నాన్నా బాగా చదువుకో: పరీక్షలు రాస్తున్న ఎమ్మెల్యే!

6 Mar, 2021 08:39 IST|Sakshi

సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు విద్యాబుద్దులు చెప్పించే క్రమంలో మంచిగా చదవమని ప్రోత్సహిస్తుంటారు. కానీ రాజస్థాన్‌లోని ఓ బీజేపీ ఎంఎల్‌ఏను అతని కుమార్తెలు ‘నాన్నా బాగా చదువుకో’ అని చెబుతున్నారు. ఏడో తరగతిలో చదువు ఆపేసిన తండ్రితో బి.ఏ డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు కూడా రాయిస్తున్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ రూరల్‌ ఎంఎల్‌ఏ అయిన ఫూల్‌ సింగ్‌ మీనా చిన్నతనంలో ఉండగా ఆర్మీలో పనిచేస్తోన్న తన తండ్రి మరణించాడు. దీంతో కుటుంబ భారం అతని మీద పడడంతో  చదువును మధ్యలో ఆపేసి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్నీ పోషిస్తూ పెరిగాడు.

కనీసం స్కూలు విద్యాభ్యాసం కూడా పూర్తిచేయని ఫూల్‌ సింగ్‌ తన తెలివితేటలతో ఎంఎల్‌ఏగా ఎదిగారు. అంతేగాకుండా తన ఐదుగురు కుమార్తెలను ఉన్నత చదువులు చదివించారు. నలుగురు కుమార్తెలు పీజీ చేయగా, చిన్న కూతురు ప్రస్తుతం లా డిగ్రీ చేస్తోంది. 2013లో ఫూల్‌ సింగ్‌ మొదటిసారి ఎంఎల్‌ఏగా ఎన్నికైనప్పుడు... రకరకాల కారణాలతో ఆగిపోయిన తన చదువు ను ఇప్పుడు కొనసాగించండి నాన్నా! అని చెప్పారనీ, అదే ఏడాది 10వ తరగతిలో జాయిన్‌ చేసి, రోజూ వాళ్లు చదువుకున్న తరువాత తనకు చదువు చెప్పేవారని ఫూల్‌సింగ్‌ చెప్పారు.

‘‘అలా చదువుతూ ఇంటర్మీడియట్‌ పూర్తి చేశాను. ప్రస్తుతం కోటా ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా బి.ఏ ఫైనల్‌ ఇయర్‌ పరీక్షలు రాస్తున్నాను. భవిష్యత్‌లో పోస్టుగ్రాడ్యుయేషన్‌ చేసి తరువాత పీహెచ్‌డీ కూడా చేస్తాననీ’’ ఆయన చెప్పారు. ఫూల్‌ సింగ్‌ తాను చదువుకోవడమేగాక తన నియోజక వర్గంలోని ప్రతిభ కలిగిన విద్యార్థినులను ప్రోత్సహిస్తున్నారు. అకడమిక్స్‌లో మంచి ప్రతిభ కనబరిచిన అమ్మాయిలను రాజస్థాన్‌ అసెంబ్లీ సందర్శన, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇతర ఉన్నతాధికారులను కలవడానికి విమానంలో పంపిస్తున్నారు. ఇందుకయ్యే ఖర్చు మొత్తం ఆయనే భరిస్తూ.. ఇప్పటి దాకా 50మంది అమ్మాయిలను అసెంబ్లీ సందర్శనకు పంపించారు.  

చదవండి: కేరళ సీఎం విజయన్‌కు తలబొప్పి

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు