బావి దిగి చూడు.. ఎవరెస్టు ఎక్కినట్లే!

25 Jan, 2021 10:27 IST|Sakshi
రాణీ కీ వావ్‌ శిల్పసౌందర్యాన్ని ఆశ్చర్యంగాచూస్తున్న టీవీ నటి మహిమా మక్వానా

ఆకాశం అంచుల్ని తాకితేనేనా.. శిఖరాగ్రాలను చేరుకుంటేనేనా.. ...ప్రపంచాన్ని జయించిన సంతోషం కలిగేది!  ఈ బావిలోకి దిగి చూడండి. ఎవరెస్టును ఎక్కినట్లే ఉంటుంది! విజయ పతాకాన్ని ఎగరేసినట్లే ఉంటుంది.

ఇది రాణి గారి బావి. గుజరాత్‌ రాష్ట్రంలో అహ్మదాబాద్‌ నగరానికి 130 కి.మీల దూరాన ఉంది. ఇది ఏడు నిలువుల లోతు బావి. పేరు రాణీ కీ వావ్‌. ఈ బావిలోకి దిగడమే ఓ విచిత్రం. ఏ మెట్టు నుంచి మొదలు పెట్టామో తిరిగి అదే మెట్టు మీదకు చేరతాం. ఏడంతస్థుల రాణి గారి బావిలో విశాలమైన వరండాలుంటాయి. వరండా స్థంభాల మీద అందమైన శిల్పాలున్నాయి. బుద్ధుడు, విష్ణు, దశావతారాలు, కల్కి, రాముడు, మహిసాసురమర్దని, నరసింహుడు, వామన, వరాహవతారాలతోపాటు నాట్య భంగిమలో నాగకన్యల శిల్పాలుంటాయి.

ఏడంతస్తుల బావి నిర్మాణంలో సుమారు ఎనిమిది వందల శిల్పాలు ఉండవచ్చని అంచనా. ఇప్పుడు ఐదు అంతస్తులు మాత్రమే సరిగ్గా ఉన్నాయి. 64 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పు, 27 మీటర్ల లోతున్న ఈ బావిలోకి దిగడం సాహసమేనేమో అనిపిస్తుంది. కానీ తీరా బావి అడుగు అంతస్థులోకి చేరిన తర్వాత ప్రపంచాన్ని జయించినంత సంతోషం కలుగుతుంది. ఎవరెస్టును అధిరోహించినంత గర్వంగానూ ఉంటుంది.

మంచి గాలి
ఈ ప్రదేశాన్ని పదకొండవ శతాబ్దంలో సోలంకి రాజవంశం పాలించింది. ఆ రోజుల్లో మొదటి భీమదేవుని భార్య రాణి ఉదయమతి భర్త జ్ఞాపకార్థం ఈ బావిని నిర్మించింది. ఈ బావి గుజరాత్‌లోని పఠాన్‌కు నాలుగు కిలోమీటర్ల దూరంలో సరస్వతి నది తీరాన ఉంది. ఆ నదికి వచ్చిన వరదల్లో బావి మునిగిపోయి కొన్ని శతాబ్దాల పాటు ఇసుకమేటలోనే ఉండిపోయింది. ఆర్కియాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా తవ్వకాల్లో 1980లో బయట పడిన ఈ బావిని యునెస్కో 2014లో ‘వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌’ జాబితాలో చేర్చింది.

సాధారణ బావుల్లోకి దిగితే కొంత సేపటికి ఆక్సిజెన్‌ తగినంత అందక ఇబ్బంది పడతారు. కానీ ఇక్కడ ఆ అసౌకర్యం ఉండదు. విశాలమైన వరండాలు, స్తంభాల మధ్య నుంచి గాలి ధారాళంగా ప్రసరిస్తుంది. నాలుగో అంతస్తు నుంచి మరొక బావి నుంచి ఈ ప్రధాన బావితో అనుసంధానమై ఉంటుంది. దీని ఆకారం పై నుంచి చూస్తే దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది. లోతుకు వెళ్తే కొద్దీ వలయాకారంగా ఉంటుంది.

నీటి సంరక్షణ కోసం

గుజరాత్, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో ఇలాంటి దిగుడు బావులు ఎక్కువ. మన తెలంగాణలో కూడా ఇటీవలి తవ్వకాల్లో ఇలాంటి బావులు బయటపడ్డాయి. భూగర్భ జలాలను రక్షించుకోవడానికి క్రీస్తు పూర్వం మూడు వేల ఏళ్ల నుంచి అనుసరిస్తున్న విధానం ఇది. వీటిని సామాజిక ప్రయోజనం కోసమే నిర్మించేవారు. పనిలో పనిగా దీనిని విహారకేంద్రంగా కూడా మలుచుకునేవారు. ఇప్పుడు గోలీవుడ్‌ (గుజరాత్‌ సినిమా ఇండస్ట్రీ) పాటల చిత్రీకరణకు మంచి లొకేషన్‌ అయింది.

ఎండాకాలంలో ఇవి చక్కటి వేసవి విడుదులు. ఈ దిగుడు బావుల్లో మే నెలలో కూడా నీళ్లు సమృద్ధిగా ఉంటాయి. ఈ దిగుడు బావుల పరిసరాల నుంచి ఓ పది అడుగుల దూరంలో ఎండ తీవ్రత భరించలేనంత తీక్షణంగా ఉన్నప్పుడు కూడా దిగుడు బావి దగ్గర శీతల పవనాలు వీస్తుంటాయి. అప్పటి ఆర్కిటెక్టులకు నేచురల్‌ ఎయిర్‌కండిషనింగ్‌ టెక్నాలజీ ఏదో తెలిసే ఉంటుంది. తవ్వే కొద్దీ బయట పడుతున్న సాంకేతిక చాతుర్యం ఇది.

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు