Ranee Ramaswamy: నటరాజు దీవించిన నాట్య సుధా నిధులు

26 May, 2023 05:23 IST|Sakshi
అశ్వినీ, అపర్ణల నృత్య కౌశలం

కళ

భావం, రాగం, తాళం... ఈ మూడు నృత్య కళాంశాల సమ్మేళనం భరతనాట్యం. అరవై నాలుగు ముఖ, హస్త, పాద కదలికల అపురూప విన్యాసం భరతనాట్యం. మూడు దశాబ్దాల క్రిందట అమెరికాలో ‘రాగమాల డ్యాన్సింగ్‌ కంపెనీ’ మొదలు పెట్టి ఆ నాట్య వైభవాన్ని దశదిశలా   తీసుకువెళుతోంది రాణీ రామస్వామి. తానే ఒక సైన్యంగా మొదలైన రాణీ రామస్వామికి ఇప్పుడు
ఇద్దరు కూతుళ్ల రూపంలో శక్తిమంతమైన సైనికులు తోడయ్యారు....

‘మేము గత జన్మలు, పునర్జన్మల గురించి తరచుగా మాట్లాడుకుంటూ ఉంటాం. మా పెద్ద అమ్మాయి అపర్ణకు మూడు సంవత్సరాల వయసు నుంచే నృత్యంపై అనురక్తి ఏర్పడింది. ఆమె పూర్వజన్మలో నృత్యకారిణి అని నా నమ్మకం’ అంటుంది రాణీ రామస్వామి.
చెన్నైలో పుట్టిన రాణీ రామస్వామికి ఏడు సంవత్సరాల వయసులో భరతనాట్యంతో చెలిమి ఏర్పడింది.

డెబ్బై ఒకటో యేట ఆమెకు ఆ నాట్యం శ్వాసగా మారింది. ఈ వయసులోనూ చురుగ్గా ఉండడానికి అవసరమైన శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తోంది.
మూడు దశాబ్దాల క్రితం ఆమె అమెరికాలోని మినియాపొలిస్‌లో ‘రాగమాల డ్యాన్స్‌ కంపెనీ’కి శ్రీకారం చుట్టింది. ఈ కంపెనీ ద్వారా అమెరికాలో నృత్యాభిమానులైన ఎంతో మందికి ఆత్మీయురాలిగా మారింది. భరతనాట్యాన్ని ముందుకు తీసుకువెళ్లే ఇంధనం అయింది.

‘రాగమాల’ ద్వారా ప్రసిద్ధ జాతీయ, అంతర్జాతీయ కళాకారులు, సంస్థలతో కలిసి పనిచేస్తోంది రాణీ రామస్వామి.
‘రాగమాల ట్రైనింగ్‌ సెంటర్‌’ ద్వారా ఏడు సంవత్సరాల వయసు నుంచే భరత
నాట్యంలో శిక్షణ పొందుతున్నారు ఎంతోమంది పిల్లలు.

‘అమ్మా, నేను, అక్క ఒక దగ్గర ఉంటే అపురూపమైన శక్తి ఏదో మా దరి చేరినట్లు అనిపిస్తుంది. ప్రేక్షకుల్లో కూర్చొని వేదికపై వారి నృత్యాన్ని చూసినప్పుడు, డ్యాన్స్‌ చేస్తూ ప్రేక్షకుల్లో కూర్చున్న వారిని చూస్తున్నప్పుడు, మేము ముగ్గురం కలిసి నృత్యం చేస్తున్నప్పుడు....అది మాటలకందని మధురభావన’ అంటోంది అశ్వినీ రామస్వామి.
పాశ్చాత్య ప్రేక్షకులకు భరతనాట్యంలోని సొగసు అర్థమయ్యేలా, ఆకట్టుకునేలా చేయడంలో రాణీ రామస్వామి విజయం సాధించింది.

‘క్రియేటివ్‌ పర్సన్‌ లేదా ఆర్టిస్‌ ప్రయాణం ఒంటరిగానే మొదలవుతుంది. ఆ ప్రయాణంలో వేరే వాళ్లు తోడైనప్పుడు ఎంతో శక్తి వస్తుంది. అమ్మ విషయంలోనూ ఇదే జరిగింది. ఇప్పుడు మాతో పాటు ఎంతోమంది ఆమె వెంట ప్రయాణం చేస్తున్నాం’ అంటుంది అపర్ణ రామస్వామి.
భరతనాట్యానికి సంబంధించి ఈ ముగ్గురికి 3డీలు అంటే ఇష్టం.
డీప్‌ లవ్, డెడికేషన్, డిసిప్లిన్‌.

‘ప్రశంసల సంగతి సరే, విమర్శల సంగతి ఏమిటి?’ అనే ప్రశ్నకు వీరు ఇచ్చే సమాధానం...
‘విమర్శ కోసం విమర్శ అని కాకుండా హానెస్ట్‌ ఫీడ్‌బ్యాక్‌ అంటే ఇష్టం. దీని ద్వారా మనల్ని మనం మరింతగా మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది.
హిందూ, సూఫీ తత్వాన్ని మేళవిస్తూ రూపొందించిన ‘రిటెన్‌ ఇన్‌ వాటర్‌’ నృత్యరూపకం భౌగోళిక సరిహద్దులను చెరిపేసి అందరినీ ఒకే ప్రపంచంలోకి తీసుకు
వచ్చింది.

‘రాగమాల డ్యాన్సింగ్‌ కంపెనీ’ ద్వారా మూడు దశాబ్దాల ప్రయాణం సులువైన విషయం ఏమీ కాదు.
ప్రయాణంలో...కొందరు కొన్ని అడుగుల దూరంతో వెనుదిరుగుతారు. కొందరు కొన్ని కిలో మీటర్ల దూరంలో వెనుతిరుగుతారు. కొందరు మాత్రం వందలాది కిలోమీటర్లు అలుపెరగకుండా ప్రయాణిస్తూనే ఉంటారు. రాణీ రామస్వామి ఆమె కూతుళ్లు అపర్ణ, అశ్వినిలు అచ్చంగా ఈ కోవకు చెందిన కళాకారులు.
 
నోట్స్‌ రెడీ
ఇద్దరు కూతుళ్లు అపర్ణ, అశ్విని తల్లితో పాటు కూర్చుంటే కబుర్లకు కొరత ఉండదు. అయితే అవి కాలక్షేపం కబుర్లు కాదు. కళతో ముడిపడి ఉన్న కబుర్లు. అమ్మ రాణీ రామస్వామి తన సుదీర్ఘ ప్రయాణానికి సంబంధించిన విలువైన అనుభవం ఒకటి ఆ సంభాషణలలో మెరిసి ఉండవచ్చు. ఈతరానికి నాట్యాన్ని ఎలా దగ్గర చేయాలి అనేదాని గురించి పిల్లలిద్దరూ తల్లితో చర్చించి ఉండవచ్చు. ఇలా ఎన్నెన్నో ఉండవచ్చు. ఈ కబుర్లు వృథాగా పోవడం ఎందుకని అర్చన, అశ్విన్‌లు నోట్స్‌తో రెడిగా ఉన్నారు.
 

మరిన్ని వార్తలు :


Advertisement

ASBL
మరిన్ని వార్తలు