ఆరోగ్య సంస్థానం: రామ్‌దేవ్‌రావు హాస్పిటల్

11 Oct, 2020 08:50 IST|Sakshi
రామ్‌దేవ్‌రావు హాస్పిటల్, రాణి కుముదినీ దేవి (ఇన్‌సెట్‌)

సిరివెన్నెల పదేళ్ల పాపాయి. తండ్రి విజయ్‌ కేటరింగ్‌ సర్వీస్‌ ఉద్యోగి. జగద్గిరిగుట్టలో నివాసం. రోజూ తెల్లవారు జామున మూడున్నరకే డ్యూటీకి వెళ్తాడు. తల్లి మమత పిల్లల్ని చూసుకుంటూ ఇంటిపట్టునే ఉంటుంది. పిల్లలు నిద్రలేచేలోపు దగ్గరలో ఉన్న మార్కెట్‌కెళ్లి కావల్సిన వస్తువులు తీసుకుని ఇంటికి వచ్చేస్తుంటుంది. ఎప్పటిలాగానే ఆ రోజు కూడా తలుపు బయటి నుంచి గడియపెట్టి మార్కెట్‌కి వెళ్లింది. ఆమె తిరిగి వచ్చేలోపు నిద్రలేచేశారు పిల్లలు. అమ్మ వచ్చేలోపు తమ్ముడికి పాలు వేడి చేసి తాగించాలనుకుంది సిరివెన్నెల. అగ్గిపుల్ల వెలిగించింది. స్టవ్‌ వెలిగించేలోపు మంట చేతి మీదకు పాకింది. భయంతో అగ్గిపుల్లను వదిలేసింది. ఏం జరుగుతోందో తెలిసే లోపే మంటలు గౌను మొత్తానికి వ్యాపించాయి. చుట్టుపక్కల వాళ్లు వచ్చేలోపు ఒళ్లు తీవ్రంగా కాలిపోయింది. గాయాలకు చికిత్స కోసం నాలుగు నెలల పాటు హాస్పిటల్‌లో ఉండి గడచిన మే నెలలో డిశ్చార్జ్‌ అయింది సిరివెన్నెల. 

సిరివెన్నెల అమ్మానాన్నలు కృష్ణాజిల్లా గుడివాడ నుంచి బతుకు తెరువు కోసం హైదరాబాద్‌కొచ్చారు. విజయ్‌ది పొట్ట నింపుకోవడానికి తప్ప వైద్యం చేయించుకోవడానికి డబ్బు మిగిలే ఉద్యోగం కాదు. ‘‘మాలాంటి వాళ్ల కోసమే వెలిసిన దేవాలయమే మా బిడ్డకు మాకు దక్కించింది. దేవుడు ఎక్కడో లేడు, అక్కడి వైద్యుల్లోనే ఉన్నాడు. నాలుగు నెలలు ఏసీ గదిలో పెట్టి చికిత్స చేశారు. పదహారు లక్షల బిల్లయింది. మా దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. బిడ్డను జాగ్రత్తగా చూసుకోమని మాకప్పగించారు’’ అని చేతులెత్తి మొక్కుతోంది మమత. 

పేదల దేవాలయం మమత చెప్పిన హాస్పిటల్‌ హైదరాబాద్, కూకట్‌పల్లి, వివేకానంద నగర్‌లో ఉంది. ఇది ఇప్పటిది కాదు, 1950 దశకంలో 55 ఎకరాల్లో శివానంద రిహాబిలిటేషన్‌ హోమ్‌గా మొదలైంది. వడ్డేపల్లి సంస్థానం ఆడపడుచు, వనపర్తి సంస్థానం కోడలు రాణి కుముదినీ దేవి ఆలోచన. కుష్టువ్యాధి, టీబీ సమాజాన్ని పీడిస్తున్న రోజులవి. పేషెంట్‌లను సమాజం చూపులతోనే బహిష్కరించేది. అలాంటి పరిస్థితుల్లో పేషెంట్‌ల కోసం ఇళ్లు, చర్చ్, మసీదు, దేవాలయాలు కట్టించి ఇచ్చారు రాణి కుముదినీదేవి. ఏకంగా ఒక ఊరినే నిర్మించారని చెప్పాలి.

ఇప్పుడు హెచ్‌ఐవీ పేషెంట్‌లకు కూడా పునరావాసం కల్పిస్తున్నారు. పేషెంట్‌లకు కొవ్వొత్తుల తయారీ, బ్యాండేజ్‌ క్లాత్‌ తయారీ, వడ్రంగం, తాపీ పనుల్లో శిక్షణనిప్పించి వారి ఉపాధికి బాటలు వేశారు. సాధారణ పేషంట్‌లకు కూడా వైద్య సదుపాయం కల్పించమని సూచించారు ఆమె భర్త రాజా రామ్‌దేవ్‌రావు.  అదే ప్రాంగణంలో భర్త పేరు మీద ‘రామ్‌దేవ్‌రావ్‌’ హాస్పిటల్‌ స్థాపించారు కుముదినీదేవి. ఇది పూర్తిగా చారిటీ హాస్పిటల్‌. నామమాత్రపు ఫీజుతో సకల వైద్యసౌకర్యాలను అందిస్తున్న వైద్యాలయం. ఆ ఫీజు కూడా చెల్లించలేని వారికి పూర్తిగా ఉచితంగా వైద్యం చేస్తున్న పేదల పాలిట దేవాలయం. 

సామాజిక వైద్యం
ఇక్కడి డాక్టర్లు హాస్పిటల్‌కి వచ్చిన వాళ్లకు వైద్యం చేయడమే కాదు. స్కూళ్లు, కాలనీలకు కూడా వెళ్లి వైద్యం చేస్తారు. వారంలో ఒకరోజు మియాపూర్‌లోని వరలక్ష్మి ఓల్డేజ్‌ హోమ్, ఒక రోజు ఎల్లమ్మ బండ కాలనీలకు వైద్య బృందం వెళ్తుంది. అలాగే పల్స్‌పోలియో భూతాన్ని తరిమి కొట్టడానికి కూడా ప్రత్యేకమైన చొరవ తీసుకుంటున్నారు. భవన నిర్మాణాలు జరుగుతున్న చోట వలస కార్మికులు... కుటుంబాలతో తాత్కాలిక నివాసాల్లో జీవిస్తుంటారు. హైదరాబాద్‌ మహానగరంలో అలాంటి ప్రదేశాలను గుర్తించి ఆ పిల్లలకు పోలియో చుక్కలు వేయడానికి రామ్‌దేవ్‌రావ్‌ హాస్పిటల్‌ సహాయం చేస్తోంది. క్యాన్సర్‌ పేషెంట్‌లు అంత్యదశ ప్రశాంతంగా గడపడం కోసం పాలియేటివ్‌ కేర్‌ సర్వీస్‌ కూడా ఇస్తోంది రామ్‌దేవ్‌రావ్‌ వైద్యాలయం. ఈ సేవ కూడా పూర్తిగా ఉచితం. పేషెంట్‌తోపాటు సహాయకుల్లో ఒకరికి కూడా ఆహారం, బస ఉచితం. రెండో సహాయకులకు నామమాత్రపు ఫీజు వసూలు చేస్తారు. ఇంత మహోన్నతమైన సేవలందిస్తున్న ఈ ట్రస్టును స్థాపించిన రాణి కుముదినీ దేవి దంపతులు ఇప్పుడు లేరు.

వారి వారసుల్లో రెండవ కొడుకు విక్రమ్‌దేవ్‌రావ్, పెద్ద కోడలు మీరారావు పర్యవేక్షిస్తున్నారు. అత్యాధునికమైన వైద్యాన్ని పేదవాళ్ల దగ్గరకు చేర్చిన మహనీయుడు స్వర్గీయ డాక్టర్‌ వైఎస్సార్‌. కన్నీళ్లతో వచ్చిన పేషెంట్‌ ముఖంలో చిరునవ్వు చూడాలనుకున్న మహోన్నతమైన దాత రాణి కుముదినీదేవి. రేపటి ఫలాల కోసం నేడు మొక్క నాటాలనే దార్శనికత వారిది. జ్వరంతో హాస్పిటల్‌లో చేరిన పేషెంట్‌లకు బిల్లుతో గుండెపోటు తెప్పించే కార్పొరేట్‌ హాస్పిటళ్ల మధ్యనే రాణి కుముదినీదేవి స్థాపించిన వైద్యాలయం కూడా ఉంది. ఎటువంటి ప్రచారం లేకుండా మౌనంగా తన పని తాను చేసుకుపోతోంది.
– వాకా మంజులారెడ్డి 


రేస్‌క్లబ్‌ సౌజన్యం
ఈ హాస్పిటల్‌లో కంటి వైద్య విభాగాన్ని హైదరాబాద్‌ రేస్‌క్లబ్‌ ఏర్పాటు చేసింది. అధునాతనమైన లేజర్‌ సర్జరీలు కూడా ఉచితంగా చేస్తారు. లెన్స్‌ వంటి పరికరాలకు మాత్రమే చార్జ్‌ చేస్తున్నట్లు తెలియచేశారు సీఈవో డాక్టర్‌ యోబు. ‘మహిళలకు మెనోపాజ్‌ తర్వాత కూడా ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాల జీవితకాలం ఉంటుంది, ఈ దశలో అవసరమైన జాగ్రత్తలు తీసుకోకపోతే తర్వాత జీవితకాలమంతా నిస్తేజంగా కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే మెనోపాజ్‌ సమయంలో ఆరోగ్యపరమైన జాగ్రత్తలు, పరీక్షల కోసమే ప్రత్యేకంగా ఒక విభాగం ఉంది’ అని తెలియచేశారాయన.

ఆరోగ్య ప్రదానం
జనరల్‌ మెడిసిన్, జనరల్‌ సర్జరీ, ప్రసూతి వైద్యం, ఈఎన్‌టీ, ఆప్తాల్మాలజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, రేడియాలజీ, డైటరీ కౌన్సెలింగ్‌ విభాగాలున్నాయి. డ్యూటీ డాక్టర్‌లు ఇరవై మందిమి ఉన్నాం. కన్సల్టెంట్‌లుగా మరో 47 మంది డాక్టర్లు సేవలందిస్తున్నారు. చారిటీ హాస్పిటల్‌ కదా అని పేషెంట్‌ల పట్ల నిర్లక్ష్యంగా ఉంటారనుకోవద్దు. మేము వైద్యవృత్తిని అవమానించం. నర్సుల చేత ప్రసవం చేయించడం వంటివి ఉండవు. హాస్పిటల్‌ ఆవరణలో డాక్టర్‌లకు క్వార్టర్లు కూడా ఉన్నాయి. ఏ సమయంలో ఎమర్జెన్సీ వచ్చినా హాజరవుతారు. మేము తీసుకునే ఫీజు సంస్థ నిర్వహణ కోసం మాత్రమే. నార్మల్‌ డెలివరీకి పన్నెండువేలు, సిజేరియన్‌కి పద్దెనిమిది వేలు, డయాలసిస్‌ చార్జ్‌ మూడు వందలు. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే డయాలసిస్‌ ఉచితం. నలభై మెషీన్‌లున్నాయి. రోజుకు 100  మందికి పైగా డయాలసిస్‌ కోసం వస్తుంటారు. మొత్తం విభాగాలకు కలిపి రోజుకు తొమ్మిది వందల మంది వస్తుంటారు.  – డాక్టర్‌ ఎన్‌.యోబు,సీఈవో, రామ్‌దేవ్‌రావ్‌ హాస్పిటల్, హైదరాబాద్‌

మరిన్ని వార్తలు