ఎడారిలో పచ్చదనం

25 Jun, 2021 00:06 IST|Sakshi
నిషా పాఠక్‌ – మైక్రోగ్రీన్‌ ఫార్మింగ్‌

కరోనా ప్రపంచాన్ని నాలుగ్గోడలకు పరిమితం చేసింది. చదువు, ఆట, పాట అన్నీ ఆ గోడల మధ్యనే. కంప్యూటర్‌ స్క్రీన్‌ మీద పాఠాలు నేర్చుకోవడంతో సరిపెట్టడం కాదు. ఇంకేదో చేయాలి. ఏదైనా చేయడానికి కావల్సినంత ఖాళీ సమయం కూడా ఇదే అనుకుంది పదిహేడేళ్ల నిషా పాఠక్‌.

పాఠక్‌ ఏం చేసిందంటే...
నిషా పాఠక్‌ది రాజస్థాన్‌ రాష్ట్రం, జైపూర్‌నగరం, ప్లస్‌టూ చదువుతోంది. ఆన్‌లైన్‌ క్లాసుల తర్వాత మిగిలిన సమయం మొత్తం చెట్ల మధ్య గడపడం అలవాటు చేసుకుంది. టొమాటో, ఉల్లిపాయ, బంగాళదుంప పండించి ఇంటి దగ్గరలో నివసించే పేదవాళ్లకు పంచింది. ఆ తర్వాత వాళ్లకు కూడా పండించడం నేర్పించింది. వాళ్ల కోసం ఇంటి ఆవరణలో ఉచితంగా వర్క్‌షాపు నిర్వహిస్తోంది. ఎక్కువ ఖర్చు లేకుండా వారం– పది రోజుల్లో పంటకొచ్చే పాలకూర, మెంతికూర, ఆవ ఆకు వంటివి పండించడంలో శిక్షణనిస్తోంది. ఎండాకాలంలో జైపూర్‌ నేలలో పండించడానికి సాధ్యంకాని ఆకు కూరలను ఆమె పాలప్యాకెట్‌లలో తక్కువ నీటితో పండిస్తోంది. ఆమె ప్రయత్నం సక్సెస్‌ అయింది.

ఇలా పెంచుతోంది!

పాలపాకెట్‌ను శుభ్రం చేసి ఆరబెట్టి, అడుగున చిన్న రంధ్రాలు ముప్పావు వంతు ప్యాకెట్‌ను ఆర్గానిక్‌ పాట్‌ మిక్చర్‌ (సేంద్రియ ఎరువుతో కూడిన మట్టి)తో నింపుతోంది. మెంతులు, ఆవాలను రాత్రంతా నానబెట్టి ఒక్కో ప్యాకెట్‌లో ఒక టీ స్పూన్‌ గింజలను పలుచగా చల్లుతోంది. గింజల మీద గుప్పెడు మట్టిని ఒక పొరలాగ పరిచి నీటిని  చిలకరిస్తోంది. వారం రోజులకు ఆకు కూరలు కోతకు వస్తాయి. పై పొర మట్టిని తొలగించి మళ్లీ గింజలను చల్లుకోవడమే. తాజా ఆకుకూరల రుచి ఎరుగని ఎడారి ప్రాంతంలో నిషా పాఠక్‌ అనుసరించిన మైక్రోగ్రీన్‌ ఫార్మింగ్‌కి అభిమానులు, అనుచరులు పెరిగిపోతున్నారు. ఆమె పేదవాళ్ల కోసం నిర్వహిస్తున్న వర్క్‌షాప్‌ను బంధువులు, స్నేహితులు ఆన్‌లైన్‌లో ఫాలో అవుతున్నారు.
 

మరిన్ని వార్తలు