Ratan Chauhan: అబ్బాయి గెటప్‌లో పాపులర్‌.. తనకిష్టమైన స్టైలే ఆర్థికంగా నిలబెట్టింది!

30 Jun, 2022 10:06 IST|Sakshi

పుత్రికా రతన్‌

పుట్టుకతో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని ఎదుగుతారు చాలామంది. కొంతమంది మాత్రం జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు అవకాశాలు ఏవీలేనప్పటికీ.. తమలోని ప్రతిభానైపుణ్యాలతో వారంతటవారే అవకాశాలను సృష్టించుకుని నలుగురిలో ప్రత్యేకంగా కనిపిస్తారు. ఈ కోవకు చెందిన అమ్మాయే రతన్‌ చౌహాన్‌.

అమ్మాయిగా పుట్టినప్పటికీ, అబ్బాయిలా పెరిగింది.  అబ్బాయి గెటప్‌లో సోషల్‌ మీడియాలో బాగా పాపులర్‌ అయ్యింది. ఇంటి బాధ్యతలను చేపట్టి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది రతన్‌. 

రాజస్థాన్‌కు చెందిన 22 ఏళ్ల రతన్‌ చౌహాన్‌ ఝుంఝనులోని మాండ్వా గ్రామంలో ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది. రతన్‌ అమ్మకడుపులో ఉండగానే తల్లిదండ్రులు అమ్మాయి లేదా అబ్బాయి ఎవరు పుట్టినా పేరు ‘నవరతన్‌’ అని పెట్టాలనుకున్నారు.

రతన్‌ పుట్టిన తరువాత కూడా అదే పేరు కొనసాగించారు. స్కూలుకెళ్లాక అమ్మాయికి ఈ పేరు నప్పదని చెప్పి టీచర్‌ రతన్‌గా మార్చింది. చిన్నప్పటి నుంచి ఎంతో చురుకుగా ఉండే రతన్‌కు అమ్మాయిలంతా ఎంతో ఇష్టపడే పొడవైన జడ ఉండేది. కానీ ఆమెకు మాత్రం అబ్బాయిల్లా చిన్న జుట్టునే ఇష్టపడేది. ఇంట్లో జుట్టు కత్తిరించుకుంటానని అడిగితే ఒప్పుకునేవారు కాదు.

చివరికి ఇంటర్మీడియట్‌లో ధైర్యం చేసి జుట్టు కత్తిరించేసింది. అబ్బాయిల హెయిర్‌స్టైల్, చేతులు, మెడమీద టాటూలతో అబ్బాయిల్లా డ్రెస్‌లు వేసుకోవడం ప్రారంభించింది. నడకను, ఆహార్యాన్ని పూర్తిగా మగపిల్లాడిలా మార్చేసింది.

నాన్నకు ఇష్టం లేకపోయినప్పటికీ..
అబ్బాయిలా హావభావాలు, ఆహార్యంతో స్టైల్‌గా ఉంటూనే జైపూర్‌లో బీకామ్‌ పూర్తిచేసింది రతన్‌. బ్యాంక్‌ ఉద్యోగం చేయాలని ఆమె తండ్రి కోరుకునేవారు. కానీ రతన్‌కు సింగింగ్, డ్యాన్సింగ్‌ అంటే చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టం. స్కూలు, కాలేజీలలో ప్రతి కార్యక్రమంలో ఎంతో యాక్టివ్‌గా పాల్గొనేది. ఈ అలవాటుతోనే సింగింగ్, డ్యాన్సింగ్‌ వీడియోలను రూపొందించేది.

నాన్నకు ఇష్టం లేదని తెలిసినా పట్టించుకోకుండా వీడియోలు తీసేది. టిక్‌టాక్‌ ఉన్న సమయంలో రతన్‌ తన వీడియోలను పోస్టు చేసేది. వ్యూవర్స్‌ నుంచి మంచి స్పందన వుండడంతో సొంతంగా పాటలు, మాటలు రాసుకుని వీడియోలు రూపొందించి యూట్యూబ్‌లో పెట్టేది. ఇలా పెడుతూ ఒకసారి పోస్టుచేసిన వీడియో షేర్‌లో ఆల్బమ్‌లోని మహ్రో రాజస్థాన్‌ పాటకు ఆరులక్షమందికి పైగా వ్యూస్‌ వచ్చాయి. దాంతో రతన్‌ బాగా పాపులర్‌ అయ్యింది.

టిక్‌టాక్‌ ఉన్నంత కాలంలో టిక్‌టాక్‌స్టార్‌గా ఓ వెలుగు వెలిగింది. టిక్‌టాక్‌ను ఇండియాలో నిషేధించాక, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌లలో తన వీడియోలు పోస్ట్‌ చేస్తూ లక్షలమంది అభిమానులు, మంచి ఆదాయంతో రాణించేది.  

ఒకపక్క కరోనా.. మరోపక్క నాన్న 
అంతా సాఫీగా సాగిపోతున్న సమయంలో కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ రతన్‌ జీవితాన్ని కుదుపునకు గురిచేసింది. అప్పటిదాకా వీడియోలు పోస్టుచేస్తూ అంతో యింతో ఆదాయం ఆర్జిస్తోన్న రతన్‌కి... లాక్‌డౌన్‌తో వీడియోలు రూపొందించడం కుదరక ఆదాయం కాస్తా అడుగంటిపోయింది. దీనికితోడు తండ్రి ఆరోగ్యం బాగా పాడవడంతో ఏడాదిపాటు ఆక్సిజన్‌ సిలిండర్‌ మీదే ఉండాల్సిన పరిస్థితి.

దీంతో కుటుంబ పోషణకు ఆదాయం వచ్చే మార్గాలన్నీ మూసుకుపోయాయి. తండ్రికి మందులు, ఆక్సిజన్‌ సిలిండర్‌ ఎలా కొనాలో తెలియలేదు. అప్పుడే రతన్‌ మనసులో ‘కర్ని ఫ్యాషన్‌’ ఆలోచన వచ్చింది. రతన్‌ ఏ డ్రెస్‌ వేసుకున్నా ‘‘నీ డ్రెస్, డ్రెస్సింగ్‌ స్టైల్‌ బావుందని అంతా పొగిడేవారు. ఈ డ్రెస్‌ ఎక్కడ కొన్నావు’’ అని అడిగేవారు.

ఆ విషయం గుర్తుకొచ్చి తను వాడే జైపూర్‌ ప్రింట్స్‌ షర్ట్స్‌ను విక్రయించాలనుకుంది. ఈ క్రమంలోనే కర్నిఫ్యాషన్‌ స్టార్టప్‌ను ప్రారంభించింది. జైపూర్‌లో ఓ షాపు పెట్టి తను వేసుకునే జైపూర్‌ ప్రింట్‌ షర్ట్స్‌ను విక్రయించి కుటుంబాన్ని పోషిస్తోంది. 

తనకిష్టమైన స్టైలే ఈ రోజు రతన్‌ జీవితంతోపాటు, కుటుంబాన్నీ ఆర్థికంగా నిలబెట్టింది. అందుకే ఎవరెన్ని చెప్పినా మనమీద మనకు నమ్మకం ఉన్నప్పుడు అనుకున్న పనిని మనసుపెట్టి వందశాతం కష్టపడి చేస్తే విజయం సాధించవచ్చని రతన్‌ జీవితమే ఉదాహరణగా నిలుస్తోంది. 

చదవండి: Hoovu Fresh: విరులై.. కురిసిన సిరులు.. 10 లక్షల పెట్టుబడితో ఆరంభం.. కోట్లలో లాభాలు!

మరిన్ని వార్తలు