నీ అనురాగం... ఎన్నో జన్మల పుణ్యఫలం

22 Aug, 2021 00:44 IST|Sakshi
‘రక్తసంబంధం’లో ఎన్‌టిఆర్, సావిత్రి

‘ఓ అన్నా... నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం’... ఈ పాట ప్రతి రాఖీ పండక్కీ వినిపిస్తుంది. ఇళ్లల్లో అన్నదమ్ములకు జరక్కపోయినా చెల్లెళ్లకు ముద్దు మురిపాలు జరుగుతాయి. తండ్రో లేకుంటే అన్నయ్యలో ఆమెను భుజాల మీదకు ఎక్కించుకుని ఆడిస్తారు. తల్లి కోపగించాలని చూసినా గారం చేసి వెనకేసుకు వస్తారు. తండ్రి, అన్నదమ్ముల ప్రేమ పొందిన చెల్లెలు తన జీవితంలో భర్తగా వచ్చే పురుషుడి నుంచి కూడా అలాంటి ప్రేమనే ఆశిస్తుంది.

అక్కడ ఏదైనా లోటు జరిగితే అన్నదమ్ముల తోడ ఆ లోటును పూడ్చుకుందామని చూసుకుంటుంది. ఒకప్పటి కాలంలో ఆమె పురుషుల మీద ఆధారపడే స్త్రీ అయినా నేడు ఆర్థికంగా, వ్యక్తిత్వపరంగా స్వతంత్రతను, ఉనికిని చాటుతున్నా అన్నాచెల్లెళ్ల మధ్య ఉండే అనురాగంలో ఎటువంటి మార్పూ ఉండదు. ఉండబోదు. వారు కలిసి పెరిగారు. కలసి బాల్యం పంచుకున్నారు. వారు ఒకరికొకరు తెలిసినట్టుగా మరొకరికి తెలియరు. అందుకే ఆపద వస్తే చెల్లెలు ‘అన్నా’ అంటుంది. అన్న ఉలికిపాటుకు గురైతే చెల్లెలు హాజరవుతుంది. మేనమామ, మేనత్తలుగా ఈ అన్నాచెల్లెళ్లు పిల్లలకు ప్రియ బంధువులవుతారు. అపురూపమైన మానవ బంధాల నిర్మాణం ఇది.

చందురుని మించు అందమొలికించు
ఎన్టీఆర్, సావిత్రి అన్నాచెల్లెళ్లా అని జనం అనుకున్నారుగాని వారిద్దరూ ‘రక్తసంబంధం’లో అన్నాచెల్లెళ్లుగా చిరకాలం గుర్తుండిపోయే నటనను ప్రదర్శించారు. ఆ అన్నకు చెల్లెలి కోసం సర్వస్వం వదులుకునేంత ప్రేమ. ఆ చెల్లెలికి ఆ అన్న కోసం ప్రాణమే ఇచ్చే పాశం. అబ్బ... ఆ అవినాభావ బంధం చాలా ఉద్వేగపూరితమైనది. ఇదే ఎన్‌.టి.ఆర్‌ ‘చిట్టిచెల్లెలు’లో వాణిశ్రీ కోసం ఏడ్చి ఏడ్చి మనకు ఏడుపు తెప్పిస్తాడు. ‘అందాల పసిపాప అన్నయ్యకు కనుపాప’.. అన్నాచెల్లెళ్ల పాటల్లో కంటిపాప వంటి పాట.

అక్కినేని ‘బంగారు గాజులు’లో విజయనిర్మలతో ఈ అనుబంధాన్ని గొప్పగా పండించాడు. ‘అన్నయ్య సన్నిధి... అదే నాకు పెన్నిధి’ పాటలో అన్నగా ఆయనను చూడాలి. శోభన్‌బాబు ‘చెల్లెలి కాపురం’ సినిమా చెల్లెలి సెంటిమెంట్‌ వల్లే హిట్‌. ఆయన నటించిన ‘శారద’ సినిమాలో శారదకు అన్నయ్యగా  కైకాల సత్యనారాయణ నటించి విలన్‌ నుంచి పూర్తి స్థాయి కేరెక్టర్‌ ఆర్టిస్టుగా మారాడు. ‘కానిస్టేబుల్‌ కూతురు’లో జగ్గయ్య, కృష్ణకుమారి అన్నాచెల్లెళ్లుగా నటించారు. చెల్లెల్ని ఆట పట్టిస్తూ జగ్గయ్య పి.బి.శ్రీనివాస్‌ గొంతుతో పాడే ‘చిగురాకుల ఊయలలో ఇల మరచిన ఓ చిలుకా’ చాలా బాగుంటుంది.

పగ–ప్రతీకారాల దశాబ్దం
1980లు వచ్చే సరికి తెలుగు సినిమాలో చెల్లెలి పాత్ర పరమ స్టీరియోటైప్‌గా మారింది. హీరోకు చెల్లెలు ఉంటే చాలు ఆమె విలన్‌ బాధలకు బలి అవనున్నదని ప్రేక్షకులకు తెలిసిపోయేది. ఈ పిచ్చి సినిమాల మధ్య కూడా ‘చట్టానికి కళ్లులేవు’లాంటి చిత్రాలు వచ్చాయి. ఇందులో అక్కగా లక్ష్మి, తమ్ముడిగా చిరంజీవి ఘర్షణతో కూడిన బంధంలో కనిపిస్తారు. ఎన్‌.టి.ఆర్‌ ‘డ్రైవర్‌ రాముడు’లో అంధురాలైన తన చెల్లి రోజా రమణితో ‘ఏమని వర్ణించను’ పాట పాడతాడు.

తమిళం నుంచి బాపు రీమేక్‌ చేసిన ‘సీతమ్మ పెళ్లి’లో మోహన్‌బాబు బహుశా తన గొప్ప పెర్ఫార్మెన్స్‌లలో ఒకటిగా నటించాడు. ఇందులోనే ‘తల్లివైనా చెల్లివైనా’ పాట ఉంది. కొంచెం కాలం ముందుకు నడిస్తే చిరంజీవి తన ‘లంకేశ్వరుడు’లో చెల్లెలి సెంటిమెంట్‌ను చూపడానికి ప్రయత్నించాడు. ఆ సినిమా పని చేయకపోయినా నలుగురు చెల్లెళ్లతో ఆ తర్వాత నటించిన ‘హిట్లర్‌’ సెకండ్‌ ఇన్నింగ్స్‌ను చాన్స్‌ ఇచ్చింది. బాలకృష్ణ ‘ముద్దుల మావయ్య’ సినిమాలో ‘మావయ్య అన్న పిలుపు’ పాట పాడి పెద్ద ఎత్తున హిట్‌ కొట్టాడు. కృష్ణంరాజు, రాధిక అన్నాచెల్లెళ్లుగా నటించిన ‘పల్నాటి పౌరుషం’ గట్టి కథాంశమే అయినా అంతగా ఆడలేదు. పూర్ణిమ, శివకృష్ణలతో వచ్చిన పరుచూరి రచన ‘ఆడపడుచు’ పెద్ద హిట్‌ అయ్యింది.

నీ పాదం మీద పుట్టుమచ్చనై...
ఆ సమయంలోనే గద్దర్‌ రాసిన ‘మల్లెతీగకు పందిరివోలే’ పాట ‘ఒరేయ్‌ రిక్షా’ సూపర్‌హిట్‌ కావడానికి ముఖ్యకారణంగా మారింది. 1995లో వచ్చిన ఈ సినిమా ‘నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా... తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా’ అనే గొప్ప లైన్‌ను ఇచ్చింది. అయితే ఈ సమయంలోనే వచ్చిన ‘తొలిప్రేమ’ సినిమా చెల్లెలి పాత్రను చాలా కొత్తగా చూపించింది. ఇందులో పవన్‌కల్యాణ్, వాసుకి మధ్య సన్నివేశాలు గొప్పగా పండాయి.

2000 సంవత్సరం తర్వాత
కాలం మారినా చెల్లెలి బంధం మారదు. సినిమాలూ ఆ కథను ఎంచుకోక మానలేదు. ‘పుట్టింటికిరా చెల్లి’ వంటి పాతవాసన వేసే టైటిల్‌ పెట్టి సినిమా తీస్తే సూపర్‌డూపర్‌ హిట్‌ అయ్యింది. అర్జున్, స్వప్నమాధురి అద్భుతంగా నటించారు. మహేశ్‌బాబు ‘అర్జున్‌’లో అక్క కీర్తి రెడ్డిని కాపాడుకునే తమ్ముడిగా గొప్పగా నటించాడు. పవన్‌ కల్యాణ్‌ ‘అన్నవరం’ చెల్లెలి రక్షణకు వేట కొడవలి పట్టిన అన్నను చూపిస్తుంది. కృష్ణవంశీ ‘రాఖీ’ అనే టైటిల్‌ పెట్టి మరీ ప్రతి మగవాడు స్త్రీలను సోదరుడిలా చూసుకోవాలనే సందేశంతో హిట్‌ కొట్టాడు. జూనియర్‌ ఎన్‌.టి.ఆర్‌కు ఆ సమయంలో అవసరమైన హిట్‌ అది. ఇక రాజశేఖర్, మీరా జాస్మిన్‌ నటించిన ‘గోరింటాకు’ గొప్ప కరుణరసం పండించి అన్నాచెల్లెళ్ల బంధానికి తిరుగులేదని నిరూపించింది.

అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లు పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకునే ఈ రాఖీ పండగ నాడు ఆ సెంటిమెంట్‌ను పండిస్తూ తీసిన, నటించిన తెలుగు సినిమా వారికి కూడా శుభాకాంక్షలు చెబుదాం.

చెల్లెలి క్షేమం కోరుకోని అన్న అన్న శ్రేయస్సు కాంక్షించని చెల్లెలు ఉండరు. తల్లిదండ్రులు ఉన్నా గతించినా తల్లి అంశ చెల్లిలో తండ్రి అంశ అన్నలో చూసుకుంటారు పరస్పరం అన్నాచెల్లెళ్లు.  అది రక్తసంబంధం. యుగాలుగా ఏర్పడింది. యుగాంతం వరకూ ఉంటుంది. అన్నాచెల్లెళ్ల మధ్య ఉండే భావోద్వేగాలు ఎన్నో సినిమా కథలయ్యాయి. పాటలయ్యాయి. అవుతూనే ఉంటాయి. రాఖీ సందర్భంగా కొన్నింటిని గుర్తు చేసే ప్రయత్నం ఇది.

మరిన్ని వార్తలు