పవిత్ర రమజాన్‌: జిబ్రీల్‌ దుఆ .. ప్రవక్త ఆమీన్‌

8 May, 2021 07:05 IST|Sakshi

అది పవిత్ర రమజాన్‌ మాసం. శుక్రవారం రోజు. ముహమ్మద్‌ ప్రవక్త(స) జుమా ఖుత్బా కోసం మింబర్‌ (వేదిక) ఎక్కుతున్నారు. కుడికాలు మొదటి మెట్టుపైపెడుతూనే ‘ఆమీన్‌’ అన్నారు. అలా  రెండవ మెట్టు, మూడవ మెట్టు అధిరోహిస్తూ ఆమీన్‌ .., ఆమీన్‌ అని పలికారు. జుమా సమావేశంలో పాల్గొన్న సహచరులకు ఏమీ అర్థం కాలేదు. ప్రవక్తవారు ఈ రోజేమిటీ.. అసందర్భంగా ఆమీన్‌ .. ఆమీన్‌ అని ముమ్మారు పలికారు. అని గుసగుసలాడుకున్నారు. ఇదే విషయాన్ని ప్రవక్తవారిని అడిగారు. దానికాయన, ‘నేను ప్రసంగం కోసమని వేదికనెక్కుతూ మొదటి మెట్టుపై కాలుమోపుతుండగా జిబ్రీల్‌ వచ్చారు. ఎవరైతే రమజాన్‌ మాసాన్ని పొంది, దాని ఉపవాసాలు పాటించి తమను తాము నరకాగ్ని నుండి రక్షించుకునే ప్రయత్నం చేసుకోలేదో, వారిపై దేవుని శాపం అవతరించుగాక.. అన్నారు.

దానికి నేను ఆమీన్‌ అన్నాను. రెండవ మెట్టుపై కాలు మోపుతుండగా, ఎవరైతే వృద్ధ తల్లిదండ్రులకి సేవలు చేసి స్వర్గాన్ని పొందే అర్హత సాధించలేదో వారిపై దేవుని శాపం పడుగాక.. అన్నారు. దానికీ నేను ఆమీన్‌ అన్నాను. మూడవ మెట్టుపై పాదం మోపుతుండగా, ఎవరైతే మీ పేరు అంటే, ‘ముహమ్మద్‌’ అని పలికి, లేక విని దురూద్, సలాం పలకలేదో వారిపై దేవుని శాపం అవతరించుగాక.. అన్నారు. అప్పుడు నేను ఆమీన్‌ అన్నాను’. అని వివరించారు ప్రవక్త మహనీయులు.

దైవదూతల్లో అత్యంత ఆదరణీయులు, దైవదూతల నాయకుడూ, హజ్రత్‌ ఆదం అలైహిస్సలాం మొదలు, మొహమ్మద్‌ ప్రవక్త(స) వరకూ ప్రతీ దైవప్రవక్తకూ దేవుని దగ్గరినుండి సందేశం తీసుకు వచ్చిన జిబ్రీల్‌ దుఆ చేయడం, ముహమ్మదుర్రసూలుల్లా వారు ఆ దుఆకు ఆమీన్‌ (తథాస్తు) పలకడమంటే దీనికి ఎంతగొప్ప ప్రాముఖ్యం ఉందో అర్థం చేసుకోవచ్చు. కనుక రమజాన్‌ ఉపవాసాలను ఎట్టిపరిస్థితిలోనూ నిర్లక్ష్యం చేయకుండా నియమ నిష్టలతో, అత్యంత శ్రద్ధాభక్తులతో ఆచరించాలి. అలాగే తల్లిదండ్రులను గౌరవించాలి. ఆదరించాలి. వారి బాగోగులు చూడాలి.

తల్లిదండ్రుల్ని పట్టించుకోకపోవడం, వారిబాగోగులు చూడక పోవడం దైవాగ్రహానికి దారి తీసేప్రమాదం ఉంది. ఇదే విధంగా ముహమ్మద్‌ ప్రవక్తవారిపై సలాములు పంపుతూ ఉండాలి. అంటే తరచుగా దురూదె షరీఫ్‌ పఠిస్తూ ఉండాలి. ప్రవక్త వారి పేరు పలికినా, లేక విన్నా వీలైతే దురూద్‌ చదవాలి. లేకపోతే కనీసం సల్లల్లాహు అలైహి వసల్లం అని పలకాలి.

రమజాన్‌ రోజాల పట్ల నిర్లక్ష్యం వహించడం, దురూద్‌ పంపక పోవడం, తల్లిదండ్రుల్ని పట్టించుకోక పోవడం ఎంతటి పెద్దపెద్ద పాపాలో అర్థం చేసుకోవాలి. జిబ్రీల్‌ దూత దుఆ చేయడం, రసూలుల్లా వారు తథాస్తు పలకడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. దైవం మనందరికీ ఈవిషయాలను అర్ధం చేసుకొని ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుందాం.
– ముహమ్మద్‌ ఉస్మాన్‌ ఖాన్‌   

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు