Surabhi Bharadwaj: విజయ వీచిక

29 May, 2022 00:18 IST|Sakshi
జర్మనీలో జరిగిన జూనియర్‌ వరల్డ్‌ కప్‌ 2022 రైఫిల్‌ షూటింగ్‌; పోటీల్లో రజతం సాధించిన సందర్భంగా భారత జాతీయ పతాకంతో సురభి

సురభి తొమ్మిదో తరగతి వరకు అమ్మకూచి. ఎన్‌సీసీలో చేరింది... రెక్కలు విచ్చుకుంది. రైఫిల్‌ చేతిలోకి తీసుకుంది... టార్గెట్‌కు గురిపెట్టింది. లక్ష్యాలను సాధించడమే లక్ష్యంగా తీర్మానించుకుంది. ఆ లక్ష్యాల్లో ఓ మైలురాయి.. ప్రపంచ స్థాయి రజత పతకం జర్మనీలో ఎగిరిన త్రివర్ణ పతాకమే అందుకు నిదర్శనం.

మధ్య తరగతి కుటుంబం నుంచి స్పోర్ట్స్‌ పర్సన్‌ తయారు కావడం అంటే సాధారణమైన విషయం కాదు. తనలో నేర్చుకోవాలనే తపన, సాధన చేయాలనే కసి తనలో రగిలే జ్వాలలాగ ఉంటే సరిపోదు. తల్లిదండ్రులకు కూడా అదే స్థాయిలో ఆకాంక్ష ఉండాలి. అంతకంటే ముఖ్యంగా ఆర్థిక వెసులుబాటు ఉండాలి. పిల్లల క్రీడాసాధన, పోటీలకు తీసుకువెళ్లడం, స్కూల్‌లో ప్రత్యేక అనుమతులు తీసుకోవడం, మిస్‌ అయిన క్లాసుల నోట్స్‌ తయారీ వంటి పనుల కోసం పేరెంట్స్‌లో ఒకరు ఆసరా ఇవ్వాలి.

కొన్ని క్రీడలకైతే ఖర్చు లక్షల్లో ఉంటుంది. స్పాన్సర్‌షిప్‌ కోసం ప్రయత్నించక తప్పని పరిస్థితులుంటాయి. కఠోర సాధనకు తోడుగా ఈ సౌకర్యాలన్నీ అమరినప్పుడే క్రీడాకారులు తయారవుతారు. ఇన్ని సమ్మెట దెబ్బలకు ఓర్చి మెరిసిన వీచిక రాపోలు సురభి భరద్వాజ్‌. ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ జూనియర్‌ వరల్డ్‌ కప్‌ పోటీల్లో రజతంతో అంతర్జాతీయ వేదిక మీద మన జాతీయ పతాకాన్ని సగర్వంగా ఆవిష్కరించింది.
 
ఇద్దరూ షూటర్సే!
ఇంటర్నేషనల్‌ షూటింగ్‌ స్పోర్ట్స్‌ ఫెడరేషన్‌ (ఐఎస్‌ఎస్‌ఎఫ్‌) జూనియర్‌ వరల్డ్‌ కప్‌ 2022 పోటీలు జర్మనీలోని సూల్‌లో ఈ నెల తొమ్మిదవ తేదీ మొదలయ్యాయి. ఈ పోటీల్లో ఈ 18వ తేదీన 50 మీటర్ల ప్రోన్‌ విభాగంలో రజత పతకాన్ని సాధించిన సురభి హైదరాబాద్‌లో పుట్టి పెరిగింది. తండ్రి విష్ణు భరద్వాజ్‌ ప్రైవేట్‌ ఉద్యోగి, తల్లి లావణ్య జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ఉద్యోగి. కుటుంబంలో క్రీడానేపథ్యం లేని సురభికి రైఫిల్‌ షూటింగ్‌కి బీజం ఆమె చదివిన కేంద్రీయ విద్యాలయ, ఉప్పల్‌ బ్రాంచ్‌లో పడింది.

కుటుంబ సభ్యులతో సురభి

సురభి కంటే ముందు ఆమె అక్క వైష్ణవి రైఫిల్‌ షూటింగ్‌లో చేరింది. అక్క స్ఫూర్తితో సురభి కూడా ప్రాక్టీస్‌ మొదలుపెట్టింది. ఢిల్లీలో ఎన్‌సీసీ షూటింగ్‌ పోటీల్లో ఇద్దరూ పాల్గొన్నారు. కేరళలో 2017లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లోనూ ఇద్దరూ పాల్గొని నేషనల్స్‌కి క్వాలిఫై అయ్యారు. ఖరీదైన క్రీడాసాధనలో ఇద్దరిని కొనసాగించడం కష్టం కావడంతో తల్లిదండ్రులు సురభి ప్రాక్టీస్‌ మీద మాత్రమే దృష్టి పెట్టగలిగారు. సురభి శ్రమలో అమ్మానాన్నతోపాటు అక్క కూడా భాగం పంచుకుంటోంది.  
 
కాల పరీక్ష!

సురభి డైలీ రొటీన్‌ ఉదయం ఆరు గంటలకు మొదలవుతుంది. వార్మప్‌ ఎక్సర్‌సైజ్‌లు చేసుకుని ఏడు– ఏడున్నరకంతా ఇంటి నుంచి ప్రాక్టీస్‌ కోసం గచ్చిబౌలికి బయలుదేరుతుంది. నాగోలులో మెట్రో రైలు, ఆటోరిక్షాలు పట్టుకుని పది గంటలలోపు హైదరాబాద్‌లో సెంట్రల్‌ యూనివర్సిటీలో ఉన్న షూటింగ్‌ రేంజ్‌కు చేరుకుంటుంది. పది నుంచి ప్రాక్టీస్‌ మొదలవుతుంది. ఒంటి గంటకు లంచ్‌ బ్రేక్‌.

తిరిగి రెండున్నర నుంచి ఐదున్నర వరకు ప్రాక్టీస్, ఇంటికి చేరేటప్పటికి రాత్రి తొమ్మిదవుతుంది. కోచ్‌ సూచించిన విధంగా ఆహారాన్ని సిద్ధం చేసి బాక్సులు పెడుతుంది తల్లి లావణ్య. మెట్రో లేని రోజుల్లో, సిటీ బస్సులో వెళ్లాల్సిన రోజుల్లో అయితే దినచర్య ఐదింటికే మొదలయ్యేది. సురభి షూటింగ్‌ ప్రాక్టీస్‌తోపాటు ఉస్మానియాలో బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ మూడవ సంవత్సరం చదువుతోంది. మినిమమ్‌ అటెండెన్స్‌ చూసుకుంటూ ఎక్కువ సమయం ప్రాక్టీస్‌కే కేటాయిస్తోంది.

మెట్రోలో ప్రయాణించే సమయంలో పాఠాలను పూర్తి చేసుకుంటోంది. ఇన్ని సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నప్పటికీ కాలం పరీక్షల రూపంలో ప్రత్యేక పరీక్ష పెడుతుంది. షూటింగ్‌ పోటీలు, కాలేజ్‌ పరీక్షలు ఒకే సమయంలో వచ్చాయి. దాంతో ఐదవ సెమిస్టర్‌ పరీక్షలు రాయలేకపోయింది. జర్మనీలో పోటీలు పూర్తయిన వెంటనే ప్రస్తుతం పూణేలో గన్‌ ఫర్‌ గ్లోరీ నిర్వహిస్తున్న ప్రత్యేక లీప్‌ ప్రోగ్రామ్‌లో శిక్షణ తీసుకుంటోంది.  
 

ఖర్చు లక్షల్లో
తెలంగాణ రైఫిల్‌ అసోసియేషన్‌ ప్రాతినిధ్యం వహించిన సురభి బంగారు పతకాన్ని సాధించింది. సౌత్‌ జోన్, నేషనల్, ఇంటర్నేషనల్‌ లెవెల్స్‌లో రజతాలను మూటగట్టుకుంది. రైఫిల్‌ షూటింగ్‌ ప్రాక్టీస్‌లో వాడే బుల్లెట్‌ దాదాపుగా 30 రూపాయలవుతుంది. కాంపిటీషన్‌లకు ముందు ప్రాక్టీస్‌లో రోజుకు యాభై నుంచి వంద బుల్లెట్‌లు వాడాల్సి ఉంటుంది. బ్లేజర్, ట్రౌజర్, షూస్, గ్లవుజ్‌ వంటివన్నీ కలిపి రెండు లక్షలవుతాయి.

ఇక సురభి ఉపయోగించే పాయింట్‌ టూటూ వాల్టర్‌ రైఫిల్‌ ధర ఇరవై లక్షలు ఉంటుంది. సొంత రైఫిల్‌ లేకపోవడంతో సురభి అద్దె రైఫిల్‌తోనే ఇన్ని పోటీల్లో పాల్గొన్నది, పతకాలు సాధించింది. ఆమె ఇంటర్నేషనల్‌ టోర్నమెంట్స్‌కు అర్హత 2018లోనే సాధించింది. కానీ వెపన్‌ లేకపోవడంతో కొన్ని అవకాశాలను చేతులారా వదులుకోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితి క్రీడాకారులను మానసిక క్షోభకు గురి చేస్తుంది. సురభి వాటన్నింటినీ నిబ్బరంగా అధిగమించింది. మంచి రైఫిల్‌ అమరితే దేశానికి మరిన్ని పతకాలను తెచ్చి పెడుతుందనడంలో సందేహం లేదు.

రైఫిల్‌ కావాలి!
కాంపిటీషన్‌ల కోసం కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు అక్కడి వాతావరణానికి, ఆహారానికి అలవాటు పడడం ప్రధానం. అలాగే విండ్‌ అసెస్‌మెంట్‌ కూడా గెలుపును నిర్ణయిస్తుంది. మన గురి లక్ష్యాన్ని చేరడంలో అసలైన మెళకువ గాలి వీచే వేగాన్ని కచ్చితంగా అంచనా వేయగలగడమే. ఒలింపిక్స్, ఏషియన్‌ గేమ్స్‌లో మనదేశానికి పతకాలు సాధించడం నా ముందున్న లక్ష్యం. మా పేరెంట్స్‌ ఇప్పటికే వాళ్ల శక్తికి మించి ఖర్చు చేసేశారు. ప్రభుత్వం కానీ ఇతర స్పాన్సర్‌లు కానీ వెపన్‌కి సపోర్ట్‌ చేస్తే నేను నా ప్రాక్టీస్‌ మీద పూర్తి సమయాన్ని కేటాయించగలుగుతాను.
– రాపోలు సురభి భరద్వాజ్, షూటర్, వరల్డ్‌ కప్‌ విజేత

– వాకా మంజులారెడ్డి.

మరిన్ని వార్తలు