ని వార్తలు