రాజుగారి  మూడు ప్రశ్నలు 

27 Mar, 2022 14:46 IST|Sakshi

పూర్వకాలంలో విజయపురి అనే రాజ్యాన్ని విక్రమసింహుడు అనే రాజు పరిపాలించేవాడు. అతడు మంచివాడే కానీ అహంకారం మెండు.  సభలో ఎప్పుడూ గొప్పలు చెప్పుకునే వాడు. రాజుగారి ధోరణి మంత్రి కట్టప్పకి నచ్చేది కాదు. ఎలాగైనా రాజులోని ఆ చెడు లక్షణాన్ని దూరం చేయాలనుకున్నాడు మంత్రి. ఒకరోజు ఆస్థానంలో సభ జరుగుతుండగా మళ్ళీ రాజుగారు సొంత డబ్బా కొట్టుకోవడం మొదలుపెట్టాడు. వెంటనే మంత్రి ‘మహా ప్రభూ..! మీ తెలివితేటల గురించి సభలోని వాళ్లందరికీ బాగా తెలుసు. కానీ మన రాజ్యం పొలిమేరలో ఉన్న అవంతిపురంలో అందరూ తెలివైన వారేనని ఒక ప్రచారం ఉంది. వారి ముందు మీ తెలివితేటలను ప్రదర్శిస్తే మీ ప్రతిభ  పొరుగు రాజ్యాలకు కూడా విస్తరిస్తుంది’ అని సూచించాడు. సరేనంటూ మరునాడే మారువేషంలో మంత్రిని వెంటబెట్టుకొని అవంతిపురం బయల్దేరాడు రాజు. ఆ ఊరు చేరగానే ఒక పశువులకాపరి కనిపించాడు. తన తెలివితో ముందుగా అతడిని ఓడించాలని అనుకున్నాడు రాజు.

వెంటనే అతని దగ్గరికి వెళ్లి ‘నేను మూడు ప్రశ్నలు అడుగుతాను జవాబులు చెబుతావా?’ అన్నాడు. వెంటనే ఆ పశువుల కాపరి సరే అన్నట్టు తలూపాడు. మొదటి ప్రశ్నగా ‘సృష్టిలో అన్నింటికన్నా వేగవంతమైనది ఏది?’ అని అడిగాడు. ‘గాలి’ అంటూ సమాధానం వచ్చింది. ‘పవిత్రమైన జలము ఏది?’ అని ప్రశ్నించాడు. ‘గంగా జలం’ అని టక్కున సమాధానం చెప్పాడు. ముచ్చటగా మూడో ప్రశ్న... ‘అన్నింటికన్నా ఉత్తమమైన పాన్పు ఏది?’ అనగానే ‘మంచి చందనంతో చేసిన పాన్పు’ అని పశువులకాపరి జవాబిచ్చాడు. ‘బాగా చెప్పావు.. సరిగ్గా నా మదిలో కూడా అవే జవాబులు ఉన్నాయి’ అన్నాడు రాజు. అప్పుడు ఆ పశువుల కాపరి విరగబడి నవ్వడంతో రాజుకు కోపం వచ్చింది.

రాజు పట్టరాని కోపంతో ‘ఎందుకు ఆ నవ్వు?’ అంటూ విరుచుకుపడ్డాడు. ‘నేను చెప్పిన తప్పుడు సమాధానాలన్నీ మీరు ఒప్పు అని అంటుంటే మరి నవ్వక ఏం చేయాలి?’  అని మొహం మీదే అనేశాడు పశువులకాపరి. అయితే సరైన సమాధానం ఏమిటో చెప్పమని గర్జించాడు విక్రమసింహుడు. ‘సృష్టిలో అన్నింటికన్నా వేగమైంది మనసు, విలువైన జలం ఎడారిలో దొరికే జలం, ఉత్తమమైన పాన్పు అమ్మ ఒడి’ అని పశువులకాపరి బదులిచ్చాడు. తన తెలివి తక్కువ తనానికి సిగ్గుపడుతూ ఊళ్లోకి వెళ్లకుండానే వెనుదిరిగాడు రాజు. అప్పటి నుంచి తన అహంకారాన్ని వదిలి రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తూ అందరితో కలిసిమెలిసి ఉండసాగాడు.
 

మరిన్ని వార్తలు