ప్రధానికి.. బృందావన్‌ రాఖీ!

22 Aug, 2021 01:11 IST|Sakshi

బీద, గొప్ప, స్థాయి భేదం లేనివే అనుబంధాలు. అందుకే సొంత అన్నయ్యలు, తమ్ముళ్లకేగాక.. అప్యాయత, అనురాగాలు పంచేవారు, కష్టాల్లో వెన్నంటి ఉండి ధైర్యం నూరిపోసేవారు, ఆపదలో ఆదుకునే ప్రతిఒక్కరినీ తమ సోదరులుగా భావించి రాఖీ కడుతుంటారు మన భారతీయ అడపడుచులు. వీర జవాన్ల నుంచి ప్రధాని మంత్రిదాకా అందరికీ రాఖీలు పంపుతూ సోదర సమానులపై తమకున్న ప్రేమను చాటిచెబుతుంటారు. ఇదే క్రమంలో ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌కు చెందిన కొంతమంది వితంతువులు ప్రధాని నరేంద్ర మోదీకి రాఖీలు పంపించారు.

బృందావన్‌లోని ‘మా శారద’, రాధా తిల ఆశ్రమంలోని వయసుపైబడిన వితంతువులు ప్రధాని కోసం ప్రత్యేకంగా రంగురంగుల రాఖీలను రూపొందించారు. 251 రాఖీలను స్వయంగా తయారు చేసి, వాటిపై మోదీ ఫొటోనూ చిత్రీకరించారు. రాఖీలతోపాటు ‘ఆత్మనిర్భర్‌’, ‘స్టే సేఫ్‌’ అని మెసేజ్‌æ రాసిన ప్రత్యేకమైన మాస్కులు, స్వీట్లు పంపడం విశేషం. వీళ్లంతా మోదీని తమ సోదరుడిలా భావించి గత ఐదేళ్లుగా క్రమం తప్పకుండా రాఖీలు పంపిస్తున్నారు. గతేడాది బృందావన్‌కు చెందిన 103 ఏళ్ల వితంతు బామ్మ మోదీకి రాఖీ కట్టగా ఈ ఏడాది ఆ అవకాశం దక్కలేదు. దీంతో నలుగురు మహిళలతో మోదీకి రాఖీల బుట్టను  పంపారు.

మరిన్ని వార్తలు