Shivani Sisodia: ఈ శివానీ శివంగి!

19 Apr, 2021 00:36 IST|Sakshi
శివానీ సిసోడియా

సమస్యలు ఎదురైనప్పుడు పారిపోయేవారు కొందరైతే.. సమస్య మూలాలను కనుక్కొని దానిని కూకటివేళ్లతో సహా పెకలించేసేవారు మరికొందరు. ఈ కోవకు చెందిన అమ్మాయే 18 ఏళ్ల శివానీ సిసోడియా. రాజస్థాన్‌కు చెందిన శివానీ జీవితంలో ఎదురైన ఓ సంఘటన తన ఆలోచనా విధానాన్ని మార్చడంతో సెల్ఫ్‌ డిఫెన్స్‌ తను నేర్చుకుని, వందలమంది అమ్మాయిలకు శిక్షణనిస్తూ ధైర్యవంతులుగా తీర్చిదిద్దుతోంది.

దీని వెనకాల ఒక కథ ఉంది. శివానీ పదోతరగతిలో ఉన్నప్పుడు.. ఒకరోజు స్కూలు అయిపోయిన తరువాత తన స్నేహితురాలితో కలిసి నడుచుకుంటూ ఇంటికి వెళ్తోంది. ఆ సమయం లో అటుగా వెళ్తున్న కొందరు పోకిరీలు శివానీ వాళ్లను అసభ్యంగా కామెంట్‌ చేస్తూ.. ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టారు. ఆ సమయంలో ఏం చేయాలో వాళ్లకు అర్థం కాలేదు. దాంతో వారినుంచి ఎలాగో తప్పించుకుని అక్కడినుంచి పారిపోయారు. మరుసటిరోజు స్కూలుకు వెళ్లిన శివానీ ముందురోజు జరిగిన విషయాన్ని తన స్నేహితులతో పంచుకోగా... వాళ్లు తాము కూడా అటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నట్లు చెప్పడంతో శివానీకి ఆశ్చర్యమేసింది.

‘ఎందుకు మీరు వాళ్లను ఎదుర్కోలేదు’ అని స్నేహితులను ప్రశ్నించింది. అప్పుడు వాళ్లు ‘ఏమో ఆ సమయంలో ఏం చేయాలో తట్టలేదు, వాళ్లను ఎలా ఎదుర్కోవాలో తెలియలేదు’ అని చెప్పారు. అప్పుడే నిర్ణయించుకుంది శివానీ... నేను మాత్రం ఇంకోసారి ఇటువంటి సందర్భాలు ఎదురైనప్పుడు అస్సలు భయపడకూడదు అని.  ఇందుకోసం ఆమె తన మనసును, శరీరాన్ని దృఢం చేసుకోవాలనుకుంది. ఈ క్రమంలోనే తన తల్లిదండ్రులు, స్కూలు టీచర్, యోగా టీచర్ల సాయంతో ఆత్మరక్షణ విద్యలలో శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టింది.

తరువాత రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లోని రాజస్థాన్‌ కరాటియన్స్‌ స్కూల్లో చేరింది. ఏ పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ఎదుర్కొనేందుకు శ్రద్ధతో సెల్ఫ్‌ డిఫెన్స్‌ నేర్చుకుంది. తనలా అమ్మాయిలందర్ని తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో శివానీ తన కోచ్‌ ఓంకార్‌తో కలిసి ఆడపిల్లల కోసం ఆత్మరక్షణపై ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అలా రెండేళ్లలో.. స్కూళ్లు, కాలేజీకెళ్లే 1500 మందికి పైగా విద్యార్థినులకు శివానీ శిక్షణ నిచ్చింది.

 ‘‘మా కరాటే స్కూల్లో సెల్ఫ్‌ డిఫెన్స్‌ శిక్షణ తీసుకుంటున్న అమ్మాయిలందరిలోకి, శివానీ చాలా చురుకైనది. ఆత్మరక్షణ మెళకువలను సులువుగా నేర్చుకుంది. జాతీయస్థాయి కుస్తీపోటీలలో రజత పతకం కూడా గెలుచుకుంది. శివానీ సెల్ఫ్‌ డిఫెన్స్‌ నేర్పించే పద్ధతి చాలా విలక్షణంగా ఉంటుంది’’ అని శివానీ ట్రైనర్‌ ఓంకార్‌ పంచోలి చెప్పారు.

శివానీ మాట్లాడుతూ..‘‘నాకు అద్భుతమైన ట్రైనర్‌ దొరకడంతో ఆత్మరక్షణ విద్యలను ఎంతో బాగా నేర్చుకున్నాను. నేటి తరం అమ్మాయిలకు తమని తాము కాపాడుకోగల శక్తి సామర్థ్యాలు తప్పనిసరిగా ఉండాలి. అందుకే నేను నేర్చుకోవడమేగాక ఎంతోమందికి నేర్పిస్తున్నాను. ఎవరైనా ఆకతాయులు దాడిచేసినప్పుడు వారి నుంచి తప్పించుకోవడమేగాక వారిపై ఎదురు దాడికి ఎలా దిగాలో నేర్పిస్తుండడం వల్ల వాళ్లు ఎంతో కాన్ఫిడెంట్‌ గా తమ ఇళ్లకు ఒంటరిగా వెళ్లగలుగుతున్నారు’’ అని చెప్పింది.

శివానీకి ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. వాళ్లలో ఒకరు జూడో ఛాంపియన్, మరొకరు తైక్వాండోలో బ్లాక్‌బెల్ట్‌ హోల్డర్‌.

మరిన్ని వార్తలు