ఆమె ప్రతి అక్షరం స్త్రీ పక్షం

4 Mar, 2023 04:14 IST|Sakshi

రచయిత్రి రామలక్ష్మి ఆరుద్ర కన్నుమూత

అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నివాసంలో మృతి

100 కుపైగా పుస్తకాలు రాసిన రామలక్ష్మి

జీవనజ్యోతి సినిమాకు ఉత్తమ కథా రచయితగా నంది అవార్డు

జర్నలిస్టుగా, సెన్సార్‌ బోర్డు సభ్యురాలిగా సేవలు

తెలుగు సాహిత్యలోకం నుంచి రచయిత్రి కె.రామలక్ష్మి (92) వీడ్కోలు తీసుకున్నారు. రచయిత్రిగా, ఆరుద్ర సతీమణిగా, మద్రాసు (చెన్నై) నగరంలో తెలుగువారి ప్రతినిధిగా, నాటి సాహితీ సమూహాలలో కీలకమైన వ్యక్తిగా, సినిమా రంగంలో రచయిత్రిగా ఆమె సాగించిన యాత్ర సుదీర్ఘమైనది. ఆమె మరణంతో ఒక కాలపు తెలుగు సాహితీ చరిత్రకు మిగిలిన ఆఖరు సాక్షి లేకుండా పోయినట్టయ్యింది.

ప్రముఖ రచయిత ఆరుద్ర సతీమణి కె.రామలక్ష్మి (92) కన్నుమూశారు. కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. శుక్రవారం హైదరాబాద్‌లోని ఆస్మాన్ఘడ్‌లో ఉన్న నివాసంలో తుదిశ్వాస విడిచారు. రామలక్ష్మి ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా కోటనందూర్‌లో 1930 డిసెంబర్‌ 31న జన్మించారు. మద్రాస్‌ విశ్వవిద్యాలయంలో బీఏ పూర్తిచేశారు. ఆంగ్ల, ఆంధ్ర సాహిత్యం, ప్రాచీనాంధ్ర సాహిత్యం అభ్యసించారు.

1954లో ప్రముఖ కవి ఆరుద్రను వివాహం చేసుకున్నారు. వీరికి ఐదుగురు కుమార్తెలు. 1951 నుంచే రామలక్ష్మి రచనా ప్రస్థానం మొదలైంది. వివాహమైన తర్వాత ‘రామలక్ష్మి ఆరుద్ర’ కలం పేరుతో రచనలు చేశారు. మొత్తం 100 కు పైగా పుస్తకాలు రాశారు. ఆంధ్రపత్రికలో ఆమె సుదీర్ఘకాలం నిర్వహించిన ‘ప్రశ్న జవాబు’ శీర్షిక ప్రసిద్ధి చెందింది.

విడదీసే రైలుబళ్లు, అవతలిగట్టు, మెరుపుతీగె, తొణికిన స్వర్గం, మానని గాయం, ఆణిముత్యం, పెళ్లి, ప్రేమించు ప్రేమకై, ఆడది, ఆశకు సంకెళ్లు, కరుణ కథ, లవంగి, ఆంధ్ర నాయకుడు, పాండురంగని ప్రతిజ్ఞ, నీదే నా హృదయం, అద్దం, ఒక జీవికి స్వేచ్ఛ వంటి కథా సంకలనాలను రామలక్ష్మి రచించారు. తెలుగు సాహిత్య రంగానికి చేసిన సేవలకుగాను ఆమెకు గృహలక్ష్మి, స్వర్ణకంకణం సహా పలు ప్రతిష్టాత్మక పురస్కారాలు దక్కాయి.

ఉత్తమ రచయిత్రిగా నంది అవార్డు...
రామలక్ష్మి పలు సినిమాలకు కథలు అందించారు. 1975వ సంవత్సరంలో జీవనజ్యోతి సినిమా కథకు గాను అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి నంది అవార్డు అందుకున్నారు. కాసా సుబ్బారావు నిర్వహించిన స్వతంత్ర దినపత్రికలో జర్నలిస్టుగా పనిచేశారు. 1978లో ఉత్తమ జర్నలిస్టుగా రామానాయుడు అవార్డు అందుకున్నారు.

పలు స్త్రీ సంక్షేమ సంఘాల్లో సేవలు అందించి మహిళల శ్రేయస్సు కోసం పాటుపడ్డారు. కేంద్ర ఫిల్మ్‌ సెన్సార్‌ బోర్డ్‌ రీజనల్‌ ప్యానెల్‌ సభ్యురాలిగా కూడా పనిచేశారు. రామలక్ష్మి ఆరుద్ర మృతిపట్ల పలువురు రచయితలు, సినీ, రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు సంతాపం తెలిపారు. శుక్రవారం సాయంత్రమే ఎస్‌ఆర్‌నగర్‌ శ్మశానవాటికలో ఆమె అంత్యక్రియలను నిర్వహించారు.

స్టెల్లా మేరీ స్టూడెంట్‌
స్వస్థలం కాకినాడ అయినా కె.రామలక్ష్మి చదువు చెన్నైలోనే సాగింది. స్టెల్లా మేరీ కాలేజీలో చదువుకుని ఇంగ్లిష్‌ భాషలో పట్టు సాధించారు. ‘ఐ యామ్‌ ఏ స్టెల్లామేరియన్‌’ అని గర్వంగా చెప్పుకునేవారు. కాలేజీలో ఒక కార్యక్రమానికి అతిథిగా హాజరైన ప్రఖ్యాత జర్నలిస్టు ఖాసా సుబ్బారావు ఇంగ్లిష్‌లో ఉపన్యాసం ఇచ్చిన కె.రామలక్ష్మిని చూసి పరీక్షలు అయిపోయాక తనని కలవమని చెప్పారు. ‘స్వతంత్ర’ పత్రికలో ఇంగ్లిష్‌ విభాగంలో పాత్రికేయురాలిగా ఉద్యోగం ఇచ్చారు.

‘తెలుగు స్వతంత్ర’కు ఎడిటర్‌గా ఉన్న ఖాసా సుబ్బారావు కోరిక మేరకు ‘నడుస్తున్న చరిత్ర’ కాలమ్‌ రాశారు రామలక్ష్మి. ఆమె ఇంటిలో ప్రతి సాయంత్రం సాహితీచర్చలు జరిగేవి. వాటికి ఆరుద్ర, శ్రీరంగం నారాయణబాబు, శ్రీశ్రీ తదితరులు హాజరయ్యేవారు. ఆరుద్ర, రామలక్ష్మి పరస్పరం ఇష్టపడి ఆ రోజుల్లో అంటే 1954ఏప్రిల్‌30న రిజిస్టర్డ్‌ మేరేజీ చేసుకున్నారు. ఈ పెళ్లికి దర్శకుడు హెచ్‌.ఎం.రెడ్డి, శ్రీశ్రీ సాక్షి సంతకాలు చేశారు. శ్రీశ్రీ తన పెళ్లికి సాక్షి సంతకం చేయాలని ఆరుద్ర భావించడం వల్ల ఇది జరిగింది. శ్రీశ్రీ రామలక్ష్మిని ‘అత్తగారు’ అని సరదాగా పిలిచేవారు. అయితే శ్రీశ్రీ ధోరణిని రామలక్ష్మి చివరి వరకూ వ్యతిరేకిస్తూనే వచ్చారు. 

ఆరుద్రకు అండా దండా
ఆరుద్ర సినిమా రంగంలో కృషి చేయడానికి, ‘సమగ్రాం«ధ్ర చరిత్ర’ పరిశోధన పూర్తి చేయడానికి రామలక్ష్మి అందించిన అండదండలే కారణం. వీరికి ఐదుగురు కుమార్తెలు విజయ, త్రివేణి, కవిత, లలిత, వాసంతి. వీరి పెంపకం, చదువు బాధ్యతలకోసం ఆరుద్ర సమయాన్ని తీసుకోకుండా ఆమే తన సమయమంతా వెచ్చించారు. ‘ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యం కోసం విపరీతంగా సమయం ఇవ్వాలనుకునేవాడు. కాని ఇల్లు గడవాలి కదా. సినిమా రంగంలో పని చేస్తేనే డబ్బులు వస్తాయి. అందుకని నేనేమి అనకుండా గబగబా కొన్ని పాటలు రాసేసి ఆ డబ్బు అప్పజెప్పి మళ్లీ పరిశోధనలో పడేవాడు’ అన్నారు రామలక్ష్మి.

ఆరుద్రకు అనారోగ్యం వస్తే నాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌ రెడ్డితో మాట్లాడి ప్రభుత్వ సహాయం అందేలా చూశారామె. ‘నేను మరణించినప్పుడు ఎటువంటి హంగామా చేయవద్దు’ అని ఆరుద్ర కోరడం వల్ల 1998లో ఆరుద్ర మరణించినప్పుడు కేవలం ముగ్గురు నలుగురు స్నేహితులతో కలిసి అంత్యక్రియలు నిర్వహించి ఆ తర్వాతే మరణవార్తను లోకానికి తెలియచేశారు. ఇది సాహిత్య ప్రియులను బాధించినా రామలక్ష్మి ధోరణి అలాగే ఉండేది. 

సినిమా రచయిత్రి
కె.రామలక్ష్మికి సినిమా రంగంలో అందరూ సుపరిచితులు స్నేహితులు. వారిలో భానుమతి రామకృష్ణ, జయలలిత, వాణిశ్రీ తదితరులు ఉన్నారు. కె.విశ్వనాథ్‌ తీసిన ‘జీవనజ్యోతి’ సినిమాకు రామలక్ష్మి కథను అందించారు. ఈ సినిమా నిజానికి వాణిశ్రీ కోసమే రాశారు. కె.రామలక్ష్మి రాశారని వాణిశ్రీ నటించారు. దీని నిర్మాణ సమయంలో విశ్వనాథ్‌కు, రామలక్ష్మికి వాదోపవాదాలు నడిచాయి. దాంతో కె.విశ్వనాథ్‌ విజయవాడలో జరిగిన శతదినోత్సవంలో ‘ఇకపై ఇతరులు రాసిన కథలతో నేను సినిమాలు తీయను’ అని ప్రకటించారు.

రామలక్ష్మి రాసిన మరో సినిమా ‘గోరింటాకు’. అయితే దీని మీద ఆ రోజుల్లో వివాదం చెలరేగింది. దాసరి నారాయణరావు స్టోరీ డిపార్ట్‌మెంట్‌లో తెర వెనుక ఉండి పని చేసిన వారిలో రామలక్ష్మి కూడా ఒకరు. ఆమె 1970లలో సెన్సార్‌ బోర్డ్‌ మెంబర్‌గా పని చేశారు.

స్త్రీ పక్షపాతి
రామలక్ష్మి నిత్య జీవితంలోనే కాదు రచనా జీవితంలోనూ ఆధునికురాలు. ఛాందసాలు లేని జీవనం గడపాలని, భార్యాభర్తలు స్నేహమయ జీవనాన్ని అనుభవించాలని, స్త్రీలకు తమ జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ ఉండాలని ఆ రోజుల్లోనే తన కథలలో చెప్పారామె. 1954లో ఆమె తన తొలి కథా సంపుటి ‘విడదీసే రైలుబళ్లు’ వెలువరించారు. ఈ సంపుటిలోని ‘చీలిన దారులు’ అనే కథలో ఒక జంట పెళ్లి చేసుకోకుండా సహజీవనం ప్రారంభిస్తారు.

పెళ్లి ప్రేమను చంపేస్తుంది అని ఆ కథలో రాసి అప్పటికి తెలియని సహజీవనాన్ని ప్రతిపాదించారామె. ‘తొణికిన స్వప్నం’, ‘ఒక జీవికి స్వేచ్ఛ’, ‘అద్దం’ తదితరాలు ఆమె ఇతర కథా సంపుటాలు. భార్యాభర్తలు స్నేహితులుగా ఉండాలని సూచిస్తూ 1970లలో ఆమె రాసిన ‘పార్వతి కృష్ణమూర్తి కథలు’ పాఠకాదరణ పొందాయి. ఇందులో భార్య అరమరికలు లేకుండా భర్తతో తన అభిప్రాయాలను చెబుతుంది. స్నేహాన్ని, చొరవను ప్రదర్శిస్తుంది. భార్యంటే భర్త చెప్పినట్టుగా పడుండాలనే నాటి ధోరణికి ఈ పాత్ర పూర్తి భిన్నం. రామలక్ష్మి రాసిన కథల్లో ‘అదెక్కడ’ విశిష్టమైనది.

ఆ కథలో ముఖ్యపాత్ర తన పేరు మర్చిపోతుంది. దాని కారణం భర్త, పిల్లలు అందరూ ‘అది’ అని పిలుస్తూ ఉండటమే. చివరకు ఆమె ఒకరోజు ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. భర్త ‘అదెక్కడ’ అని ఎందరిని అడిగినా కనిపించదు. పురుషుడు మోసం చేస్తే స్త్రీ సింగిల్‌ మదర్‌గా జీవించగలదనే సందేశం ఇస్తూ కథలు రాశారు. బేలగా ఉండే స్త్రీలను అలాంటి పాత్రలను రామలక్ష్మి హర్షించలేదు. స్త్రీలు ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా తమ జీవితాన్ని మలుచుకోవాలని కోరుతారు. ఆమె రచనలను ఈ తరానికి మళ్లీ చేరువ చేయాల్సి ఉంది.

మరిన్ని వార్తలు